ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భార్య వై.ఎస్.భారతి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి ఇటీవల చేసిన ట్వీట్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. వై.ఎస్.భారతి తనకు అక్క లాంటిదని, భారతిని కించపరుస్తూ మార్ఫింగ్ ఫోటోలను పెట్టిన వారికి టీడీపీ పెద్దలు మద్దతు పలకడం బాధేసిందని, ఆమెను కించపరుస్తే తనని కించపరుస్తున్నట్లేనని బ్రాహ్మణి ఈ ట్వీట్లో తెలిపినట్టు ఉంది. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ నీచమైన రాజకీయాలను చేస్తుందని, వై.ఎస్.భారతి జోలికొస్తే వైసీపీ సోషల్ మీడియా దానిని దీటుగా ఎదుర్కొందే కానీ, తన మీద ఎలాంటి తప్పుడు పోస్టులు ఎప్పుడు పెట్టలేదని, అది వైసీపీ సోషల్ మీడియా విజ్ఞత అని ఈ ట్వీట్లో రాసి ఉంది. ఈ విషయాన్ని 99TV రిపోర్ట్ చేసినట్టుగా మరొక స్క్రీన్ షాట్ కూడా షేర్ అవుతుంది. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వై.ఎస్.భారతి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడాన్ని ఖండిస్తూ నారా బ్రాహ్మాణి చేసిన ట్వీట్ ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. వై.ఎస్.భారతి మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించి గానీ, తెలుగుదేశం సోషల్ మీడియా సెల్‌ను తప్పుబడుతూ నారా బ్రాహ్మాణి ఇటీవల ఎటువంటి ట్వీట్ చేయలేదు. ఈ విషయాన్ని 99 TV కూడా రిపొర్ట్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ట్వీట్ కోసం నారా బ్రాహ్మాణి ట్విటర్ హ్యాండిల్‌లో వెతికితే, వై.ఎస్.భారతి ఫోటోలకు సంబంధించి గానీ, తెలుగుదేశం సోషల్ మీడియా సెల్‌ను తప్పుబడుతూ గానీ, నారా బ్రాహ్మాణి ఇటీవల ఎటువంటి ట్వీట్ చేయలేదని తెలిసింది. నారా బ్రాహ్మణి తన ట్విట్టర్ ఖాతాలో ఇప్పటివరకు తెలుగు భాషలో ట్వీట్ చేయలేదు.
నారా బ్రాహ్మణి తన ట్విట్టర్ ఖాతాలో 2020 జూన్ నెలలో చివరి ట్వీట్ చేసారు. అలాగే, నారా బ్రాహ్మణి ట్విట్టర్ ఖాతాకు పోస్టులో షేర్ చేసిన ట్వీట్‌లో చూపిస్తున్నట్టు బ్లూ వెరిఫికేషన్ మార్క్ లేదు. పోస్టులో షేర్ చేసిన ట్వీట్‌ని నారా బ్రాహ్మాణి ట్వీట్లతో పోలి చూడగా, పోస్టులో షేర్ చేసిన ట్వీట్ ఫోటో మార్ఫ్ చేయబడినదని స్పష్టంగా తెలుస్తుంది. 99TV సంస్థ కూడా ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఎటువంటి పోస్ట్ చేయలేదు.
చివరగా, వై.ఎస్.భారతికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సెల్‌ను తప్పుబడుతూ నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్‌గా షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది.