Fake News, Telugu
 

LIC సంస్థ అదాని గ్రూప్ సంస్థల్లో కేవలం రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టి రూ. 65 వేల కోట్ల లాభాలకు చేరుకోలేదు

0

భారత జీవిత భీమా సంస్థ (LIC) అదాని గ్రూప్ సంస్థలలో మొత్తంగా రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెడితే, అది రూ. 80 వేల కోట్ల లాభాలకు చేరి, తాజా ఒడిదుడుకుల కారణంగా వాటి పెట్టుబడి విలువ రూ. 65 వేల కోట్లకు చేరిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టి, దాని పెట్టుబడి విలువ 65 కోట్లకు చేరితే అది నష్టాలలో ఉన్నట్టు ఎలా అవుతుందని ఈ పోస్టులో ప్రశ్నిస్తున్నారు. అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ కథనంతో ఆదాని గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆదాని సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన LIC అని చర్చ నేపథ్యంలో ఈ పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: LIC సంస్థ అదాని సంస్థలలో రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెడితే, దాని ప్రస్తుత పెట్టుబడి విలువ రూ. 65 వేల కోట్లకు చేరింది.

ఫాక్ట్ (నిజం): ఆదాని సంస్థలలో మొత్తంగా రూ. 30,127 కోట్లు పెట్టుబడి పెడితే 27 జనవరి 2023 నాటి మార్కెట్ ధరతో చూస్తే LIC పెట్టుబడి విలువ రూ. 56,142 కోట్లకు చేరుకుందని LIC 30 జనవరి 2023 నాడు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఆదాని సంస్థల స్టాక్స్ పతనమవుతున్నప్పటికీ LIC నష్టాలలోకి పోలేదని ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు అదాని సంస్థలలో కేవలం రూ. 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టి, రూ. 65 వేల కోట్ల లాభాలకు LIC చేరుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వేతికితే, ఆదాని సంస్థలలో తమ పెట్టుబడులకు సంబందించి స్పష్టతనిస్తూ LIC సంస్థ 30 జనవరి 2023 నాడు విడుదల చేసిన ప్రకటన దొరికింది. ఆదాని సంస్థలలో మొత్తంగా రూ. 30,127 కోట్లు పెట్టుబడి పెడితే, 27 జనవరి 2023 నాటి మార్కెట్ ధరతో చూస్తే LIC పెట్టుబడి విలువ రూ. 56, 142 కోట్లకు చేరుకుందని LIC ఈ ప్రకటనలో తెలిపింది. 30 జనవరి 2023 నాటికి ఆదాని సంస్థలలో తమ మొత్తం పెట్టుబడి రూ. 36,474.78 కోట్లకు చేరుకుందని ఎల్ఐసి ఈ ప్రకటనలో తెలిపింది.

LIC నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు విలువ 30 సెప్టెంబర్ 2022 నాటికి రూ. 41.66 లక్షల కోట్ల పైబడి ఉంటుందని, ఇందులో ఆదాని సంస్థలలో పెట్టిన పెట్టుబడి కేవలం 0.975 శాతమని LIC స్పష్టం చేసింది. LIC తెలిపిన ఈ వివరాలను రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఆదాని సంస్థల స్టాక్స్ ప్రస్తుతం నష్టాలలో ఉన్నప్పటికీ LIC పెట్టుబడుల విలువలు నష్టాలలోకి పోలేదని LIC ఈ ప్రకటనలో తెలిపింది. కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు అదాని సంస్థలలో కేవలం రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టి, రూ.65 వేల కోట్ల లాభాలకు LIC చేరుకోలేదు.

చివరగా, LIC అదాని సంస్థలలో కేవలం రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టి రూ.65 వేల కోట్ల లాభాలకు చేరుకోలేదు.

Share.

About Author

Comments are closed.

scroll