Fake News, Telugu
 

‘బీజేపీ ఈ సారి 400 సీట్లు దాటుతుందని’ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యంగంగా చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు

0

ఈ సారి బీజేపీ 400కు పైగా సీట్లు కైవసం చేసుకోబోతుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నోరు జారినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఖర్గే నాలిక కర్చుకున్నారంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఈ సారి బీజేపీ 400కు పైగా సీట్లు కైవసం చేసుకోబోతుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నోరు జారిన వీడియో.

ఫాక్ట్(నిజం):  “అబ్ కి బార్ 400 పార్” అనే బీజేపీ ఎన్నికల నినాదాన్ని ఉద్దేశిస్తూ అయన వ్యంగంగా ఈ వ్యాఖ్యలు చేశారే తప్ప, నిజంగానే బీజేపీ గెలుస్తుందన్న ఉద్దేశంతో కాదు. ఆ తరవాత తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఖర్గే మాట్లాడుతూ ‘బీజేపీకు ఈ సారి 100 సీట్లు కూడా రావని అన్నారు’. ఖర్గే ప్రసంగాన్ని అసంపూర్ణంగా షేర్ చేయడంతో ఈ వాదన షేర్ అవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

2024 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఆయన బీజేపీను ఉద్దేశించి వ్యంగంగా ఈ వ్యాఖ్యలు చేసాడు. షేర్ అవుతున్న వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా ఈ క్లిప్ యొక్క పూర్తి ఫూటేజ్ మాకు కనిపించింది.

బడ్జెట్ సమావేశాలకు సంబంధించి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపుతూ రాజ్యసభలో చేసిన ప్రసంగంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే మహిళల భద్రత, రిజర్వేషన్ అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ “మహిళా రిజర్వేషన్ కు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనప్పుడు దానికి వ్యతిరేకంగా కౌంటర్ అఫిడవిట్ ఎందుకు ఇచ్చారు?మీరు అలా చేయాల్సింది కాదు. మీకు ఇప్పటికే 330-34 సీట్లు ఉన్నాయి. ఈ సారి 400 దాటుతున్నట్లు కనిపిస్తోంది”అని అన్నారు.”

ఐతే 400 దాటడానికి సంబంధించి “అబ్ కి బార్ 400 పార్” అనే బీజేపీ ఎన్నికల నినాదాన్ని ఉద్దేశిస్తూ అయన వ్యంగంగా ఈ వ్యాఖ్యలు చేశారే తప్ప, నిజంగానే బీజేపీ గెలుస్తుందని ఆయన అంచనా వేయలేదు. మల్లికార్జున్‌ ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీలు చప్పట్లు కొడుతూ, బల్లలు చ‌రుస్తూ స్పందించారు.

ఐతే ఆ తరవాత తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఖర్గే మాట్లాడుతూ ‘బీజేపీకు ఈ సారి 100 సీట్లు కూడా రావని అన్నారు’. ఐతే ఖర్గే ప్రసంగంలోని ఈ భాగాన్ని తీసేసి, కేవలం ‘బీజేపీ 400 సీట్లు దాటుతుందన్న’ వ్యాఖ్యలను మాత్రమే షేర్ చేయడంతో ఖర్గే ఉద్దేశం అదేనంటూ అర్ధం వచ్చింది. కానీ నిజానికి ఖర్గే ఉద్దేశం అది కాదు. ఒకవేళ ఖర్గే ఉద్దేశం అదే అయ్యుంటే అయన తిరిగి తన ప్రసంగంలో  ‘బీజేపీకు ఈ సారి 100 సీట్లు కూడా రావు’ అంటూ వ్యాఖ్యానించి ఉండేవారు కాదు. కాబట్టి ఖర్గే వ్యాఖ్యలను అసంపూర్ణంగా షేర్ చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, ‘బీజేపీ ఈ సారి 400 సీట్లు దాటుతుందని’ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యంగంగా చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll