ఇటీవల ముగిసిన 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలోనే, “2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాక ఆయన అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభలో ట్రంప్ మాట్లాడుతుండగా ‘మోదీ మోదీ మోదీ’ నినాదాలతో సభ వేదిక మార్మోగింది. ట్రంప్ కూడా మోడీ గ్రేట్ గాయ్ అన్నారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక జరిగిన ట్రంప్ విజయోత్సవ సభ ‘మోదీ మోదీ మోదీ’ నినాదాలతో హోరెత్తిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ట్రంప్ విజయోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రజలు ‘మోదీ’ నినాదాలు చేయలేదు. ఈ వైరల్ వీడియో క్లిప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా 06 నవంబర్ 2024న ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో ట్రంప్ విజయోత్సవ ప్రసంగం (విక్టరీ స్పీచ్) ఇచ్చిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ప్రసంగంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించలేదు. వాస్తవంగా ట్రంప్ ఈ వైరల్ వీడియో క్లిప్‌లో రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jr (Robert F. Kennedy Jr) గురించి మాట్లాడుతున్న సందర్భంలో ‘బాబీ, బాబీ, బాబీ’ అని నినాదాలతో సభ వేదిక మార్మోగింది. రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jr ను ‘బాబీ’ అని కూడా పిలుస్తారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోను మనం నిశితంగా పరిశీలిస్తే, ఈ వీడియోలో ‘PBS NEWS’ లోగోను చూడవచ్చు. ‘PBS NEWS’ అనేది అమెరికాకు చెందిన వార్తా సంస్థ.
దీని ఆధారంగా, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ వీడియో యొక్క పూర్తి నిడివి గల వీడియోను ‘PBS NEWS’ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో కన్నుగొన్నాము. ఈ వీడియోను ‘PBS NEWS’ 06 నవంబర్ 2024న “WATCH LIVE: Trump hosts election night watch party in West Palm Beach, Florida” అనే శీర్షికతో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా 06 నవంబర్ 2024న ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో ట్రంప్ విక్టరీ స్పీచ్ ఇచ్చిన దృశ్యాలను చూపిస్తుంది.
ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, టైంస్టాంప్ 7:52:22 వద్ద వైరల్ వీడియో క్లిప్ మొదలు అవుతుంది అని తెలిసింది. అలాగే ఈ ప్రసంగంలో భారత ప్రధాని మోదీ గురించి ఎక్కడ ట్రంప్ మాట్లాడలేదని స్పష్టం అవుతోంది. వాస్తవంగా ట్రంప్ ఈ వైరల్ వీడియో క్లిప్‌లో రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jr (Robert F. Kennedy Jr) గురించి మాట్లాడుతున్న సందర్భంలో ‘బాబీ, బాబీ, బాబీ’ అని నినాదాలతో సభ వేదిక మార్మోగింది. రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jr ను ‘బాబీ’ అని కూడా పిలుస్తారు (ఇక్కడ). ఈ నినాదాల నడుమ ట్రంప్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jr గురించి ఇలా అన్నాడు, “అతను గొప్ప వ్యక్తి మరియు అతను నిజంగా అర్థం చేసుకున్నాడు. అతను కొన్ని పనులు చేయాలనుకుంటున్నాడు, మేము అతనిని ముందుకు వెళ్లనివ్వబోతున్నాం.“( ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించగా). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలో వినిపిస్తుంది ‘మోదీ, మోదీ’ అనే నినాదాలు కాదని, అవి ‘బాబీ బాబీ’ అని రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jr గురించి ట్రంప్ ప్రస్తావిస్తుండగా చేసిన నినాదాలు అని మనం నిర్ధారించవచ్చు.
రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jr తొలుత 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, తరువాత ఆయన అమెరికా అధ్యక్ష రేసు నుండి తప్పుకుని డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చాడు. రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jr గురించి సమాచారం ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ట్రంప్ విజయోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రజలు ‘మోదీ’ నినాదాలు చేశారంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా, అక్కడ ‘బాబీ, బాబీ’ అని రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ Jrని ఉద్దేశించి నినాదాలు చేశారు.