భారత రాజ్యాంగ పీఠిక నుండి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ అనే పదాలను తొలగించారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తున్నారు. ఈ పోస్టులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: భారత రాజ్యాంగ పీఠిక నుండి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలు తొలగించారు.
ఫాక్ట్(నిజం): సుప్రీం కోర్టు కేశవానంద భారతి కేసులో, పీఠిక రాజ్యాంగంలో భాగమని, దానిని సవరించవచ్చు కానీ, దానిలోని ప్రాథమిక అంశాలను పార్లమెంటు సవరించలేదని చెప్పింది. పైగా, రాజ్యాంగ పీఠిక నుండి ఈ పదాలను తొలగించాలి అంటే దానికి సవరణ ప్రక్రియ అవసరం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
కొత్త పార్లమెంటును ప్రారంభించిన రోజున, పార్లమెంటు సభ్యులందరికి భారత రాజ్యాంగం యొక్క కాపీ, కొత్త పార్లమెంటును కలిగి ఉన్న స్మారక నాణెం మరియు స్టాంపుతో కూడిన బహుమతి కిట్‌ను అందించారు. ప్రతిపక్ష నాయకులు, తమకు ఇచ్చిన రాజ్యాంగం కాపీలలో ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ అనే పదాలు లేవని, వాటిని ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు (ఇక్కడ మరియు ఇక్కడ) .ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఈ క్లెయిమ్ వైరల్ అవుతోంది.
ఈ ఆరోపణలకు స్పందిస్తూ, సభ్యులకు ఇచ్చింది రాజ్యాంగం యొక్క ఒరిజినల్ కాపీలు అని, ఆ పదాలు సవరణ ద్వారా చేర్చినవి కాబట్టి రాజ్యాంగం రూపొందించినప్పుడు అవి లేవు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారత రాజ్యాంగ పీఠిక ఒరిజినల్ కాపీలో ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’, ‘ఇంటెగ్రిటీ’ అనే పదాలు లేవు. ఇవి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పీఠికలో జోడించబడ్డాయి.
రాజ్యాంగ పీఠిక రాజ్యాంగం యొక్క ప్రధాన సారాంశాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అది బేసిక్ స్ట్రక్చర్లో ఒక ముఖ్యమైన భాగం. రాజ్యాంగ పీఠిక నుండి పదాలను తొలగించాలంటే, ఆర్టికల్ 368లో పేర్కొన్న విధంగా రాజ్యాంగ సవరణ ప్రక్రియ అవసరం. ఆర్టికల్ 368 ప్రకారం ప్రియంబుల్ సవరణ చెయ్యాలి అంటే
- సవరణ బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టాలి
- దీనిపై పార్లమెంటు సభ్యులు చర్చలు జరపాలి
- ఈ బిల్లుకు ప్రత్యేక మెజారిటీ ఓటు అవసరం. అంటే, బిల్లును మెజారిటీ సభ్యులు, అలాగే సభకు హాజరైన మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో కనీసం 2/3 మెజారిటీతో ఆమోదించబడాలి. దీనిని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి.
- బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే అది చట్టంగా మారి సవరణ అమల్లోకి వస్తుంది.
కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు, రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో భాగమని, దానిని సవరించవచ్చు కానీ, దానిలోని ప్రాథమిక అంశాలను పార్లమెంటు సవరించలేదని చెప్పింది.
చివరిగా, భారత రాజ్యాంగ పీఠిక నుండి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను తొలగించలేదు.