Fake News, Telugu
 

భారతదేశంలోని ఒక దేవాలయంలో ప్రతిష్టించబడిన గదని శ్రీలంకలో తవ్వకాల్లో బయటపడ్డ హనుమంతుని గద అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

ఒక పెద్ద లారీ పైన ఉన్న ఒక గద(మేస్) చిత్రాలను షేర్ చేస్తూ, శ్రీలంకలో తవ్వకాల్లో బయటబడిన హనుమంతుని గద అనే  వాదనతో సోషల్ మీడియాలో కొందరు యూసర్లు వీడియోలు షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాల్ని తనిఖీ చేద్దాం.

క్లెయిమ్: శ్రీలంకలో తవ్వకాల్లో బయటపడ్డ హనుమంతునికి చెందిన ఒక భారీ గద.

ఫాక్ట్: ఈ గద భారతదేశంలోని ఇండోర్‌లోని ‘పిత్ర పర్వత్’ ఆలయంలో ప్రతిష్టింపబడింది. ఇది శ్రీలంకలో తవ్వకాల్లో బయటపడలేదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, శ్రీలంక మీడియా తమ దేశంలో హనుమంతుని గదను వెలికితీసినట్లు ఏమైనా వార్త కథనాలు ప్రచురించారా అని ఇంటర్నెట్లో వెతకగా, ఎటువంటి కథనాలు మాకు దొరకలేదు. 

ఈ గద యొక్క మూలాలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేస్తే, మాకు ఒక YouTube వీడియో దొరికింది, దీనిలో ఒక భారీ వాహనంపై గద రవాణా చేస్తున్నారు. ఈ వీడియోలోని గద మరియు వాహనం వైరల్ క్లెయిమ్‌లో ఉన్న దానితో పోలి ఉన్నాయి. వీడియో టైటిల్ ప్రకారం, ఇది ఇండోర్‌లో చిత్రీకరించబడింది.

ఈ సమాచారంతో  ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతికితే, ఈ గద ఇండోర్‌లోని ‘పిత్ర పర్వత్’ (చదవండి) ఆలయంలో ప్రతిష్టింపబడిందని, ఇక్కడ హనుమంతుని భారీ విగ్రహం కూడా ఉందని తెలిసింది. హిందుస్థాన్ టైమ్స్ 2014లో ప్రచురించిన ఒక కథనంలో, ఆ ఏడాది, ప్రజలు నమ్మిన బూటకాలను గురించి రాసారు. ఈ కథనంలో ఇప్పుడు వైరల్ అవుతున్న గదకు సంబంధించిన ఫోటో గురించి చెప్పారు, ఈ గద శ్రీ లంకలో తవ్వకాల్లో బయటపడిందనే  విషయం బూటకమని ఇది స్పష్టంగా చెప్తుంది.    

అలాగే, ఏప్రిల్ 2013లో, ఎకనామిక్ టైమ్స్ ‘పిత్ర పర్వత్’లో  51 అడుగుల పొడవైన హనుమంతుని గద ఏర్పాటు చేయడం గురించి రిపోర్టు చేసింది. దీనిపై దైనిక్ భాస్కర్ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది.

అదనంగా, ఈ గదను రవాణా చేసిన సంస్థ B R జోషి రోడ్ లైన్స్ వారు తమ Facebook పేజీలో కొన్ని చిత్రాలను అప్‌లోడ్ చేసారు. గద రవాణా చేస్తున్న వీడియోలో కనిపిస్తున్న విజువల్స్‌తో ఈ ఫోటోలు మ్యాచ్ అవుతున్నాయి.

ఇంతే కాకూండా, ఈ ఫోటోలో ఉన్న గద శ్రీలంకలో తవకల్లో బయటపడిన హనుమంతుని గద అని చాలా సంవత్సరాలుగా పుకార్లు ఇంటర్నెట్లో  చక్కర్లు కొడుతున్నాయి. ఇదేమి హనుమంతుని గద కాదు అని Hoaxorfact వారు ఒక కథనం తొమ్మిది సంవత్రరాల క్రితం రాసారు.  

ఈ మొత్తం విషయంలో వింతైన విషయం ఏంటంటే వైరల్ అవుతున్న విడియోలోనే ఆఖర్లో, ఈ గద శ్రీలంకలో దొరకలేదని చెప్తారు. అయినా సోషల్ మీడియాలో అదే క్లెయిమ్ తో ఈ వీడియోను షేర్ చెయ్యడం గమనార్హం. 

చివరిగా, ఈ గద శ్రీలంకలో తవ్వకాల్లో బయటపడ్డ హనుమంతుని గద కాదు. ఇది భారతదేశంలోని ఒక దేవాలయంలో ప్రతిష్టించబడింది.

Share.

About Author

Comments are closed.

scroll