Fake News, Telugu
 

వై.ఎస్.జగన్ అక్రమ ఆస్తుల కేసులలో అరబిందో సంస్థల లావాదేవిలకు సంబంధించిన కేసుని సీబీఐ కోర్టు కొట్టేయలేదు

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలో ఫైల్ అయిన 9వ కేసుని కోర్టు ఇటీవల కొట్టివేసిందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. సాక్షి, అరబిందో సంస్థలకు మధ్య జరిగిన లావాదేవిలలో ఏ తప్పు జరగలేదని, ఇలాంటి తప్పుడు కేసుని పెట్టినందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులని కోర్టు మందలించిందని ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సాక్షి, అరబిందో సంస్థలకు మధ్య జరిగిన లావాదేవిలలో ఏ తప్పు జరగలేదని నిర్ధారిస్తు కోర్టు వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలోని 9వ కేసుని కొట్టేసింది.

ఫాక్ట్ (నిజం): వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలో ఆరబిందో ఫార్మ కంపెనీని జత చేస్తూ పెట్టిన కేసుని సీబీఐ కోర్టు ఇంకా కొట్టేయలేదు. వై.ఎస్.జగన్ సంస్థలకు, అరబిందో సంస్థలకు మధ్య లావాదేవిలకు సంబంధించి సీబీఐ పెట్టిన కేసు యొక్క చివరి హియరింగ్ ఇటీవల 11 నవంబర్ 2021 నాడు జరిగింది. ఈ కేసు తదుపరి హియరింగ్ 18 నవంబర్ 2021 నాడు జరుగనుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలో ఫైల్ అయిన 9వ కేసుని సీబీఐ కోర్టు కొట్టేసినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది. ఒకవేళ సీబీఐ కోర్టు సాక్షి సంస్థకు, అరబిందో సంస్థలకు మధ్య పెట్టుబడుల లావాదేవిలకు సంబంధించి ఫైల్ అయిన కేసుని కొట్టిపారేసి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కానీ, ఈ సమాచారాన్ని తెలుపుతూ ఇంటర్నెట్‌లో ఎటువంటి సమాచారం లేదు.

వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలో అరబిందో సంస్థను A3గా పరిగణిస్తూ సీబీఐ 31 మార్చ్ 2012 నాడు కేసు నమోదు చేసింది. వై.ఎస్.జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో (2004-09) అరబిందో, ఇతర ఫార్మా కంపెనీల పెట్టుబడుల పేరుతో జగన్ సంస్థలకు లంచాలు ఎగవేసి బదులుగా ప్రభుత్వ భూములని కేటాయించుకున్నాయనే ఆరోపణ కింద సీబీఐ ఈ కేసుని ఫైల్ చేసింది. జగన్ సంస్థలకు, అరబిందో ఫార్మ సంస్థకు మధ్య లావాదేవీలకు సంబంధించి ఫైల్ అయిన కేసు (CC: 08/2012) వివరాలు ‘E-Courts Services’ వెబ్సైటులో దొరికాయి. ఈ కేసు ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నట్టు ఈ వెబ్సైటులో స్పష్టంగా తెలిపారు.

ఈ కేసు చివరి హియరింగ్ 11 నవంబర్ 2021 నాడు జరిగిందని, తదుపరి హియరింగ్ 18 నవంబర్ 2021 నాడు జరుగనున్నట్టు ‘E-Courts Services’  వెబ్సైటులో తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేత రఘురామ రాజు కృష్ణం రాజు ఇటీవల వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ ఆర్డరుని రద్దు చేయాలని పిటిషన్‌ వేస్తే, సీబీఐ ప్రత్యేక కోర్టు ఆ పిటిషన్‌ని కొట్టిపారేసింది.  కాని, వై.ఎస్.జగన్ అక్రమ ఆస్తుల కేసులలో అరబిందో సంస్థను జత చేస్తూ ఫైల్ అయిన కేసుని సీబీఐ కోర్టు కొట్టిపారేయలేదు.

చివరగా, వై. యెస్. జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలో సాక్షి, అరబిందో సంస్థల లావాదేవిలకు సంబంధించి ఫైల్ అయిన 9వ కేసుని సీబీఐ కోర్టు కొట్టేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll