Fake News, Telugu
 

కేరళలో నిర్మంచిన ఒక ఇల్లు ఫోటోని వై.యెస్. జగన్ ప్రభుత్వం పేదలకు పంచనున్న ఇళ్ల చిత్రమని షేర్ చేస్తున్నారు

0

వై. యెస్. జగన్ ప్రభుత్వం పేదల కోసం నూతనంగా నిర్మిస్తున్న ఇళ్ల దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వై. యెస్. జగన్ ప్రభుత్వం పేదల కోసం నూతనంగా నిర్మిస్తున్న ఇళ్ల యొక్క ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్న ఇల్లు కేరళ రాష్ట్రంలో నిర్మించారు. జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్’ ద్వార పేద కుటుంబాలకు పంచనున్ను ఇళ్లు, ఫోటోలో కనిపిస్తున్న ఇంటితో పోలి లేవు. ఈ ఫోటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘Kerala Home Designs’ ఫేస్బుక్ పేజీ 25 డిసెంబర్ 2020 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. కేరళ రాష్ట్రంలో మూడు లక్షలతో రూపొందించిన అద్భుత ఇల్లు ఇదని పోస్టులో తెలిపారు. తమ ప్రైవేటు ఫేస్బుక్ గ్రుప్‌ సభ్యులకి ఈ గృహ నిర్మాణం ప్లాన్‌ని ఉచితంగా అందిస్తామని పోస్టులో తెలిపారు. ఇదే విషయాన్ని తెలుపుతూ, మరో గృహ నిర్మాణ ఫేస్బుక్ గ్రూప్ కూడా ఈ ఇంటి ఫోటోని షేర్ చేసింది.

వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్’ ద్వారా 30 లక్షల పేద కుటుంబాలకు ఉచిత ఇళ్లని అందించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. యెస్. జగన్ మోహన్ రెడ్డి 03 జూన్ 2021 నాడు ప్రారంభించారు. 2020 ఆగష్టు నెలలో ‘వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్’ కింద నిర్మించిన మోడల్ హౌస్‌ని ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. ‘వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్’ మోడల్ హౌస్ ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 

‘వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్’ మోడల్ హౌస్ ఫోటోని పోస్టులో షేర్ చేసిన ఫోటోతో పోల్చి చూడగా, పోస్టులో షేర్ చేసిన ఫోటోలోని ఇల్లు ‘వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్’ కింద నిర్మించినది కాదని స్పష్టమయ్యింది.

చివరగా, కేరళలో నిర్మంచిన ఒక ఇంటి ఫోటోని జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్’లో భాగంగా పేదలకు పంచనున్న ఇళ్ల చిత్రాలని  షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll