Fake News, Telugu
 

కాబా లేకుంటే భూ భ్రమణం ఆగిపోతుందని వెల్లడిస్తూ ఎటువంటి పరిశోధన జరగలేదు

0

కాబా లేకుంటే ప్రపంచం ఆగిపోతుంది. ఎందుకంటే భూభ్రమణం తవాఫ్ మరియు నమాజ్ కారణంగా జరుగుతుంది” అని ప్రొఫెసర్ లారెన్స్ ఇ. జోసెఫ్ అనే వ్యక్తి తను చేసిన పరిశోధనల ద్వారా వెల్లడించాడని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది . దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కాబా లేకుంటే ప్రపంచం ఆగిపోతుందని, ఎందుకంటే భూభ్రమణం తవాఫ్ మరియు నమాజ్ కారణంగా జరుగుతుందని ప్రొఫెసర్ లారెన్స్ ఇ. జోసెఫ్ తన పరిశోధన ద్వారా వెల్లడించాడు.

ఫాక్ట్: లారెన్స్ ఇ. జోసెఫ్ లేదా మరే ఇతర వ్యక్తి కానీ ఈ తరహా పరిశోధన చేయలేదు. మనిషి, మతం పుట్టక ముందే 450 కోట్ల ఏళ్ల నుంచే భూ భ్రమణం జరుగుతుంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, ముస్లింలు పవిత్రంగా భావించే మక్కాలో ఉన్న కాబా గురించి ఈ తరహా పరిశోధన ఏదైనా జరిగిందా అని సంబంధిత వెబ్‌సైట్లలో వెతకగా, మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఇక వైరల్ పోస్టులో పేర్కొన్న ప్రొఫెసర్ లారెన్స్ ఇ. జోసెఫ్ కూడా తన పుస్తకాలలో, ఇంటర్వ్యూలలో, పరిశోధనలలో కూడా ఎక్కడా ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇక ఈ పోస్టులోని విషయం గురించి మరింత వెతకగా, ఇది 2019 లో ఒక అనామక ఇండోనేషియా బ్లాగులో ఎటువంటి ఆధారాలు లేకుండా రాయబడిందని గుర్తించాం.

అయితే, గతంలో వివిధ కారణాల వల్ల హజ్ యాత్రను ఇప్పటికే 40 సార్లకు పైగా రద్దు చేశారు. అప్పుడు కూడా భూ భ్రమణం ఆగలేదు.  పైగా, భూమి ఏర్పడిన 450 కోట్ల ఏళ్ల నుంచి కూడా భూ భ్రమణం జరుగుతుంది మరియు సుమారు 1400+ సంవత్సరాల క్రితం మాత్రమే ఇస్లాం మతం వృద్ధి చెందింది. పై ఆధారాలను బట్టి, భూ భ్రమణం జరుగడానికి ఎటువంటి మతంతో కానీ ఆచారాలతో కానీ సంబంధం లేదని నిర్ధారించవచ్చు.

చివరిగా, కాబా లేకుంటే భూ భ్రమణం ఆగిపోతుందని చెప్తూ ఎటువంటి  పరిశోధన జరగలేదు.

Share.

About Author

Comments are closed.

scroll