Fake News, Telugu
 

మోదీ హయాంలో ఆమోదం పొందిన కొత్త ఎయిమ్స్ లలో కొన్ని సేవలు అందిస్తుండగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి

0

‘కాంగ్రెస్ హయాంలో 13 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నిర్మించారని, మోడీ హయాంలో మాత్రం ఒక్కటి కూడా నిర్మించలేదని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ హయాంలో 13 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నిర్మించగా, మోదీ హయాంలో మాత్రం ఒక్కటి కూడా నిర్మించలేదు.

ఫాక్ట్ (నిజం): దేశంలో మొట్టమొదటి AIIMS ని 1956లో అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు స్థాపించారు. ఆ తరవాత UPA ప్రభుత్వం మరో ఆరు ఎయిమ్స్ లకి కాబినెట్ ఆమోదం తెలిపి నిధులు కేటాయించింది. మోదీ 2014లో ప్రధానమంత్రి అయిన తరవాత, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం వివిధ సమయాల్లో 16 కొత్త ఎయిమ్స్ స్థాపించడానికి కాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 16 కొత్త ఎయిమ్స్ యొక్క నిర్మాణం వివిధ దశల్లో ఉండగా, కొన్ని ఎయిమ్స్ ఎంబిబిఎస్ కోర్సు ప్రారంభించాయి, మరికొన్ని OPD సేవల కూడా అందిస్తున్నాయి. కాబట్టి మోదీ హయాంలో ఒక్క ఎయిమ్స్ కూడా నిర్మాణం కాలేదని అని అనలేం. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

దేశంలో మొట్టమొదటి AIIMS ని 1956లో అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు AIIMS ఆక్ట్ 1956 కింద స్థాపించారు. ఇది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ పర్యవేక్షనలోని ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.

ప్రధాన మంత్రి స్వాస్థ్య సూరక్ష యోజన (PMSSY) :

ప్రజలకు సరసమైన ధరలకి నమ్మదగిన వైద్య సేవలు అందించే విషయంలో ప్రాంతీయ అసమతుల్యతను తొలగించి మరియు దేశంలో నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రి స్వాస్థ్య సూరక్ష యోజన (PMSSY) అనే పథకాన్ని ప్రకటించగా, 2006లో ఈ పథకాన్ని అధికారికంగా UPA హయాంలో ప్రారంభించారు.

ఈ పథకం కింద రాయపూర్, పాట్నా, జోధ్పూర్, భోపాల్, రిషికేశ్ మరియు భువనేశ్వర్ లో కొత్తగా ఆరు AIIMSని స్థాపించించడానికి 2006లో అప్పటి కాంగ్రెస్ నాయకత్వం లోని UPA ప్రభుత్వం కాబినెట్ ఆమోదం తెలపగా, మళ్ళీ మార్చి 2010లో సవరించిన అంచనాలతో జూన్ 2019 కల్లా వీటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో క్యాబినెట్ ఈ ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ వార్తా కథనం ప్రకారం ఈ ఆరింటిలో కొన్నింటికి 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి శంకుస్థాపన చేసారు. కాకపోతే ఈ కొత్త AIIMS కి సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ (DPR) గాని, నిర్మాణానికి కావలసిన స్థలాలు గాని, బడ్జెట్ కేటాయింపులు అన్నీ 2006 మరియు 2010లో అప్పటి UPA ప్రభుత్వం సమకూర్చింది. ఈ ఆరు కొత్త AIIMS వివిధ దశలలో పూర్తిచేసుకొని ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వున్నాయి. ప్రస్తుతానికి ఈ ఆరు సంస్థలు వంద శాతం ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. కాబట్టి ఈ ఆరు సంస్థలకు సంబంధించి కాబినెట్ ఆమోదం, నిధుల కేటాయింపు మొదలైన ఎక్కువ శాతం పనులు UPA హయాంలోనే జరిగాయి కాబట్టి వీటి నిర్మాణం UPA హయాంలోనే జరిగిందని పరిగణించాల్సి ఉంటుంది. ఐతే పైన చెప్పిన దాన్ని బట్టి కాంగ్రెస్ హయాంలో 13 ఎయిమ్స్ స్థాపించారన్న దాంట్లో నిజం లేదని అర్ధమవుతుంది.

మోదీ హయాంలో AIIMS నిర్మాణం:

ఇకపోతే 2014లో మోదీ మొదటి సారి ప్రధానమంత్రి అయిన తరవాత 2015 నుండి మొదలుపెట్టి వివిధ సమయాల్లో ప్రధాన మంత్రి స్వాస్థ్య సూరక్ష యోజన (PMSSY) కింద మొత్తం 16 (మంగళగిరి, గువహతి, దర్భాంగా, రాజ్‌కోట్, రేవారి, బిలాస్‌పూర్, సాంబా, అవంతిపోరా, డియోఘర్, నాగ్‌పూర్, బతిండా, మదురై, బిబినగర్, రాయ్ బరేలి, గోరఖ్‌పూర్, కల్యాణి) కొత్త AIIMS స్థాపించాలని నిర్ణయించారు. ఈ పదహారు కొత్త సంస్థలు అన్ని కాబినెట్ ఆమోదం పొంది వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి (రాయ్ బరేలి ఎయిమ్స్ కి సంబంధించి 2009లోనే కాబినెట్ ఆమోదం తెలపగా, 2017లో ఈ ప్రతిపాదనని సవరించిన అంచనాలతో తిరిగి కాబినెట్ ఆమోదం తెలిపారు). పైగా రాయ‌బ‌రేలీ, మంగ‌ళ‌గిరి, గోర‌ఖ్‌పూర్‌, భ‌థిండా, నాగ్‌పూర్, బీబీన‌గ‌ర్ ఎయిమ్స్ ఆసుప‌త్రుల‌లో ఇప్పటికే ఓపీడీ (OPD) సేవ‌లు కూడా అందిస్తుండగా, మంగ‌ళ‌గిరి, నాగ్‌పూర్‌, క‌ళ్యాణి, గోర‌ఖ్‌పూర్‌, భ‌థిండా, రాయ్‌బ‌రేలీ, దేవ్‌గ‌ఢ్‌, బీబీన‌గ‌ర్‌, బిలాస్‌పూర్‌, జ‌మ్ము, రాజ్‌కోట్‌ మొదలైన 12 ఎయిమ్స్ లో ఎంబిబిఎస్ కోర్సు ప్రారంభ‌మ‌య్యాయి.

PMSSY పథకానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్ లో పాత ఎయిమ్స్ తోపాటు కొత్త ఎయిమ్స్ నిర్మాణానికి సంబంధించి పనులు ఎంత శాతం పూర్తయాయో తెలుసుకోవడానికి ఒక డాష్ బోర్డు రూపంలో సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. ఈ సమాచారాన్ని ఇక్కడ చూడొచ్చు.

కొత్తగా నిర్మిస్తున్న ఎయిమ్స్ కి సంబంధించిన సమగ్ర సమాచారం (కాబినెట్ ఆమోదం పొందిన తేది, నిర్మాణానికి కేటాయించిన వ్యయం, పనుల పురోగతి) మొదలైన సమాచారం ప్రధాన మంత్రి స్వాస్థ్య సూరక్ష యోజన పోర్టల్ లో పొందొచ్చు. అలాగే గత అయిదు సంవత్సరాలలో ఈ కొత్త ఎయిమ్స్ మరియు ఇతర మెడికల్ కాలేజీల నిర్మాణం మరియు నిర్వహణకి సంబంధించి జరిగిన పురోగతికి సంబంధించిన సమాచారం ఒక డాక్యుమెంట్ రూపంలో ఈ పోర్టల్ లో అందుబాటులో ఉంచారు, ఈ సమాచారం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, మోదీ హయాంలో ఆమోదం పొందిన కొత్త ఎయిమ్స్ లలో కొన్ని వివిధ సేవలు అందిస్తుండగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll