Fake News, Telugu
 

పంజాబ్ ప్రభుత్వ కార్యాలయంపై ఖలిస్తాన్ జెండా ఎగరేసిన నిందితులని పోలీసులు పట్టుకున్న ఫోటోని రైతుల నిరసనలకు తప్పుగా ముడిపెడుతున్నారు.

0

 రైతు ఉద్యమకారుల ముసుగులో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఢిల్లీలో అరెస్ట్ చేసిన ఢిల్లీ స్పెషల్ క్రైమ్ సెల్ అని చెప్తూ దీనికి సంబంధించిన ఫోటో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రైతు ఉద్యమకారుల ముసుగులో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఢిల్లీలో అరెస్ట్ చేసిన ఢిల్లీ స్పెషల్ క్రైమ్ సెల్.

ఫాక్ట్(నిజం): ఇదీ 14 ఆగస్ట్ 2020 పంజాబ్ లో మోగా పట్టణ డిప్యూటీ కమీషనర్ కార్యాలయంపై ఖలిస్తాన్ జెండా ఎగరేసిన నిందితులని 29 ఆగస్ట్ 2020లో ఢిల్లీలో పోలీసులు పట్టుకున్న ఘటనకి సంబంధించిన పాత ఫోటో. ఈ ఫోటోకి ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ప్రచురించిన 30 ఆగస్ట్ 2020 వార్తా కథనాలు మాకు కనిపించాయి. అలాంటి ఒక వార్తా కథనం ప్రకారం పోస్టులోని ఫోటోలో కనిపిస్తున్నది ఇంద్రజీత్ సింగ్ గిల్, జస్పాల్ సింగ్ అనబడే ఇద్దరు నిషేధించబడ్డ ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ సభ్యులు. వీరిద్దరూ 14 ఆగస్ట్ 2020న పంజాబ్ మొగా పట్టణంలోని డిప్యూటీ కమీషనర్ కార్యాలయంపై ఖలిస్తాన్ జెండా ఎగరేసి తప్పించుకు తిరుగుతున్నారు. ఐతే వీరిని ఢిల్లీ పోలీస్ 29 ఆగస్ట్ 2020న పట్టుకున్నారు.

ఇదే ఘటనకి సంబంధించిన న్యూస్ వీడియో రిపోర్ట్ ఇక్కడ చూడొచ్చు. ఈ న్యూస్ రిపోర్ట్ కూడా ఫోటోలో ఉన్నది పంజాబ్ లో ఖలిస్తాన్ జెండా ఎగరేసి తప్పించుకు తిరుగుతున్న నిషేధించబడ్డ ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న వ్యక్తులని, వీరిని 29 ఆగస్ట్ 2020న ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేసిందని తెలుపుతుంది. దీన్నిబట్టి వీరికి ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఘటన కొత్త వ్యవసాయ చట్టాలు పార్లమెంట్ ఆమోదం పొందక ముందే జరిగింది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 

చివరగా, పంజాబ్ డిప్యూటీ కమీషనర్ కార్యాలయంపై ఖలిస్తాన్ జెండా ఎగరేసిన నిందితులని పోలీసులు పట్టుకున్న ఫోటోని రైతుల నిరసనలకు తప్పుగా ముడిపెడుతున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll