Fake News, Telugu
 

న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ వ్యాసాన్ని రాసాడన్న వార్త అవాస్తవం

0

న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్-ఇన్-చీఫ్, జోసెఫ్ హోప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వ్యాసాన్ని రాసినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వ్యాసంలో జోసెఫ్ హోప్, మోదీ ఒక గొప్ప దేశభక్తుడని, మోదీ నాయకత్వ నైపుణ్యాలు, రాజకీయ చతురత ఇతర అగ్రరాజ్యాలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయంటూ, ఇంకా అనేక విషయాల గురించి జోసెఫ్ హోప్ రాసినట్టు ఈ పోస్టులో పేర్కొన్నారు. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్పతనాన్ని వివరిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్, జోసెఫ్ హోప్ రాసిన వ్యాసం.

ఫాక్ట్ (నిజం): న్యూయార్క్ టైమ్స్ సంస్థలో జోసెఫ్ హోప్ పేరుతో ఎడిటర్ ఎవరూ లేరు. పైగా నరేంద్ర మోదీని, తన విదేశాంగ విధానాలను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఎటువంటి కథనాన్ని ప్రచురించలేదు. ఇదే విషయాన్ని  న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి అరి ఐజాక్మన్ బెవాక్వా స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

న్యూయార్క్ టైమ్స్ నరేంద్ర మోదీ గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టులో చెప్తునట్టు ఎటువంటి కథనాన్ని రాయలేదు. గూగుల్‌లో వెతికితే మాకు ఇలాంటి కథనమేది దొరకలేదు. పైగా న్యూయార్క్ టైమ్స్ వెబ్సైటులోని ఎడిటోరియల్ బోర్డు మెంబెర్స్ లిస్టులో జోసెఫ్ హోప్ పేరుతో ఎటువంటి జర్నలిస్ట్ లేరు.

పైగా న్యూయార్క్ టైమ్స్ 2020 డోక్లం నేపథ్యంలో భారత్- చైనా మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి రాసిన కథనంలో నరేంద్ర మోదీని ఒక హిందూ జాతీయవాదిగా పేర్కొంది. పైగా భారత్ లో ముస్లింల పట్ల అవలంభిస్తున్న విధానాలకు మోదీ ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదురుకుంటున్నాడని కూడా ఈ కథనంలో రాసారు.

ఐతే పోస్టులోని ఈ విషయం చాలా రోజుల నుండే సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. గతంలో ఈ వార్త వైరల్ అయినప్పుడు FACTLY ఈ విషయంపై స్పష్టత కోరుతూ న్యూయార్క్ టైమ్స్ ని మెయిల్ ద్వారా సంప్రదించగా, ది న్యూయార్క్ టైమ్స్  ప్రతినిధి అరి ఐజాక్మన్ బెవాక్వా ఈ మెయిల్‌కి స్పందిస్తూ, తమ సంస్థలో జోసెఫ్ హోప్ అనే పేరుతో ఎడిటర్ లేరని స్పష్టం చేశారు. అలాగే, న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్ డీన్ బాకెట్ అని, అతను పోస్ట్‌లో చెప్తునట్టు ఎటువంటి కథనాన్ని రాయలేదని స్పష్టం చేసారు. దీన్నిబట్టి, పోస్టులో షేర్ చేసిన విషయానికి న్యూయార్క్ టైమ్స్ పత్రికకి ఎటువంటి సంబంధంలేదని అర్ధం చేసుకోవచ్చు.

జోసెఫ్ హోప్ కీవర్డ్ తో గూగుల్‌లో వెతకగా ‘ఆసియా టైమ్స్’ న్యూస్ వెబ్‌సైట్‌లో ఇదే పేరుతో ఒక రిసర్చర్ ఉన్నట్టు తెలిసింది. కాకపోతే ఇతను నరేంద్ర మోదీ గాని లేక మోదీ విదేశాంగ విధానాల గురించి తన వ్యాసాలలో వ్యాఖ్యానించలేదు.

చివరగా, న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ వ్యాసాన్ని రాసాడన్న వార్త పూర్తిగా అవాస్తవం.

Share.

About Author

Comments are closed.

scroll