రెండు చెట్ల మధ్య సూర్యుడు మరియు చంద్రుడు ఉన్న ఫోటోను ఒక జర్మన్ ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను ఉపయోగించి, 62 రోజులు వేచి ఉండి తీశారని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పోస్ట్‌లో చేసిన దాంట్లో నిజానిజాలు ఎంతో ఈ పోస్టు ద్వారా తెలుసుకుందాం. .

క్లెయిమ్: ఒక జర్మన్ ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను బిగించి, 62 రోజులు వేచి ఉండి రెండు చెట్ల మధ్య సూర్యుడు మరియు చంద్రుడు కనబడేలాగ తీసిన ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఇది డిజిటల్ గా ఎడిట్ చేసిన ఫోటో. ఫోటోలోని సూర్యుడుని మరియు చంద్రుడుని ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి పెట్టారు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఫోటోను సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో ఒక ఆర్ట్ వెబ్‌సైట్‌లో లభించింది. ఆ వెబ్‌సైట్‌లో, ఫోటో యొక్క క్రెడిట్ ‘ఫోటోగ్రాఫర్ – బెస్ హమితి’కి ఇవ్వబడింది. బెస్ హమితి యొక్క Flickr ప్రొఫైల్‌లో, అదే ఫోటోని చూడవచ్చు. ఫోటో యొక్క EXIF డేటాలో, ఇది – క్రియేటర్ టూల్ – Adobe Photoshop CS5 Windows’ అని రాసి ఉంది . ‘Adobe Photoshop’ అనేది ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్.

అలాగే, తన యూట్యూబ్ ప్రొఫైల్‌లో, బెస్ హమితి 2012లో ‘అడోబ్ ఫోటోషాప్’ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి పై ఫోటోను ఎలా సృష్టించాడో వివరిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు.

చివరిగా, రెండు చెట్ల మధ్య సూర్యుడు మరియు చంద్రుడు ఉన్న ఈ ఫోటో ఎడిట్ చేయబడినది.