‘కోవిడ్-19 వైరస్ గంగానదిలో జీవించగలిగే అవకాశాల్లేవు. వివిధ క్రిములను నాశనం చేయగలిగే శక్తి గంగా జలానికి ఉంది. పైగా ఆవు పేడతో తయారుచేసిన విభూదితో ఉండే నాగ సాధువులు అందులో స్నానం చేస్తారు. అందుకే, లక్షలాది మంది నదిలో స్నానం చేసినా, కుంభమేళాలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి’, అని చెప్తూ ఆంధ్రప్రభ వార్తాపత్రిక వారు 14 ఏప్రిల్ 2021 న ఒక ఆర్టికల్ (ఆర్కైవ్డ్) ని ప్రచురించారు. ఆ ఆర్టికల్ ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ వార్తలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కోవిడ్-19 వైరస్ గంగానదిలో జీవించగలిగే అవకాశాల్లేవు. అందుకే, లక్షలాది మంది నదిలో స్నానం చేసినా, కుంభమేళాలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి.
ఫాక్ట్: కోవిడ్-19 వైరస్ గంగానదిలో జీవించగలిగే అవకాశాల్లేవని చెప్పటానికి ఇప్పటివరకైతే ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అంతేకాదు, కుంభమేళాలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని, దానికి కారణం గంగా జాలానికి ఉన్న రోగ నిరోధక శక్తి అని కూడా చెప్పలేము. కుంభ మేళ లాంటి జన ప్రవాహం ఉండే ఈవెంట్ వల్ల కోవిడ్-19 వ్యాప్తి చెందే ఆస్కారం ఉందని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన SOP డాక్యుమెంట్ లో చూడవొచ్చు. కావున, పోస్ట్ లో ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
‘ఆంధ్రప్రభ’ వారు ప్రచురించిన పూర్తి ఆర్టికల్ ని ఇక్కడ (ఆర్కైవ్డ్) చదవొచ్చు.
అయితే, ‘ఆంధ్రప్రభ’ వారు చెప్పినట్టు కోవిడ్-19 వైరస్ గంగానదిలో జీవించగలిగే అవకాశాల్లేవని ఏదైనా శాస్త్రీయ అధ్యయనం తెలిపిందా అని ఇంటర్నెట్ లో వెతకగా, అలాంటి అధ్యయనం ఏదీ కూడా లభించలేదు. కానీ, గంగా నదిలో ‘Bacteriophages’ ఉంటాయని, అవి కోవిడ్-19 వైరస్ పై పనిచేస్తాయో లేదో అధ్యయనం చేయాలని కొందరు అభిప్రాయ పడినట్టు మాత్రం తెలిసింది. ‘Bacteriophages’ అనేది ఒక వైరస్, అది సాధారణంగా బాక్టీరియా మీద పనిచేస్తుంది. కొరోనా అనేది ఒక వైరస్; బాక్టీరియా కాదు. కానీ, వైరస్ పై కూడా ‘Bacteriophages’ పని చేసే అవకాశం ఉందని, అయితే పనిచేస్తుందనే నిర్ధారణను రావడానికి చాలా అధ్యయనాలు మరియు పరీక్షలు నిర్వహించి చూడాలని ఒక రీసెర్చ్ ఆర్టికల్ లో తెలిపినట్టు ఇక్కడ చదవొచ్చు.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) కి సంబంధించిన ఒక ప్రొఫెసర్ కూడా గంగా నదిలో ఉండే ‘Bacteriophages’ మరియు కరోనా పై వాటి ప్రభావం గురించి మే 2020 లో చెప్పినట్టు ఇక్కడ చదవొచ్చు. అయితే, తను చెప్పిన దానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు ఇవ్వలేదు. ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ వారు ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యల తో ఆర్టికల్ ప్రచురించి, తర్వాత సరైన ఆధారాలు లేవని తీసేసినట్టు తెలిసింది.
అంతేకాదు, ‘గంగా నదిలో కరోనాను నిరోధించే కణాలు ఉన్నాయా అని పరిశోధన చేస్తున్న భారత శాస్త్రవేత్తలు’, అని ఒక పోస్ట్ 2020 లో వైరల్ అయినప్పుడు, గంగా నదిలో కరోనాను నిరోధించే కణాలు ఉన్నాయా అని చూడమని ఒక ప్రతిపాదన మాత్రమే తమకు వచ్చిందని, దానిపై తాము ఎటువంటి స్టడీ మొదలు పెట్టలేదని ఐసీఎంఆర్ (ICMR) వారు FACTLY కి తెలిపారు. మే 2020 లో ఈ విషయం పై FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. కాబట్టి, కోవిడ్-19 వైరస్ గంగానదిలో జీవించగలిగే అవకాశాల్లేవని చెప్పటానికి ఇప్పటివరకైతే ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.
అంతేకాదు, కుంభమేళాలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని, దానికి కారణం గంగా జలానికి ఉన్న రోగ నిరోధక శక్తి అని కూడా చెప్పలేము. ఎందుకంటే, హరిద్వార్ లో కోవిడ్-19 టెస్టులు కూడా ఎక్కువగా ఏమీ చేయట్లేదు. ఉదాహరణకి, 14 ఏప్రిల్ 2021 న సాయంత్రం 6 గంటల వరకు సుమారు 13.5 లక్షల మంది గంగా నదిలో స్నానం చేసినట్టు న్యూస్ ఆర్టికల్స్ లో చదవొచ్చు; కానీ, ఆ రోజు రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ లో కేవలం సుమారు 32 వేల మందికి మాత్రమే హరిద్వార్ జిల్లాలో (24 గంటల్లో) కోవిడ్-19 టెస్ట్ చేసినట్టు తెలిసింది.
హరిద్వార్ కుంభ మేళ కి వచ్చే వారు అందరు కోవిడ్-19 RTPCR నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ (72 గంటలు మించకుండా) తీసుకొని రావాలనే రూల్ ఉంది. చాలా మంది కోవిడ్ టెస్ట్ చేసుకొనే వస్తారు కాబట్టి, హరిద్వార్ లో తక్కువ టెస్టులు (అక్కడికి వచ్చే ప్రజల సంఖ్యతో పోలుస్తే) చేయడానికి అది కూడా ఒక కారణం అయ్యుండవచ్చు. అంతేకాదు, హరిద్వార్ నుండి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన తరువాత అప్పుడు కొంత మంది ప్రజలకు కోవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆ పాజిటివ్ కేసులు హరిద్వార్ జిల్లా పాజిటివ్ కేసుల రిపోర్ట్ లో జోడించరు. కుంభ మేళ లో పాల్గొని గుజరాత్ కి తిరిగి వచ్చిన వారిలో 49 మంది కోవిడ్-19 బారిన పడ్డారని చేప్పే వార్తని ఇక్కడ చదవొచ్చు.
ఒకవేళ నిజంగానే (పోస్ట్ లోచెప్పిన వివిధ కారణాల వల్ల) కుంభమేళ లో కోవిడ్-19 వైరస్ వ్యాపించే ఆస్కారం లేకుంటే, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కుంభమేళ కి సంబంధించి రిలీజ్ చేసిన నిబంధనల్లో కోవిడ్-19 జాగ్రత్తల గురించి ప్రస్తావించరు కదా. అంతేకాదు, ఇలాంటి జన ప్రవాహం ఉండే ఈవెంట్ వల్ల కోవిడ్-19 వ్యాప్తి చెందే ఆస్కారం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన SOP డాక్యుమెంట్ లో చూడవొచ్చు. కోవిడ్-19 కి సంబంధించి హరిద్వార్ లో హాస్పిటల్ బెడ్లు కూడా ఏర్పాటు చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, కోవిడ్-19 వైరస్ గంగానదిలో జీవించగలిగే అవకాశాల్లేవని చెప్పటానికి ఇప్పటివరకైతే ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.