Fake News, Telugu
 

మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో ఇటీవల పంకజ్ త్రిపాఠి అనే యువకుడు తన ప్రియురాలిని దారుణంగా కొట్టిన వీడియోని లవ్ జిహాద్ నేపథ్యంతో తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ముస్లిం యువకుడు తన హిందూ ప్రియురాలిని క్రూరంగా కొడుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఈ వీడియోలో దెబ్బలు తిన్న అమ్మాయి లవ్ జిహాద్‌ బాధితురాలంటూ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: ముస్లిం యువకుడు తన హిందూ ప్రేయసిని క్రూరంగా కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలో ఇటీవల పంకజ్ త్రిపాఠి అనే యువకుడు తన ప్రియురాలిని క్రూరంగా చితకబాదిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ప్రేయసి పెళ్లిచేసుకోవాలని పదే పదే అడుగుతుండటంతో పంకజ్ త్రిపాఠికి విసుగెత్తి, కోపంతో ఆమెని ఇలా క్రూరంగా కొట్టినట్టు తెలిసింది. ఈ ఘటనతో లవ్ జిహాద్‌కు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Times Now’ వార్తా సంస్థ 24 డిసెంబర్ 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో ఒక యువకుడు తన ప్రియురాలిని దారుణంగా కొడుతున్న దృశ్యాలంటూ  ‘Times Now’ ఈ వీడియోని షేర్ చేస్తూ రిపోర్ట్ చేసింది. ఈ ఘటనకి సంబంధించి పలు వార్తా సంస్థలు 25 డిసెంబర్ 2022 నాడు ఆర్టికల్స్ మరియు వీడియోలను పబ్లిష్ చేశాయి. రేవా జిల్లా ధేరా గ్రామానికి చెందిన పంకజ్ త్రిపాఠి, పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసినందుకు తన ప్రియురాలిని క్రూరంగా కొట్టిన దృశ్యాలంటూ ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

ఈ ఘటనకి సంబంధించి రేవా సబ్-డివిషనల్ పోలీస్ అధికారి నవీన్ తీవారి మీడియాతో మాట్లాడుతూ, బాధితురాలు మౌగంజ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంకజ్ త్రిపాఠిని అరెస్ట్ చేశామని, బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రేవా జిల్లా ఎస్పి కూడా ట్వీట్ పెట్టారు. అయితే, మౌగంజ్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ మధ్యప్రదేశ్ పోలీస్ వెబ్సైట్లో ఇంకా పబ్లిష్ అవలేదు. మధ్యప్రదేశ్ పోలీస్ వెబ్సైట్లో ఈ కేసు ఎఫ్ఐఆర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఈ ఆర్టికల్‌ను అప్డేట్ చేస్తాము.

రేవా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం 25 డిసెంబర్ 2022 నాడు ఒక ట్వీట్ చేసింది. నేరస్థుడు పంకజ్ త్రిపాఠిని అరెస్ట్ చేసి, అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశామని, అలాగే నేరస్థుడి కుటుంబం అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చివేసినట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం తమ ట్వీట్లో తెలిపారు. రేవా కలెక్టర్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా పంకజ్ త్రిపాఠి ఇళ్లుని కూల్చివేస్తున్న వీడియోని షేర్ చేశారు. నేరస్థుడు  పంకజ్ త్రిపాఠి తండ్రి పేరు కన్హయ్య లాల్ త్రిపాఠి అని రేవా కలెక్టర్ ఆఫీసు తమ ట్వీట్లో తెలిపారు.

చివరిగా, మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో హిందూ యువకుడు తన ప్రియురాలిని దారుణంగా కొట్టిన వీడియోని లవ్ జిహాద్ నేపథ్యంతో తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll