Fake News, Telugu
 

మార్ఫ్ చేసిన ఫోటో చూపెడుతూ గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని ఖురాన్‌ని ప్రచారం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

గుజరాత్ శాసన సభ్యుడు, బహుజన్ సమాజ్‌వాది పార్టీ నేత RS ప్రవీణ్ కుమార్ స్నేహితుడు, జిగ్నేష్ మేవాని ఖురాన్‌ని చేతిలో పట్టుకొని బహిరంగ ప్రచారం చేస్తున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. జిగ్నేష్ మేవాని ఒక చేతిలో భారత రాజ్యాంగాన్ని, మరొక చేతిలో ఖురాన్‌ని పట్టుకున్న దృశ్యాన్ని మనం ఈ ఫోటోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గుజరాత్ శాసన సభ్యుడు జిగ్నేష్ మేవాని ఖురాన్‌ని పట్టుకొని బహిరంగ ప్రదర్శన చేస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. అసలు ఫోటోలో జిగ్నేష్ మేవాని ఒక చేతిలో భారత రాజ్యాంగం గురించి రాసిన పుస్తకాన్ని, మరొక చేతిలో మనుస్మృతిని పట్టుకున్నారు. 2018లో నిర్వహించిన ‘యూత్ హుంకార్’ ర్యాలీలో జిగ్నేష్ మేవాని ఈ పుస్తకాలని ప్రదర్శిస్తూ, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మనుస్మృతి పద్దతులు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే దృశ్యంతో పోలి ఉన్న ఫోటో ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ పబ్లిష్ చేసిన గ్యాలరీ ఆర్టికల్‌లో దొరికింది. 2018లో జిగ్నేష్ మేవాని నిర్వహించిన ‘యూత్ హుంకార్’ ర్యాలీలో ఈ ఫోటో తీసినట్టు ఆర్టికల్‌లో తెలిపారు. ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆర్టికల్ పబ్లిష్ చేసిన ఒరిజినల్ ఫోటోలో, జిగ్నేష్ మేవాని ఒక చేతిలో భారత రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాన్ని మరొక చేతిలో మనుస్మృతిని పట్టుకున్నట్టు కనిపిస్తుంది. జిగ్నేష్ మేవాని ఈ ఫోటోలో ఖురాన్ పట్టుకొని కనిపించలేదు.

2018లో జరిగిన ‘యూత్ హుంకార్’ ర్యాలీలో జిగ్నేష్ మేవాని ఈ పుస్తకాలని ప్రదర్శిస్తూ, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మనుస్మృతి పద్దతులు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని నిరసన తెలిపారు. జిగ్నేష్ మేవాని నిర్వహించిన ఈ ‘యూత్ హుంకార్’ ర్యాలీకి సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ర్యాలీలో జిగ్నేష్ మేవాని ఖురాన్ చూపిస్తూ ప్రచారం చేసినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. జిగ్నేష్ మేవాని ఇటీవల కాంగ్రెస్ పార్టీకి తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, మార్ఫ్ చేసిన ఫోటోని గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని ఖురాన్‌ని పట్టుకొని ప్రచారం చేస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll