ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘జగన్ గారి కృషి వల్లే ఏపీకి ఎక్కువ నిధులు’, అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సీఎం జగన్ కృషి వల్లే ఏపీకి ఎక్కువ నిధులని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారని చెప్తున్న వీడియో.
ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియో ‘బడ్జెట్ 2022’ వీడియో అని ‘ప్రజా చైతన్యం’ అనే యూట్యూబ్ ఛానల్ రాసింది. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన 2022-23 బడ్జెట్ స్పీచ్‌లో ఎక్కడా కూడా సీఎం జగన్ ప్రస్తావనే రాలేదు. పోస్ట్‌లోని వీడియోలో ఉన్న విజువల్స్ బడ్జెట్ స్పీచ్‌కి సంబంధించినవి కావు. అయితే, అసలు వీడియోలో కూడా ఏపీ సీఎం జగన్ గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడలేదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వీడియోపై ‘ప్రజా చైతన్యం’ అనే వాటర్‌మార్క్ ఉన్నట్టు గమనించవచ్చు. ఆ పదాలతో వెతకగా, పోస్ట్‌లోని వీడియోని ‘ప్రజా చైతన్యం’ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఒక వీడియో నుండి తీసుకున్నట్టుగా తెలిసింది. ఆ ఛానల్ వారు ఆ వీడియోని – ‘FM Nirmala Sitharaman About CM Jagan Mohan Reddy at Union Budget 2022 | #UnionBudget’ ( అనువాదం – కేంద్ర బడ్జెట్ 2022లో సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్), అనే టైటిల్‌తో పెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు. అలాంటి టైటిల్‌తోనే మరో వీడియోను కూడా ఆ ఛానల్ వారు తమ యూట్యూబ్ ఛానల్‌లో పెట్టారు. ఆ రెండు వీడియోల్లో ఏపీ సీఎం జగన్ గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడినట్టు ఎక్కడా కూడా లేదు.

01 ఫిబ్రవరి 2022న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన 2022-23 బడ్జెట్ స్పీచ్‌లో ఎక్కడా కూడా సీఎం జగన్ ప్రస్తావనే రాలేదు.

అంతేకాదు, పోస్ట్‌లోని వీడియోలో ఉన్న విజువల్స్ బడ్జెట్ స్పీచ్‌కి సంబంధించినవి కావు. ‘The Narcotics Drugs & Psychotropic Substances (Amend) Bill, 2021’ అనే బిల్‌పై డిసెంబర్ 2021లో నిర్మలా సీతారామన్ మాట్లాడినప్పడి విజువల్స్ అవి. ఆ వీడియోలో కూడా ఏపీ సీఎం జగన్ గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడలేదు.

చివరగా, ‘జగన్ గారి కృషి వల్లే ఏపీకి ఎక్కువ నిధులు’, అని బడ్జెట్ స్పీచ్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనలేదు.