రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సచిన్ పైలట్, కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరినట్టుగా షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజస్తాన్ ప్రభుత్వంలో డిప్యూటీ సిఎం గా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, ఇటివల తన పార్టీ పై తిరిగుబాటు చేసి ఆ రాష్ట్రంలో కొత్త రాజకీయ సంక్షోభానికి తెర లేపిన నేపథ్యంలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రాజస్తాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ బీజేపీలో చేరుతున్న ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఆ ఫోటో ఎడిట్ చేయబడినది. కాంగ్రెస్ పార్టీ పై సచిన్ పైలట్ తిరుగుబాటు చేస్తున్న విషయం నిజమైనప్పటికి, తను బీజేపీలో చేరడం లేదని సచిన్ పైలట్ మీడియాకు తెలిపాడు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటో గూగుల్ లో రివర్స్ సెర్చ్ చేసి చూడగా అది ఫోటోషాప్ చేసిందని తెలిసింది. మార్చ్ 2020లో జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరుతున్న ఫోటోని ఎడిట్ చేసి సచిన్ పైలట్ ముఖాన్ని పెట్టారు.
రాజస్తాన్ ప్రభుత్వంలో డిప్యూటీ సిఎం గా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, ఇటివల తన పార్టీ పై తిరుగుబాటు చేసాడు. సచిన్ పైలట్ చేసిన ఈ తిరుగుబాటుకు బదులిస్తూ కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలట్ ను డిప్యూటీ సిఎం పదవి నుండి అలానే రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి నుండి తొలగించింది. అయితే, సచిన్ పైలట్ తను కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలుగుతున్నట్టు గాని, బీజేపీలో చేరుతున్నట్టు గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సచిన్ పైలట్ బీజేపీలో చేరడం లేదని తెలిపినట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి.
చివరగా, జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరుతున్న ఫోటోని ఎడిట్ చేసి సచిన్ పైలట్ బీజేపీలో చెరుతున్నట్టుగా షేర్ చేస్తున్నారు.