Fake News, Telugu
 

నీరవ్ మోదీ బీజేపీ నేతలకు 546 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినట్టు లండన్ కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వలేదు

0

బీజేపీ నేతలకు 546 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినట్టు లండన్ కోర్టులో నీరవ్ మోదీ స్టేట్మెంట్ ఇచ్చాడని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బీజేపీ నేతలకు 546 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినట్టు లండన్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నీరవ్ మోదీ.

ఫాక్ట్: నీరవ్ మోదీ ఇప్పటివరకు హాజరైన కోర్టు విచారణలో, బ్యాంకు స్కాంలో బీజేపీ నేతలకు 546 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినట్టు ఎప్పుడు కూడా చెప్పలేదు. నీరవ్ మోదీ అప్పగింత (extradition) కేసులో తుది నిర్ణయంపై ఈ వారం కోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. నీరవ్ మోదీ ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాలు జైలులో ఉన్నాడు. ఈ కేసు యొక్క విచారణలో ఎక్కడా కూడా బీజేపీ నేతలకు 546 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినట్టు స్టేట్మెంట్ ఇవ్వలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, నీరవ్ మోదీ అలా అన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నీరవ్ మోదీ నిజంగానే లండన్ కోర్టులో ఏదైనా రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించి ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు దీనికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు.

నీరవ్ మోదీని మార్చి 2019లో ఇంగ్లాండ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత లండన్ కోర్టు విచారణకు నేరుగా హాజరయ్యాడు. ఐతే 2019లో జరిగిన విచారణ సందర్భంలో మిమ్మల్ని భారత్‌కు అప్పగించడానికి అంగీకారమేనా అన్న ప్రశ్నకు జవాబిస్తూ ‘నాకు అంగీకారం కాదు’ అన్న రెండు విషయాలు తప్ప బీజేపీ నేతలకు 546 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినట్టు ఏమి మాట్లాడలేదు.

2020 డిసెంబర్‌లో వాండ్స్‌వర్త్ జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యాడు. ఈ కోర్టు విచారణకు సంబంధించిన వార్తలు ఆయా సమయాల్లో అన్ని ప్రధాన వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ విచారణలో కూడా నీరవ్ మోదీ కేవలం పేరు, పుట్టిన తేదీని నిర్దారించాడే తప్ప వేరే మాట మాట్లాడలేదని వార్తా కథనాలు రాసాయి. పోస్టులో చెప్తునట్టు నీరవ్ మోదీ బీజేపీ నేతలకు 546 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినట్టు ఎప్పుడు చెప్పలేదు.

నీరవ్ మోదీ అప్పగింత (extradition) కేసులో తుది నిర్ణయంపై ఈ వారం కోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. నీరవ్ మోదీ ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాలు జైలులో ఉన్నాడు. ఈ కేసు యొక్క విచారణలో ఎక్కడా కూడా బీజేపీ నేతలకు 546 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినట్టు స్టేట్మెంట్ ఇవ్వలేదు.

ఇదే వార్త 2019 నుండే సోషల్ మీడియాలో షేర్ అవుతూ వస్తుంది. పైగా నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయే దాంట్లో బీజేపీ హస్తం ఉందని వేరొక వెర్షన్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నీరవ్ మోదీ లండన్ కోర్టులో కాంగ్రెస్ నాయకులకు లంచం ఇచ్చినట్టు అంగీకరించాడన్న వార్త కూడా వైరల్ అయినప్పుడు FACTLY దాన్ని తప్పని చెప్తూ ఫాక్ట్-చెక్ ఆర్టికల్ రాసింది.  

చివరగా, నీరవ్ మోదీ బీజేపీ నేతలకు 546 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినట్టు లండన్ కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll