Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ యొక్క బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయలేదు

0

‘మదర్ థెరిసా, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క బ్యాంకు ఖాతాలు భారతదేశం అంతటా స్తంభింపచేసిన కేంద్ర ప్రభుత్వం’ అని చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మదర్ థెరిసా, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క బ్యాంకు ఖాతాలు భారతదేశం అంతటా స్తంభింపచేసిన కేంద్ర ప్రభుత్వం.

ఫాక్ట్(నిజం): కేంద్ర ప్రభుత్వం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయలేదు, కేవలం ఆ సంస్థ యొక్క FCRA లైసెన్స్ రెన్యువల్ అప్లికేషన్ తిరస్కరించింది. ఐతే లైసెన్స్ రెన్యువల్ అంశం పరిష్కారం అయ్యేవరకు తమ సంస్థ యొక్క అన్ని బ్రాంచుల యొక్క విదేశీ విరాళాల అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని కోరుతూ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాని కోరింది. ఇదే విషయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల 25 డిసెంబర్ 2021న  ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) కింద మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క లైసెన్స్ రెన్యువల్ అప్లికేషన్ తిరస్కరించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, 2010 మరియు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రూల్స్ (FCRR) 2011 కింద పాటించాల్సిన అర్హత ప్రమాణాలను పాటించనందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక ప్రెస్ రిలీజ్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే లైసెన్స్ రెన్యువల్ విషయం పరిష్కరించబడే వరకు విదేశీ విరాళాలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఆపరేట్ చేయకూడదంటూ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ దేశంలోని తమ అన్ని బ్రాంచులకు సమాచారాన్ని అందించింది. అలాగే మిషనరీస్ ఆఫ్ ఛారిటీ తమ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయాలనీ కోరుతూ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాకి కూడా ఒక లేఖ కూడా రాసింది.

ఐతే జరిగిన ఈ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ (స్తంభింపచేసిన) చేసిందంటూ తప్పుగా అర్ధం చేసుకొని కథనాలను ప్రచారం చేసారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసిందంటూ ట్వీట్ చేయడంతో ఈ వార్త వైరల్ అయ్యింది.

ఈ వార్త వైరల్ అవడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇదే విషయంపై స్పష్టతనిస్తూ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయలేదని, కేవలం ఆ సంస్థ యొక్క రెన్యువల్ అప్లికేషన్ తిరస్కరించామని హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రెస్ నోట్‌లో స్పష్టంగా పేర్కొంది. తమ సంస్థ యొక్క అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థే స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాని కోరిందని కూడా ఈ నోట్‌లో పేర్కొన్నారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయలేదని, తామే తమ సెంటర్ల యొక్క అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని కోరినట్టు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ జారీ చేసిన స్టేట్మెంట్ ఇక్కడ చూడొచ్చు.

చివరగా, కేంద్ర ప్రభుత్వం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll