Fake News, Telugu
 

BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) సంస్థ ఆస్తుల విలువ 5000 కోట్లు, 50,000 కోట్లు కాదు

0

50 వేల కోట్ల ఆస్థి, 7,185 మంది ఉద్యోగులున్న BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) ని BJP అమ్మేయబోతుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 50 వేల కోట్ల ఆస్థి, 7,185 మంది ఉద్యోగులున్న BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) ని BJP అమ్మేయబోతుంది.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ డిసిన్వేస్ట్మెంట్ లో భాగంగా BEML సంస్థలో 26% వాటాని విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జనవరి 2021లో ఆసక్తి ఉన్న వారి కోసం సంస్థ యొక్క సమగ్ర సమాచారం ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండం (PIM) విడుదల చేసింది. ఐతే సంస్థ యొక్క 2019-20 వార్షిక నివేదిక ప్రకారం 31 మార్చ్ 2020 నాటికి సంస్థ యొక్క ఆస్తుల విలువ 5,066.71 కోట్లు మరియు సంస్థకి చెందిన మొత్తం ఉద్యోగస్తుల సంఖ్య 6,602. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విథంగా ఉంది.

BEML అనేది రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉండే మినీరత్నా కేటగిరీ -1 ప్రభుత్వ రంగ సంస్థ. BEML ప్రధానంగా 1) మైనింగ్ & నిర్మాణం 2) రక్షణ & ఏరోస్పేస్ 3) రైల్ & మెట్రో సెగ్మెంట్లలో పనిచేస్తుంది. ఈ సంస్థలో భారత ప్రభుత్వానికి 54.03% వాటా ఉంది. ఐతే స్ట్రాటజిక్ డిసిన్వేస్ట్మెంట్ లో భాగంగా ఈ సంస్థలోని ప్రభుత్వ వాటాలో 26% ని విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జనవరి 2021లో ఆసక్తి ఉన్న వారి కోసం సంస్థ యొక్క సమగ్ర సమాచారం ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండం (PIM) విడుదల చేసింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ ఫిబ్రవరిలో మరొక నోటిసు కూడా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ అఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వెబ్సైటులో దీనికి సంబంధించిన సమాచారం చూడొచ్చు.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు BEML ఆస్తుల విలువ 50,000 కోట్లు కాదు, BEML వెబ్సైటులో అందుబాటులో ఉన్న సంస్థ యొక్క 2019-20 వార్షిక నివేదిక ప్రకారం 31 మార్చ్ 2020 నాటికి సంస్థ యొక్క ఆస్తుల విలువ 5066.71 కోట్లుగా ఉంది. ఈ సంస్థలో వాటా విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంస్థ యొక్క సమగ్ర సమాచారం ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండంలో కూడా సంస్థ యొక్క అస్తుల విలువ 5071.75 కోట్లుగా పేర్కొంది. ఐతే వార్షిక నివేదికలో ఆస్తుల విలువ లక్షల్లో (5,06,671.29 లక్షలు) ఉండడం వల్ల ఈ మొత్తాన్ని సుమారు 50,000 కోట్లని తప్పుగా అంచనా వేసి ఉండొచ్చు. 

అదే విధంగా 2019-20 వార్షిక నివేదిక ప్రకారం, ఈ సంస్థకి చెందిన మొత్తం ఉద్యోగస్తుల సంఖ్య 6,602. ఐతే, అంతకు ముందు సంవత్సరం ఉద్యోగస్తుల సంఖ్య 7,185 కాగా అది 8% తగ్గి 6,602 అయ్యిందని నివేదిక పేర్కొన్నారు. సంస్థలో వాటా విక్రయానికి సంబంధించిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండంలో కూడా మొత్తం ఉద్యోగస్తుల సంఖ్య 6,602 అనే ఉంది.

ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

చివరగా, BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) సంస్థ ఆస్తుల విలువ 5000 కోట్లు, 50,000 కోట్లు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll