భారతదేశంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే హెచ్చరిక జారీ చేశారు అంటూ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టు CAA, NRC, జనాభా నియంత్రణ బిల్లు మొదలైన కొన్ని ముఖ్యమైన బిల్లులను ఆమోదించిన తర్వాత అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని హరీష్ సాల్వే వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. అలాగే ఈ పోస్టు స్వాతంత్ర్యం వచ్చిన 73 సంవత్సరాలలో, భారతదేశంలో ముస్లింల జనాభా 3 కోట్ల నుండి 30 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: దేశంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే హెచ్చరిక జారీ చేశారు.
ఫాక్ట్(నిజం): వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు హరీష్ సాల్వే భారతదేశంలో అంతర్యుద్ధం లేదా అశాంతి నెలకొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించినట్లు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లేవు. అలాగే పలు కథనాల, ప్రకారం పోస్టులో పేర్కొన్న ఇతర విషయాలు కూడా అవాస్తవం అని తెలిసింది. భారత ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లు తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పే ఎలాంటి రిపోర్ట్స్ లేవు. అధికారిక గణాంకాల ప్రకారం, 2011 నాటికి భారతదేశంలో మొత్తం ముస్లింల జనాభా 17.22 కోట్లు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా దేశంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే హెచ్చరిక జారీ చేశారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, పోస్ట్‌లో పేర్కొన్న వ్యాఖ్యలను హరీష్ సాల్వే చేసినట్లు ఎటువంటి రిపోర్ట్స్ లభించలేదు. ఒక వేళ హరీష్ సాల్వే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి.
పలు రిపోర్ట్స్ ప్రకారం, హరీష్ సాల్వే గతంలో మరియు ఇటీవల కూడా పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై తన అభిప్రాయాలు తెలియజేస్తూ CAA ను సమర్ధించినట్లు తెలుస్తుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). అయితే, సాల్వే జనాభా నియంత్రణ బిల్లుపై మాట్లాడినట్లు మాకు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు.
పోస్టులో చేసిన ఇతర క్లెయిమ్‌లను ఒక్కొక్కటిగా క్రింద పరిశీలిద్దాం.
రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ:
రాజ్యసభలో 245 సీట్లు ఉన్నాయి, అయితే ప్రస్తుతం ఎనిమిది ఖాళీలు ఉన్నాయి -జమ్మూ& కాశ్మీర్ నుండి నాలుగు, నాలుగు నామినేటెడ్ సీట్లు. కావున రాజ్యసభలో ప్రస్తుతం 245 సభ్యులకు గాను 237 సభ్యులు ఉన్నారు, ఈ లెక్క ప్రకారం రాజ్యసభలో ప్రస్తుత మెజారిటీ మార్క్ 119 (ఇక్కడ). ఇటీవల ఆగస్ట్ లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 09 గెలుచుకున్న తరువాత రాజ్యసభలో బీజేపీ బలం 95 కు పెరిగింది. రాజ్యసభలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్వంతంగా పూర్తి మెజారిటీ కలిగి లేదు. తమ ఎన్డీయే (NDA) మిత్ర పక్షాలతో కలుపుకొని మెజారిటీ మార్క్(119) దాటింది.
జనాభా నియంత్రణ బిల్లు:
2019లో, బీజేపీ ఎంపీ రాకేష్ సిన్హా, కఠినమైన నిబంధనలతో ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేయాలని కోరుతూ జనాభా నియంత్రణ బిల్లు పేరుతో రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే 2022 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా జోక్యంతో బిల్లును ఉపసంహరించుకున్నారు. రాజ్యసభలో అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, జనాభా నియంత్రణను సాధించడానికి ప్రభుత్వం బలవంతంగా కాకుండా, అవగాహన మరియు ఆరోగ్య ప్రచారాలను విజయవంతంగా ఉపయోగించిందని పేర్కొన్నారు.
అలాగే, సమీప భవిష్యత్తులో జనాభా నియంత్రణ కోసం భారత ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు.
దేశంలోని ముస్లిం జనాభా:
స్వాతంత్ర్యం వచ్చిన 73 ఏళ్లలో భారతదేశంలో ముస్లింల జనాభా 3 కోట్ల నుండి 30 కోట్లకు పెరిగిందని పోస్ట్ పేర్కొంది . అయితే, 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, దేశంలోని మొత్తం ముస్లిం జనాభా 17.22 కోట్లు, ఇది భారతదేశ జనాభాలో 14.2%. అధికారిక గణాంకాల ప్రకారం, భారతదేశంలో మొత్తం ముస్లింల జనాభా 17.22 కోట్లు.
అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ 2015లో విడుదల చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం, 2050 నాటికి భారతదేశంలో మొత్తం ముస్లింల జనాభా 31.1 కోట్లకు మరియు హిందువుల జనాభా 130 కోట్లకు చేరుకుంటుంది. ఈ రిపోర్టు ప్రకారం, 2020 నాటికి భారతదేశంలో 21.3 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు.
పై సమాచారం ఆధారంగా, ఈ పోస్టులో పేర్కొన్న విషయాలు అవాస్తవం అని. అలాగే, భారతదేశంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని మనం నిర్థారించవచ్చు.
చివరగా, భారతదేశంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు; ఈ వైరల్ పోస్టు ఫేక్.