Fake News, Telugu
 

నీరవ్‌ మోదీ లండన్ కోర్టులో కాంగ్రెస్ నాయకులకు లంచం ఇచ్చినట్టు అంగీకరించాడన్న వార్త అవాస్తవం

0

‘నేను పారిపోలేదు, నన్ను పారిపోయేలా చేశారు. కాంగ్రెస్ నాయకులు 456 కోట్ల కమిషన్ తీసుకున్నారు, 13 వేల కోట్లలో నా భాగం 32% మాత్రమే, మిగతాదంతా కాంగ్రెస్ నాయకులే తీసుకున్నారు. అందరిని బాధ్యులను చేయాలి’ అని లండన్ కోర్టులో నీరవ్ మోదీ అన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ నాయకులు 456 కోట్ల కమిషన్ తీసుకున్నారు, 13వేల కోట్లలో నా భాగం 32% మాత్రమే, మిగతాదంతా కాంగ్రెస్ నాయకులే తీసుకున్నారు – లండన్ కోర్టులో నీరవ్ మోదీ.

ఫాక్ట్ (నిజం): నీరవ్ మోదీ ఇప్పటి వరకు హాజరైన కోర్టు విచారణలో, బ్యాంకు స్కాంలో కాంగ్రెస్, బీజేపీ లేదా ఇతర భారతీయ రాజకీయ పార్టీల పాత్ర ఉందనిగానీ, లేక లంచం ఇచ్చినట్టుగాని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇలాగే నీరవ్ మోదీ లండన్ కోర్టులో బీజేపీకి లంచం ఇచ్చినట్టు అంగీకరించాడన్న పోస్టులు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

నీరవ్ మోదీ మార్చి 2019లో ఇంగ్లాండ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత లండన్ కోర్టు విచారణకు నేరుగా హాజరు కాగా, 2020 డిసెంబర్‌లో వాండ్స్‌వర్త్ జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యాడు. ఈ కోర్టు విచారణకు సంబంధించిన వార్తలు ఆయా సమయాల్లో అన్ని ప్రధాన వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఐతే 2019లో జరిగిన విచారణ సందర్భంలో  మిమ్మల్ని భారత్‌కు అప్పగించడానికి అంగీకారమేనా అన్న ప్రశ్నకు జవాబిస్తూ ‘నాకు అంగీకారం కాదు’ అన్న రెండు విషయాలు తప్ప ఇంకా ఏమి మాట్లాడలేదు.

2020 డిసెంబర్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణలో కూడా నీరవ్ మోదీ కేవలం పేరు, పుట్టిన తేదీని నిర్ధరించాడే తప్ప వేరే మాట మాట్లాడలేదని వార్తా కథనాలు రాసాయి. పోస్టులో చెప్తునట్టు నీరవ్ మోదీ కాంగ్రెస్ నాయకులకు 456 కోట్ల కమిషన్ ఇచ్చినట్టు గానీ లేక తను బ్యాంకులకు మోసం చేసిన మొత్తంలో కాంగ్రెస్ నాయకుల వాటా ఉందనిగానీ ఎప్పుడు చెప్పలేదు.

ఇదే వార్త 2019 నుండే సోషల్ మీడియాలో షేర్ అవుతూ వస్తుంది. పైగా నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయే దాంట్లో బీజేపీ హస్తం ఉందని వేరొక వెర్షన్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకవేళ నీరవ్ మోదీ నిజంగానే లండన్ కోర్టులో ఏదైనా రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించి ఉంటే, ఇక్కడి మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు దీనికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. దీన్నిబట్టి నీరవ్ మోదీ లండన్ కోర్టులో ఏ పార్టీ పేరు కూడా ప్రస్తావించలేదని, కేవలం ఒకరి మీద ఇంకొకరు ఇలా ఫేక్ న్యూస్ తయారు చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, నీరవ్ మోదీ లండన్ కోర్టులో కాంగ్రెస్ నాయకులకు లంచం ఇచ్చినట్టు అంగీకరించాడన్న వార్త అవాస్తవం.

Share.

About Author

Comments are closed.

scroll