Fake News, Telugu
 

బద్రీనాథ్ ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మౌలానా లతీఫ్‌ కాస్మీకీ, ఈ కూల్చివేత వీడియోకి సంబంధంలేదు

0

“ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో మౌలానా లతీఫ్‌ కాస్మీ గతంలో బద్రీనాథ్ ఆలయాన్ని బదృద్దీన్‌ షా మసీదు అని వివాదాస్పద వాఖ్యలు చేసాడు. ఆ వ్యాఖ్యలు విన్న ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అతని మసీదుకి అనుమతులున్నాయా అని విచారించమని అధికారులను ఆదేశించాడు. ఆ మసీదు అక్రమ నిర్మాణం అని తేలడంతో కూల్చేసారు”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బద్రీనాథ్ ఆలయాన్ని మసీదు అని వివాదాస్పద వాఖ్యలు చేసిన మౌలానా లతీఫ్‌ కాస్మీ అక్రమంగా ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో నిర్మించిన మసీదుని అధికారులు కూల్చేస్తున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియోలో కూలగోడుతున్న నిర్మాణాలకు, బద్రీనాథ్ ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మౌలానా లతీఫ్‌ కాస్మీకి సంబంధం ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదు. వీడియో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌ జిల్లాకి సంబంధించింది కాదు; ఉన్నావ్‌ జిల్లాకి సంబంధించింది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆ వీడియో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో తీసినట్టు తెలిసింది.  ఉన్నావ్ జిల్లాలో నీటిపారుదల శాఖ వారు ఆక్రమ నిర్మాణాలను తొలగిస్తూ 2.5 ఎకరాల భూమిని భూ-మాఫియా నుండి విడిపించిందని ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖ వారు ట్వీట్ చేసారు. ఇదే విషయం చెప్తూ, ఉత్తరప్రదేశ్ జల శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి మహేంద్ర సింగ్ పెట్టిన పోస్ట్‌ని ఇక్కడ చూడవొచ్చు.

ఉన్నావ్ జిల్లాలో ఆక్రమ నిర్మాణాలను నీటిపారుదల శాఖ వారు తొలగించడం గురించి వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ఫోటోలను కూడా మంత్రి మహేంద్ర సింగ్ పోస్ట్ చేసాడు. ఆర్టికల్స్ ఫోటోలను ఇక్కడ చూడవొచ్చు. ఆ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. అర్టికల్స్‌లో మౌలానా లతీఫ్‌ కాస్మీకి సంబంధించిన ఒక మసీదుని అధికారులు కూల్చేసినట్టు ఎక్కడా కూడా లేదు.

సహరాన్‌పూర్‌ జిల్లాలోని దారుల్ ఉలూమ్ దియోబంద్‌కి చెందిన మౌలానా అబ్దుల్ లతీఫ్‌ కాస్మీ బద్రీనాథ్ ఆలయం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడని 2017లో వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ఆ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్పందిస్తూ – “ఇది సమాజంలో సామరస్యాన్ని మరియు శాంతికి భంగం కలిగించే ప్రయత్నం. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టింది మరియు తప్పకుండా చర్యలు తీసుకోబడుతాయి”, అని అన్నట్టు తెలిసింది.

అయితే, పోస్ట్‌లోని వీడియోలో కనపడుతున్న ఆక్రమ నిర్మాణాల కూల్చివేతకీ, మౌలానా లతీఫ్‌ కాస్మీకి సంబంధం ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదు. వీడియో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌ జిల్లాకి సంబంధించింది కాదు; ఉన్నావ్‌ జిల్లాకి సంబంధించింది. సహరాన్‌పూర్‌, ఉన్నావ్‌ జిల్లాల్లో ఉన్న ఆయా నగరాలకి సుమారు 500 కిలోమీటర్లకి పైగా దూరం ఉన్నట్టు తెలిసింది.

చివరగా, బద్రీనాథ్ ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మౌలానా లతీఫ్‌ కాస్మీకీ, పోస్ట్‌లోని కూల్చివేత వీడియోకి సంబంధంలేదు. వీడియో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌ జిల్లాకి సంబంధించింది కాదు; ఉన్నావ్‌ జిల్లాకి సంబంధించింది.

Share.

About Author

Comments are closed.

scroll