Fake News, Telugu
 

ప్రభుత్వ లెక్కల ప్రకారం క్వింటాల్‌ వడ్లకు 80 కిలోల పార్‌బాయిల్డ్ రైస్ రాదు

0

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం కొనుగోళ్ళ విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ళలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు, మిల్లర్లు, అవినీతికి పాల్పడుతున్నారని చెప్తున్న సోషల్ మీడియా పోస్ట్ ఒకటి విస్తృతంగా షేర్ అవుతంది. ‘కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఎక్కువ తక్కువలతో సంబంధం లేకుండా ప్రతి క్వింటాల్ వడ్లకు 65 కిలోల బియ్యం రాష్ట్రం ఇవ్వాలి. కాని యాసంగిలో మిల్లర్లు ఉడకబెట్టిన బియ్యం (పార్‌బాయిల్డ్ రైస్)  తీయడం వల్ల క్వింటాల్‌ వడ్లకు 80 కిలోల బియ్యం వస్తాయి, అంటే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినదాని కంటే 15 కిలోలు ఎక్కువ. ఐతే తెలంగాణ ప్రభుత్వం ఈ 15 కిలోల అధిక దిగుబడికి సంబంధించి అవినీతికి పాల్పడుతుందన్నది’ ఈ పోస్టు సారాంశం. పైగా పోస్టులో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించి లెక్కలు కూడా షేర్ చేసారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న విషయాలకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: యాసంగిలో మిల్లర్లు ఉడకబెట్టి బియ్యం (పార్‌బాయిల్డ్ రైస్) తీయడం వల్ల క్వింటాల్‌ వడ్లకు 80 కిలోల బియ్యం వస్తాయి.

ఫాక్ట్ (నిజం): సంబంధిత పరిశోధనల అద్యాయనం ద్వారా క్వింటాల్‌ వడ్లకు 68 కిలోల పార్‌బాయిల్డ్ రైస్ దిగుబడి వస్తుందని టారిఫ్ కమిషన్ 2005లో నిర్దారించింది. FCI టారిఫ్ కమిషన్ చెప్పిన దాన్నే ప్రామాణికంగా తీసుకొని పార్‌బాయిల్డ్ రైస్ అవుట్ టర్న్ రేషియోని (OTR) 68 కిలోలగా నిర్దారించింది. క్వింటాల్‌ వడ్లకు 80 కిలోల పార్‌బాయిల్డ్ రైస్ దిగుబడి వస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పార్‌బాయిల్డ్ రైస్:

సాధారణంగా యాసంగిలో పండించే వడ్లలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల, రైస్ మిల్లుల్లో వడ్లను పట్టించేటప్పుడు నూకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఐతే నూకల శాతం తగ్గించడానికి వడ్లను నానబెట్టి, ఆపై స్టీమ్ చేసి, తర్వాత ఆరబెట్టి అప్పుడు మిల్లుల్లో పట్టిస్తారు, ఇలా పట్టించిగా వచ్చిన బియ్యాన్ని పార్‌బాయిల్డ్ రైస్ అని అంటారు. ఇలా చేయడం ద్వారా వడ్లలో తేమ తగ్గి నూకలు తక్కువగా వస్తాయి.

అవుట్ టర్న్ రేషియో:

సాధారణంగా వడ్లను మిల్లులలో పట్టించినప్పుడు బియ్యంతో పాటు నూకలు, తవుడు, వరి పొట్టు మొదలైనవి వస్తాయి. క్వింటాల్‌ వడ్లను మిల్లులో పట్టించినప్పుడు వచ్చే బియ్యం శాతాన్ని, అవుట్ టర్న్ రేషియో (OTR) అని అంటారు. ఐతే ఈ OTR అనేది అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండదు. విత్తనాల నాణ్యత & రకం, వాతావరణ పరిస్థితులు, భౌగోళిక ప్రాంతం, మిల్లులలో వాడే యంత్రాలు, మొదలైన వాటిపై ఆధారపడి బియ్యం యొక్క అవుట్ టర్న్ రేషియో ఒక్కో ప్రాంతానికి మారుతుంది.

2013లో బెంగుళూరులోని అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సెంటర్ 2007-08 నుండి 2009-10 మధ్య కాలంలో దేశంలోని వరి పండించే ఐదు ప్రధాన రాష్ట్రాలైన కర్ణాటక, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని రైస్ మిల్లులను అధ్యయనం చేసి సంప్రదాయ, ఆధునిక మిల్లులలో కన్వర్షన్ రేషియోకి (అవుట్ టర్న్ రేషియో – వడ్ల నుండి బియ్యంగా మార్చే) సంబంధించి ‘హుల్లింగ్ అండ్ మిల్లింగ్ రేషియో అఫ్ మేజర్ ప్యాడి గ్రోయింగ్ స్టేట్స్ : అల్ ఇండియా కన్సాలిడేటెడ్ రిపోర్ట్’ పేరుతో ఒక రిపోర్ట్ విడుదల చేసింది.

దేశంలోని ఆధునిక మిల్లులలో కన్వర్షన్ రేషియో క్వింటాల్‌కు సగటున 64% కాగా, సాంప్రదాయ మిల్లులలో ఇది 58.6%గా ఉంది. కన్వర్షన్ రేషియోకి సంబంధించి రాష్ట్రాల మధ్య వ్యత్యాసం 6.4%గా ఉంది. సాంప్రదాయ, ఆధునిక మిల్లులను కలుపుకొని సగటున పంజాబ్ రాష్ట్రం అత్యధికంగా 69.4% కన్వర్షన్ రేషియో నమోదు చేయగా, ఆ తర్వాతి స్థానంలో  64.9%తో ఛత్తీస్‌గఢ్ ఉంది. పశ్చిమ బెంగాల్ మరియు కర్నాటక  రాష్ట్రాలలో దాదాపు 63% కన్వర్షన్ రేషియో కనిపించగా, మూడు సంవత్సరాలలో కూడా మధ్యప్రదేశ్ 58.3% కన్వర్షన్ రేషియోతో చివరి స్థానంలో ఉంది.

అలాగే  2005లో, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాప్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (IICPT) తంజావూరు, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పండించే MTU 7029 రకం వరిని టెస్ట్ చేసినప్పుడు అవుట్- టర్న్ రేషియో 72.08% గా తేలింది. అంటే క్వింటాల్‌ వడ్లకు 72.08 కిలోల బియ్యం దిగుబడి వచ్చింది.

ఐతే అవుట్- టర్న్ రేషియోకి సంబంధించి ప్రాంతాల, మిల్లుల మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ, భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా క్వింటాల్‌ వడ్లకు 80% అవుట్- టర్న్ రేషియో (క్వింటాల్‌ వడ్లకు 80 కిలోల బియ్యం దిగుబడి) వస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు మాకు లభించలేదు.

అవుట్-టర్న్ రేషియోని ఫిక్స్ చేస్తారు:

సాధారణంగా కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం ప్రకారం ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (FCI) ప్రతీ సంవత్సరం రాష్ట్రల నుండి దాన్యాన్ని సేకరించడానికి ముందే మిల్లర్లు అందించాల్సిన బియ్యం యొక్క స్టాండర్డ్స్ ని (అవుట్- టర్న్ రేషియో) నిర్దేశిస్తుంది.

2005లో టారిఫ్ కమిషన్ రా-రైస్‌కి 67%, పార్‌బాయిల్డ్ రైస్‌కి 68% అవుట్ టర్న్ రేషియోని నిర్ణయించారు. FCI రాష్ట్రాల నుండి ధాన్యం సేకరించే విషయంలో 2005లో టారిఫ్ కమిషన్ నిర్ణయించిన అవుట్-టర్న్ రేషియోనే ప్రామాణికంగా తీసుకుంటూ వస్తుంది. అంటే రైస్ మిల్లర్లు ఒక క్వింటాల్‌ వడ్లకి రా-రైస్‌ అయితే 67 కిలోలు, పార్‌బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల ఇవ్వాలి. FCI అవుట్-టర్న్ రేషియోకి సంబంధించి టారిఫ్ కమిషన్ సిపారసును పాటిస్తుందనడానికి  కొన్ని ఉదాహారణలు కింద చూడొచ్చు.

  • దాన్యం సేకరణకి సంబంధించి 2015లో CAG విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2009-10 to 2013-14 మధ్య ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిల్లర్ల నుండి లెవీ రైస్ కొనుగోలు చేయడానికి  రా-రైస్ అయితే 67%, అదే పార్‌బాయిల్డ్ రైస్ అయితే 68% అవుట్ టర్న్ రేషియోని ప్రామాణికంగా తీసుకుంది.
  • తెలంగాణ మరియు తమిళనాడులో 2014-15 ఖరీఫ్ సీజన్లో సేకరించే దాన్యానికి కూడా FCI ఇదే అవుట్ టర్న్ రేషియోని ప్రామాణికంగా తీసుకుంది.
  • 2020-21 ఖరీఫ్ సీజన్లో ఒడిశాకి, 2021-22 ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి క్వింటాల్‌ వడ్లకు కూడా రా-రైస్ (67%), పార్‌బాయిల్డ్ రైస్ (68%) అవుట్ టర్న్ రేషియోని FCI నిర్దేశించింది.

అవుట్-టర్న్ రేషియో కన్నా ఎక్కువ దిగుబడి వచ్చిన సందర్భాలలో ఎలా? :

సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన అవుట్ టర్న్ రేషియో కంటే ఎక్కువ దిగుబడి వచ్చిన సందర్భాలలో ఆ ఎక్కువ దిగుబడి మొత్తం రైస్ మిల్లర్లు తమ వద్దే ఉంచుకుంటారు. దిగుబడి విషయంలో ప్రభుత్వం రైస్ మిల్లులను మానిటర్ చేసే వ్యవస్థ లేకపోవడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చిన సందర్భాలలో ఆ అధిక దిగుబడిని గురించిన సమాచారం రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చెప్పరు.

ఇదే అంశం గురించి పైన తెలిపిన 2015 CAG రిపోర్ట్‌లో కూడా ప్రస్తావించారు. 2009-10 to 2013-14 మధ్య ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్‌లో రైస్ మిల్లర్లు అధిక దిగుబడి రూపంలో వచ్చిన సుమారు ₹1,195.40 కోట్ల ధాన్యాన్ని తమ వద్దే ఉంచుకున్నారు. ఇటువంటి వాటిల్లో రా-రైస్, పార్‌బాయిల్డ్ రైస్ అని సంబంధం లేదు.

ఇకపొతే పోస్టులో పార్‌బాయిల్డ్ రైస్ యొక్క అధిక దిగుబడి వల్ల వచ్చే ఆదాయానికి సంబంధించి అవినీతికి పాల్పడుతున్నారన్న వాదనలో హేతుబద్దత లేదు. ఎందుకంటే పోస్టులో చెప్తునట్టు క్వింటాల్‌ వడ్లకు 80 కిలోల పార్‌బాయిల్డ్ రైస్ దిగుబడి వస్తుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. కేంద్ర ప్రభుత్వమే సంబంధిత సంస్థల ద్వారా పరిశోధన చేసిన అనంతరం క్వింటాల్‌ వడ్లకు 68 కిలోల పార్‌బాయిల్డ్ రైస్ దిగుబడి వస్తుందని నిర్దారించింది, దీన్నిబట్టి పోస్టులో లేని అధిక దిగుబడికి ఆదాయాన్ని లెక్కించినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్దేశించిన OTR కంటే ఎక్కువ బియ్యం వచ్చినప్పుడు మిల్లర్లు అవి తమ వద్దే ఉంచుకుంటారు. దీనికి రా-రైస్, పార్‌బాయిల్డ్ రైస్ అని సంబంధం లేదు.

చివరగా, ప్రభుత్వ అధ్యయనం ప్రకారం క్వింటాల్‌ వడ్లకు 68 కిలోల పార్‌బాయిల్డ్ రైస్ దిగుబడి వస్తుంది, 80 కిలోలు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll