Fake News, Telugu
 

ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం గురించి అసంపూర్ణమైన, తప్పుదోవ పట్టించే సమాచారం షేర్ చేస్తున్నారు.

0

ప్రధాన మంత్రి కిసాన్ క్రెడిట్ కార్డుల గురించిన వివరాలు మరియు వాటి కోసం మీసేవ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్తూ వుండే పోస్ట్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ కధనం ద్వారా అందులో ఎంతవరకు నిజం ఉందొ చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: మీసేవ లో ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు అప్లికేషన్స్ మొదలయ్యాయి

ఫాక్ట్ (నిజం): ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు అన్ని జాతీయ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు,కోపరేటివ్ బ్యాంకులలో పొందవచ్చు. దీని గురుంచి పోస్ట్ లో ఇచ్చిన చాలా వరకు సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉంది.

కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగపడే విధంగా 1998లో నాబార్డ్ రూపొందించింది. ఈ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ అవసరాలకు రుణాలు తీసుకోవచ్చు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు కూడా రుణాలు పొందవచ్చు. ఈ రుణాలని కౌలు రైతులు,ఉమ్మడి వ్యవసాయం చేసేవారు కూడా పొందవచ్చు.  కిసాన్ క్రెడిట్ కార్డులు అన్ని జాతీయ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు,కోపరేటివ్ బ్యాంకులలో పొందవచ్చు.ఈ పధకం ద్వారా తీసుకున్న రుణాలపై తక్కువ వడ్డీ ఉంటుంది. ఇంకా సరైన సమయానికి రుణాలు చెల్లిస్తే వడ్డీ లో కొంత శాతం మాఫీ చేస్తారు. మొదటి సంవత్సరం ఇచ్చే ఋణం విలువ పంట పండించడానికి అయ్యే ఖర్చు,కోతల తరవాత అయ్యేఖర్చు అంతా అంచనా వేసి ఇస్తారు. తదుపరి 5 సంవత్సరాల రుణం ఫైనాన్స్ స్కేల్ పెరుగుదల ఆధారంగా మంజూరు చేయబడుతుంది. 1.6 లక్షల వరకు తీసుకునే రుణాలకు ఎటువంటి షూరిటీ అవసరం లేదు. అంతే కాదు, 3 లక్షల వరకు తీసుకొనే రుణాలకు ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉండవు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు తీసుకున్న వారికి ఒకవేళ మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా 50,000 రూపాయల భీమా,ఇతర ప్రమాదాలకు 25,000 రూపాయల భీమా వర్తిస్తుంది. పంట నష్టానికి కూడా భీమా పొందవచ్చు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వారి ద్వారా అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు పొందడానికి అవసరమైన అర్హత వివరాలు ఇక్కడ చూడవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ లబ్దిదారులందరిని ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు పథకానికి అనుసంధానం చేసే ప్రయత్నం చేయాలనీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. ఇందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ  అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపించిన సర్కులర్ ఇక్కడ చూడవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం అమలు పై నాబార్డ్ వారు చేసిన అధ్యయనం ఇక్కడ చూడొచ్చు.

ఐతే పోస్ట్ లో చెప్తునట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు మీసేవ లో దరఖాస్తు చేయరు. రుణాల కోసం బ్యాంకులో అప్లై చేసుకోవాలి. ఇంకా పోస్టులో ఈ పథకం ద్వారా తీసుకున్న రుణాలకు ఎటువంటి వడ్డీ ఉండదని ఉంది, కానీ అది అవాస్తవం. పైగా అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు అని పోస్టులో ఉంది, కానీ దినికి సంబంధించిన సమాచారం ఎక్కడా లేదు. ఈ కార్డు ద్వారా 35% నగదు విత్ డ్రా చేసుకోవచ్చన్న సమాచారం కూడా ఎక్కడా లేదు. దీన్నిబట్టి పోస్ట్ ద్వారా చెప్తున్న సమాచారం తప్పుదోవ పట్టించే విధంగా ఉందని చెప్పవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll