Fake News, Telugu
 

‘బీఫ్’ వంటకాలు ఉన్న ఈ మెనూ కార్డు ‘సిల్లీ సోల్స్ గోవా కేఫ్ అండ్ బార్’కి సంబంధించింది కాదు

0

గోవాలోని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురి రెస్టారెంట్‌లో ఆవు మాంసంతో చేసిన వంటకాలను వడ్డిస్తున్నారు”, అని చెప్తూ ఒక మెనూ కార్డు ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. గోవాలోని ‘సిల్లీ సోల్స్ గోవా కేఫ్ అండ్ బార్’ అనే రెస్టారెంట్‌ స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీకి చెందినట్టు తాజాగా కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జోయిష్ ఇరానీకి చెందినట్టు ఆరోపించబడిన ‘సిల్లీ సోల్స్ గోవా కేఫ్ అండ్ బార్’ యొక్క మెనూ కార్డులో ఆవు మాంసం వంటకాలు ఉన్నట్టు చూడవచ్చు.

ఫాక్ట్: పోస్ట్‌లోని ఫోటోలో ఉన్న మెనూ కార్డు ‘సిల్లీ సోల్స్ గోవా కేఫ్ అండ్ బార్’కి సంబంధించింది కాదు. అది ‘అప్పర్ డెక్ – రాడిసన్ బ్లూ రిసార్ట్ (గోవా)’ యొక్క మెనూ కార్డు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని ఫోటోలో ఉన్న మెనూ కార్డుని గూగుల్ లెన్స్ సహాయంతో వెతకగా, అలాంటి ఫోటోలే సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. అదే మెనూ (అవే వంటకాలు మరియు వివరణతో) ‘eazydiner’ వెబ్‌సైట్‌లో ‘అప్పర్ డెక్, రాడిసన్ బ్లూ రిసార్ట్, గోవా’ యొక్క మెనూ కార్డుగా చూడవచ్చు. ఆ రెస్టారెంట్ యొక్క అలాంటి మెనూనే ‘Zomato’ వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. కాబట్టి, పోస్ట్‌లోని ఫోటోలో ఉన్న మెనూ కార్డు ‘అప్పర్ డెక్ – రాడిసన్ బ్లూ రిసార్ట్ (గోవా)’కి  సంబంధించింది, ‘సిల్లీ సోల్స్ గోవా కేఫ్ & బార్’ యొక్క మెనూ కార్డు కాదు.

వివిధ వెబ్‌సైట్‌లలో లభించిన ‘సిల్లీ సోల్స్ గోవా కేఫ్ అండ్ బార్’ మెనూ కార్డు చూడగా, వాటిలో ‘చికెన్’, ‘పోర్క్’, ‘ఫిష్’, ‘ప్రాన్స్’ మరియు ‘లాంబ్’ గురించి మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. ‘పెప్పరోని’తో కూడా ఒక వంటకం ఉన్నట్టు మెనూ కార్డులో చూడవచ్చు, కానీ దానిలో వాడే పదార్థాల గురించి మాకు ఖచ్చితంగా తెలియలేదు. కాబట్టి, మెనూలో ఎక్కడా ‘బీఫ్’ (ఆవు మాంసం) గురించి రాసి లేదు. ఆ రెస్టారెంట్‌లో ‘బీఫ్’ వంటకాలు ఉన్నాయా లేవా అనేది మేము నిర్ధారించలేకపోయినప్పటికీ, పోస్ట్ చేసిన ఫోటోలోని మెనూ కార్డు మాత్రం ఖచ్చితంగా ‘సిల్లీ సోల్స్ గోవా కేఫ్ అండ్ బార్’కి సంబంధించినది కాదు. అంతేకాదు, పోస్ట్‌లో ఉన్న అదే ‘బీఫ్’ వంటకం ఫోటో వివిధ ఇతర వెబ్‌సైట్‌లలో ఉన్నట్టు చూడవచ్చు.

చివరగా, ‘బీఫ్’ వంటకాలు ఉన్న ఈ మెనూ కార్డు ‘సిల్లీ సోల్స్ గోవా కేఫ్ అండ్ బార్’కి సంబంధించింది కాదు. అది ‘అప్పర్ డెక్ – రాడిసన్ బ్లూ రిసార్ట్ (గోవా)’ యొక్క మెనూ కార్డు.

Share.

About Author

Comments are closed.

scroll