దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడేందుకు సహాయపడుతుంది అని సూచిస్తూ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ప్రతిమతో పాటు గణేశుడు, లక్ష్మీదేవి చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీని కోరారు. ఇండోనేషియా 2% కంటే తక్కువ హిందువులు మరియు 85% కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్న ముస్లిం దేశం అయినప్పటికీ, దాని కరెన్సీ నోట్లపై గణేశుడి చిత్రాలను కలిగి ఉందని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో 20,000 రూపియ ఇండోనేషియా కరెన్సీ నోటు అని చెప్తూ గణేశుని విగ్రహంతో కరెన్సీ నోటు చిత్రాన్ని పలువురు షేర్ చేశారు. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: హిందూ దేవుడైన గణేశుని ప్రతిమను కలిగి ఉన్న ఇండోనేషియా కరెన్సీ నోటు యొక్క చిత్రం.
ఫాక్ట్: 1998లో గణేశుడి చిత్రాన్ని కలిగి ఉన్న 20,000 రూపాయల విలువ గల ఇండోనేషియా కరెన్సీ నోటు రూపియ (IDR) ను ప్రవేశపెట్టారు. కానీ తరువాత కరెన్సీ నోట్ల యొక్క భద్రతా ప్రమాణాల సాధారణ అప్‌గ్రేడ్లలో భాగంగా 2008లో ఈ నోటుని ఉపసంహరించారు. ప్రస్తుతం ఇండోనేషియాలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు గణేశుడి చిత్రాన్ని కలిగి లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేదిగా ఉంది.
ముందుగా ‘Numista’ వెబ్ సైట్ లో ఈ కరెన్సీ నోటు యొక్క వివరాలను వెతికాము. 20,000 విలువ గల ఈ ఇండోనేషియా కరెన్సీ నోటులో ఇండోనేషియా స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ విద్యాశాఖ మంత్రి హడ్జర్ దేవంతరా ఇంకా గణేశుడి చిత్రాలు ఒక వైపు, తరగతి గదిలోని పిల్లల చిత్రాలు నోటుకు మరో వైపు ఉన్నాయి.
ఇండోనేషియా సెంట్రల్ బ్యాంక్ యొక్క ఒక రిపోర్ట్ ప్రకారం, ఈ నోట్లు 1998లో జారీ చేయబడ్డాయి. అయితే 2008లో భద్రతా ఫీచర్లలో చేసే అప్ గ్రేడ్ చేయడంలో భాగంగా మరో మూడు బ్యాంకు నోట్లతో పాటు ఈ నోటుని కూడా ఉపసంహరించుకున్నారు. దీనికి సంబంధించిన బ్యాంక్ ఇండోనేషియా విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఇక్కడ చూడవచ్చు.
అయితే, ఈ నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసుకోవడానికి ఇండోనేషియా ప్రభుత్వం 10 సంవత్సరాల గడువును (31 డిసెంబర్ 2018 వరకు) విధించింది. ఇండోనేషియా బ్యాంక్ వారు 03 డిసెంబర్ 2018 న ఒక పత్రికా ప్రకటనలో, 31 డిసెంబర్ 2018 లోపు ఉపసంహరించిన ఈ నోట్లను మార్పిడి చేసుకోవాలని ప్రజలకు గుర్తు చేసింది. ప్రస్తుతం ఇండోనేషియాలో చలామణిలో ఉన్న 20,000 రూపియా నోట్ల చిత్రాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం ఇండోనేషియాలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో ఏదీ గణేశుడి చిత్రాన్ని కలిగి లేదు.
చివరిగా, గణేశుకి ప్రతిమ కలిగి ఉన్న ఇండోనేషియా కరెన్సీ నోటును 2008 లోనే ఉపసంహరించారు.