Fake News, Telugu
 

ఉల్లిపాయ/అగ్గిపుల్ల తేలు విషానికి విరుగుడుగా పనిచేస్తుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

Update (21 July 2023):

తేలు కుట్టగానే అగ్గిపుల్లలలో ఉండే పొడిని నీళ్ళలో కలిపి ఆ ప్రదేశంలో రాస్తే కేవలం రెండు నిముషాల్లో విషం పోతుందని చెప్తూ మరొక పోస్టు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

వైద్యరంగ నిపుణులు (ఇక్కడ & ఇక్కడ) చెప్పిన దాని ప్రకారం, అగ్గిపుల్ల పొడి తేలు విషానికి విరుగుడుగా పనిచేస్తుందని ఎక్కడా నిరూపించబడలేదు. తేలు కాటు గురించి మరింత సమాచారం కోసం ఈ క్రింద పేర్కొన్న వివరాలు చూడవచ్చు.

Published (31 May 2023):

తేలు కుట్టిన వెంటనే ఉల్లిపాయ సగానికి కోసి తేలు కుట్టిన చోట రుద్దుతూ ఉంటే ఐదు నిమిషాలలో తేలు విషం విరిగిపోతుందని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: తేలు కుట్టిన చోట ఉల్లిపాయని కోసి రుద్దుతూ ఉంటే ఐదు నిమిషాల్లో విషం విరిగిపోతుంది.

ఫాక్ట్: ఉల్లిపాయ తేలు విషానికి విరుగుడుగా పనిచేస్తుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణంగా తేలు కాటు ప్రాణాంతకమైనది కాదు. కానీ కొన్ని జాతులకు చెందిన  తేళ్ళ విషం ప్రాణాంతకమైనదిగా ఉంటుంది. ఉల్లిపాయలో వాపుని తగ్గించే గుణం ఉన్నప్పటికీ, ఇది తేలు కాటుకి సమర్ధవంతంగా పనిచేయకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రమాదకరమైన జాతుల తేళ్ళు కుట్టినప్పుడు వాపు ఉండదు. అందువలన ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

తేలు కుట్టినప్పుడు ఆ ప్రదేశం దగ్గర తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే తేలు కాటు సాధారణంగా ప్రాణాంతకం కాదు. కొన్ని గంటలలో దానంతట అదే నయం అవుతుంది. కానీ చిన్న పిల్లలకు, వృద్ధులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ప్రపంచంలోని 1500 లకు పైగా తేళ్ళ జాతులలో సుమారు 30 ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేయగలవని అధ్యయనాలు చెప్తున్నాయి.

ఇక ఉల్లిపాయలు తేలు విషానికి విరుగుడుగా పనిచేస్తాయని  చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఉల్లిపాయలోని వాపుని నివారించే గుణం (Anti- inflammatory property) వల్ల తేనెటీగల కాటు వల్ల వచ్చే వాపుని, నొప్పిని కొంత వరకు నివారించవచ్చు. కానీ అదే పద్ధతి తేలు కాటుకు సమర్ధవంతంగా పనిచేయకపోవచ్చు, ఎందుకంటే తేలు విషం పని చేసే విధానం వేరుగా ఉంటుంది. పైగా కొన్ని రకాల విషపూరితమైన తేళ్ళు కాటు వేసినప్పుడు వాపు ఉండదు.

అయితే తేలు కుట్టినప్పుడు అది ప్రాణాంతకమైన జాతికి చెందినదా లేదా అనే విషయం కచ్చితంగా చెప్పలేం కాబట్టి ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆసుపత్రికి వెళ్ళే లోపు నొప్పిని తట్టుకోవడానికి తేలు కుట్టిన చోట ఐస్ ప్యాక్ పెట్టుకోవచ్చు. వీలైతే ఆ తేలుని గుర్తించడం లేదా ఫోటో తీయడం వల్ల దానికి సంబంధించిన విరుగుడిని(Antidote) సులభంగా పొందవచ్చు.

చివరిగా, ఉల్లిపాయ తేలు విషానికి విరుగుడుగా పనిచేస్తుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll