ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 కేసులు బాగా పెరగటంతో, సోషల్ మీడియాలో (ఈ పోస్టు మరియు ఈ పోస్టు) కుంభమేళాకు సంబంధించి, అక్కడకు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వెళ్ళటం గురించి మరియు అక్కడ జనాలు మాస్కులు సరిగ్గా ధరించకపోవటం గురించి బాగా షేర్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజం ఉందొ చూద్దాం.
క్లెయిమ్: అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ మరియు ఇతర సాధువులు మాస్కులు ధరించకుండా ప్రస్తుత కుంభమేళాలో పాలుగొంటున్న ఫోటోలు.
ఫాక్ట్: రెండు ఫోటోలు ప్రస్తుత 2021 కుంభమేళాలోవి కాదు. మొదటి ఫోటో (అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఉన్న ఫోటో) 2019 ప్రయాగరాజ్ కుంభమేళాలో తీశారు. రెండొవ ఫోటో కూడా కుంభమేళాలో 2013 లో తీసింది. కావున, పోస్ట్ లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఫోటో 1 :
మొదటి ఫోటో ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు మనకు న్యూస్ 18 యొక్క అమిత్ షా ఫోటో గేలరీ కనపడుతుంది. దీనిలో స్పష్టంగా మనకు తెలిసేది, అమిత్ షా 2019లో ప్రయాగరాజ్ కుంభమేళా కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఇది అని. అక్కడ అయన యోగి ఆదిత్యనాథ్ తో కలిసి పవిత్ర స్నానం చేసినట్టుగా తెలుస్తుంది.
ఇంకా ఆ ఫోటో గురించి వెతికినప్పుడు, కొన్ని పత్రిక కథనాల్లో కూడా ఈ విషయం గురించి ప్రస్తావన ఉన్నది. అవి మనం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. కావున, ఈ ఫోటో ప్రస్తుతం కుంభమేళాది కాదు అని కచ్చితంగా చెప్పవచ్చు.
ఫోటో 2 :
రెండొవ ఫోటో ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు 2013 లో పబ్లిష్ ఐన ఈ ఆర్టికల్ లో మనకు ఆ ఫోటో కనబడుతుంది. ఈ ఆర్టికల్ రాసిన ఆ రచయిత 2013 లో తాను చూసిన కుంభమేళా ను, తన అనుభవాలను ఇందులో షేర్ చేసుకొన్నారు. కావున, ఈ ఫోటో ప్రస్తుత కుంభమేళాది కాదు, 2013 లో జరిగినది.
హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాలో రెండు రోజుల్లో కనీసం 1000 కోవిడ్-19 కేసులు ఉన్నట్లు వచ్చిన వార్తల దృష్ట్యా, ఇలాంటి పోస్ట్ లు తప్పుదోవ పట్టించే వాదనలతో షేర్ చేస్తున్నారు. వార్తా నివేదికల ప్రకారం, ప్రస్తుతం కొనసాగుతున్న కుంభమేళాను కోవిడ్-19 నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారు. అలాగే, కుంభ్ కోసం గుమిగూడే భక్తులకు రాకకు 72 గంటల ముందు నెగటివ్ ఆర్ టి-పిసిఆర్ పరీక్షా నివేదిక తప్పనిసరి చేయబడింది. హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళా యొక్క కొన్ని చిత్రాలను ఇక్కడ చూడవచ్చు.
చివరకు, పాత ఫోటోలను చూపించి ప్రస్తుత కుంభమేళాలోవి అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.