Fake News, Telugu
 

పాకిస్తాన్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన పాత వీడియోను హిందూ యువతులను వేధిస్తున్న ముస్లింలు అంటూ షేర్ చేస్తున్నారు

0

100 నుండి 500 మంది ముస్లింల గుంపు హిందూ యువతులను వేధించి అదృశ్యం చేసారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ముస్లింలతో జాగ్రత్తగా ఉండాలని హిందూ యువతులను హెచ్చరిస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ముస్లింల గుంపు హిందూ యువతులను వేధించి అదృశ్యం చేసిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు పాకిస్తాన్ దేశం లాహోర్‌లో జరిగిన ఘటనకు సంబంధించినవి. గత సంవత్సరం కూడా ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర పోలీసులు ఇది పాత ఘటనకు సంబంధించిందని స్పష్టం చేసారు. 14 ఆగస్ట్ 2021న లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద జరిగిన పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో అక్కడికి వచ్చిన టిక్ టాక్ సెలబ్రిటీ అయేషా అక్రమ్‌ను అక్కడున్న వందల మంది వేధించారు. వైరల్ వీడియోలోని దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవే అయ్యుండే అవకాశం ఉంది.

వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక గుంపు కొందరు మహిళలను వేధిస్తున్న దృశ్యాలు నిజమే అయినప్పటికీ ఈ ఘటన జరిగింది పాకిస్తాన్‌లో. పైగా ఈ ఘటన జరిగి చాలా రోజులవుతుంది.

ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకు సంబంధించి ఎక్కువ నిడివి గల ఫుటేజ్ ఆగస్ట్ 2021లో యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్టు తెలిసింది. పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం రోజున లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు.  

యూట్యూబ్‌లో వీడియోలో కనిపిస్తున్న ప్రదేశాలకు సంబంధించి గూగుల్ మాప్స్‌లో వెతకగా ఈ ఘటన లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద జరిగినట్టు స్పష్టమవుతుంది.

గత సంవత్సరం కూడా ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర పోలీసులు ఇది పాత ఘటనకు సంబంధించిందని ట్వీట్ చేసారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2021లో పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం రోజైన ఆగస్ట్ 14న గ్రేటర్ ఇక్బాల్ పార్కులోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద వీడియోలు చేయడానికి వచ్చిన టిక్ టాక్ సెలబ్రిటీ అయేషా అక్రమ్‌ను అక్కడున్న వందల మంది వేధించారు (ఇక్కడ).

దీన్నిబట్టి చూస్తే వైరల్ వీడియోలోని దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవే అయ్యుండే అవకాశం ఉంది. ఈ వివరాల బట్టి ఆ అమ్మాయిలది ఏ మతమో తెలియక పోయినప్పటికీ, పోస్టులో ఆరోపిస్తున్నట్టు ఈ ఘటనకు భారత్ దేశానికి సంబంధం లేదని మాత్రం స్పష్టమవుతుంది.

చివరగా, పాకిస్తాన్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన పాత వీడియోను హిందూ యువతులను వేధిస్తున్న ముస్లింలు అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll