Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియో 2012లో రేవంత్ రెడ్డి, డీకే అరుణ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించినది.

0

ఇటీవల సీఎం అయిన తరువాత రేవంత్ రెడ్డి, డీకే అరుణ మధ్య వాగ్వాదం జరిగింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా రేవంత్ రెడ్డి మరియు డికే అరుణ మధ్య వాగ్వాదం జరిగిన వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సీఎం రేవంత్ రెడ్డి, డీకే అరుణ మధ్య జరిగిన వాగ్వాదం దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో కనిపిస్తున్న దృశ్యాలు 2012 సంవత్సరంలో రేవంత్ రెడ్డి, డీకే అరుణ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించినవి. 11 ఫిబ్రవరి 2012న జరిగిన మహబూబ్‌నగర్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న అప్పటి కొడంగల్ ఎంఎల్ఎ రేవంత్ రెడ్డి తన నియోజికవర్గంలో జరిగే కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించడం లేదని అప్పటి జిల్లా మంత్రి అయిన డీకే అరుణతో వాగ్వాదానికి దిగారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఇటీవల సీఎం అయిన తరువాత రేవంత్ రెడ్డి, డీకే అరుణ మధ్య వాగ్వాదం జరిగిందా అని ఇంటర్నెట్‌లో వెతికితే, మాకు అలాంటి రిపోర్ట్స్ ఏవీ లభించలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే ఖచ్చితంగా మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది.

తర్వాత ఈ వైరల్ వీడియోకి సంభందించిన సమచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న అధిక నిడివి గల వీడియో యూట్యూబ్‌లో లభించింది. ఈ వీడియోను TV5 న్యూస్ 11 ఫిబ్రవరి 2012న పబ్లిష్ చేసింది. ఈ వార్త కథనం ప్రకారం మహబూబ్​నగర్ జిల్లా సమీక్షా సమావేశంలో టీడీపీకి చెందిన కొడంగల్ ఎంఎల్ఎ రేవంత్ రెడ్డి తన నియోజికవర్గంలో జరిగే కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించడం లేదని జిల్లా మంత్రి అయిన డీకే అరుణతో వాగ్వాదానికి దిగారు.

ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ వన్ఇండియా కూడా కథనం ప్రచురించింది. దీన్ని బట్టి వైరల్ వీడియో 2012లో రేవంత్ రెడ్డి, డీకే అరుణ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించినది అని నిర్ధారించవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 2012లో రేవంత్ రెడ్డి, డీకే అరుణ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించినవి..

Share.

About Author

Comments are closed.

scroll