Fake News, Telugu
 

ఉచిత పథకాల అధ్యయనం కోసం సుప్రీంకోర్టు సూచించిన నిపుణుల కమిటీలో పన్ను చెల్లింపుదారులతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు ఉంటారు

0

వివరణ (25 May 2023): నవంబర్ 2022లో, సుప్రీంకోర్టు ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి రిఫర్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉంది.

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ టాక్స్ పేయర్స్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు నిన్న ఒక కమిటీని ఏర్పాటు చేసింది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరిస్తుంది. ఏ ప్రభుత్వం పాలించినా, ఈ ఆర్గనైజేషన్ ఆమోదం లేకుండా, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత పంపిణీ లేదా రుణమాఫీలను ఏ ప్రభుత్వమూ ప్రకటించలేము”, అంటూ సోషల్ మీడియాలో ఒక పొస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్:ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ టాక్స్ పేయర్స్’ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర-రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం పాలించినా, ఈ సంస్థ ఆమోదం లేకుండా ఉచిత పథకాలను అమలు చేయలేరు. 

ఫాక్ట్ (నిజం): ‘ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ టాక్స్ పేయర్స్’ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం కోసం సుప్రీంకోర్టు ఇటీవల ఎటువంటి కమిటీని ఏర్పాటు చేయలేదు. అయితే,  ప్రభుత్వాలు అమలు పరుస్తున్న ఉచిత పథకాల గురుంచి అధ్యయనం కోసం ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది. సుప్రీంకోర్టు సూచించిన ఈ నిపుణుల కమిటీలో పన్ను చెల్లింపుదారులతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు ఉంటారు. అలాగే, ఈ కమిటీలోని సభ్యులకు ప్రభుత్వాలపై సంపూర్ణ  అధికారాలను ఇస్తున్నట్టు సుప్రీం కోర్టు ఎక్కడా ప్రకటించలేదు. ఈ నిపుణుల కమిటీ కూర్పు గురించి  ఒక వారంలోపు తమ సూచనలను తెలపాలని సుప్రీంకోర్టు వివిధ స్టేక్ హోల్డర్స్ ని కోరింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

సుప్రీంకోర్టు ‘ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ టాక్స్ పేయర్స్’ అనే సంస్థ ఏర్పాటు కోసం ఇటీవల కమిటీని ఏర్పాటు చేసిందా అని ఇంటర్నెట్లో వెతికితే, ప్రభుత్వ ఉచిత పథకాలను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు అటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థని ఏర్పాటు చేసినట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం దొరకలేదు. అయితే, ప్రభుత్వాలు అమలు పరుస్తున్న ఉచిత పథకాల అధ్యయనం కోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల సూచించిందని, ఈ కమిటీ కూర్పు గురించి వివిధ రంగాలకు చెందిన సంస్థలను సుప్రీంకోర్టు సూచనలను అడిగినట్టు తెలిసింది

ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆర్డర్‌ని ఇక్కడ (ఆర్కైవ్) చూడవచ్చు. ప్రభుత్వ ఉచిత పథకాల అధ్యయనం కోసం వివిధ రంగాలకు చెందిన సంస్థల ప్రతినిధులతో కూడిన ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల సూచించినట్టు తెలిసింది. లబ్ధిదారులు, ఉచిత పథకాలని వ్యతిరేకించే వారు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు, ఫైనాన్స్ కమిషన్, రిజర్వ్  బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ మొదలగు సంస్థల ప్రతినిధుల సూచనలు, సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఈ తీర్పులో  స్పష్టం చేసింది. ఈ నిపుణుల సంఘం కేవలం పన్ను చెల్లింపు దారులకే  పరిమితం కాకుండా వివిధ రంగాలకు చెందిన సంస్థలకు సంబంధించిన సభ్యులను కలిగి ఉంటుంది. అంతేకాదు, పోస్టులో తెలుపుతున్నట్టు ఈ కమిటీలోని సభ్యులకు సంపూర్ణ అధికారాలను ఇవ్వనున్నట్టు  సుప్రీం కోర్టు ప్రకటించలేదు, అటువంటి అధికారాలు కూడా రాజ్యాంగం ప్రకారం ఇచ్చే అవకాశం లేదు.          

ఈ నిపుణుల కమిటీ కూర్పు గురించి వివిధ పార్టీలు ఒక వారం వ్యవధిలో తమ సూచనలను తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తూ కేసుని 11 ఆగష్టు 2022 నాడు లిస్ట్ చేసింది.

చివరగా, ఉచిత పథకాల అధ్యయనం కోసం సుప్రీంకోర్టు సూచించిన నిపుణుల కమిటీలో టాక్స్ పేయర్స్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన వారు ఉంటారు.   

Share.

About Author

Comments are closed.

scroll