Fake News, Telugu
 

అయోధ్యలో సరయూ ఎక్స్‌ప్రెస్‌లో గాయాలతో కనిపించిన మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై లైంగిక దాడి జరగలేదు

0

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో కదులుతున్న రైలులో మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై ఎనిమిది మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. యోగి ఆదిత్యనాథ్ పాలిస్తున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కనీసం మహిళా పోలీసులకు కూడా భద్రత లేదని బ్లర్ చేసిన ఒక ఫోటోని ఈ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో కదులుతున్న రైలులో మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై ఎనిమిది మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడినట్టుగా షేర్ చేస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): అయోధ్య రైల్వే జంక్షన్ స్టేషన్‌లో సరయూ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కంపార్ట్‌మెంట్‌లో 45 ఏళ్ల మహిళా హెడ్ కానిస్టేబుల్ పలు కత్తిపోట్లతో అపస్మారక స్థితిలో కనిపించినట్టు పలు వార్త సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ ఘటనకు సంబంధించి GRP లక్నో పరిధిలోని అయోధ్య కంట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఇప్పటివరకు జరిగిన ప్రాధమిక విచారణలో మహిళా కానిస్టేబుల్‌పై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారణ అయ్యిందని పోలీసులు మీడియాకి స్పష్టం చేశారు. ఈ ఘటనతో భజరంగ్ కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేదని GRP లక్నో ఎస్పి పూజ యాదవ్ మాకు స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలను చూపిస్తున్న ఫోటోలను, వీడియోలను పలు రిపోర్టర్లు, సోషల్ మీడియా యూసర్లు ఇటీవల షేర్ చేసినట్టు తెలిసింది. అయోధ్యలో కదులుతున్న రైలులో ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో సీట్ బెర్త్ కింద పడి కనిపించిన దృశ్యాలంటూ ఒక రిపోర్టర్ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి హిందుస్తాన్ టైమ్స్ వార్తా సంస్థ 01 సెప్టెంబర్ 2023 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసనట్టు తెలిసింది. 30 ఆగస్టు 2023 నాడు అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్‌లో సరయూ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఒక మహిళా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పలు కత్తిపోట్లతో అపస్మారక స్థితిలో కనిపించినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ప్రయాణికులు మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ను గుర్తించినప్పుడు ఆమె తలకు తీవ్ర గాయాలతో, యూనిఫాం కింది భాగం లేకుండా కనిపించిందని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అంధించడంతో, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) సిబ్బంధి అక్కడికి చేరుకొని గాయపడిన కానిస్టేబుల్‌ను లోకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుండి మళ్ళీ లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) ట్రామా సెంటర్‌కు తరలించినట్టు తెలిసింది.

తొలుత హెడ్ కానిస్టేబుల్ యూనిఫాం కింది భాగం కనిపించకపోవడంతో లైంగిక వేధింపులు జరిగినట్లు అనుమానించినప్పటికి, ప్రాధమిక విచారణలో ఆమెపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారణ అయ్యిందని GRP లక్నో ఎస్పీ పూజా యాదవ్ మీడియాకు స్పష్టం చేశారు. ప్రస్తుతం మహిళా కానిస్టేబుల్‌ ఇంకా మాట్లాడలేని స్థితిలో ఉందని, ఈ ఘటనకు సంబంధించి నాలుగు బృందాలతో విచారణ జరుపుతున్నామని  పూజ యాదవ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ చేసిన మారికొన్ని వార్తా రిపోర్టులను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ ఘటనకు సంబంధించి GRP లక్నో పరిధిలోని అయోధ్య కంట్ పోలిసే స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది.  ఈ ఎఫ్ఐఆర్‌లో నిందితులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని ఎక్కడా పేర్కొనలేదు. కొందరు అజ్ఞాత వ్యక్తులు తన సోదరిపై ఈ ఘాతకనికి పాల్పడినట్టు మహిళ కానిస్టేబుల్ సోదరుడు సచిన్ కుమార్ పటేల్ ఎఫ్ఐఆర్‌లో తెలిపారు.

సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి ప్రచారం చేస్తున్న పుకార్లకు సంబంధించిన స్పష్టత కోసం మేము GRP లక్నో ఎస్పి పూజా యాదవ్‌ను సంప్రదించాము. సరయూ ఎక్స్‌ప్రెస్‌లో గాయాలతో కనిపించిన మహిళా కానిస్టేబుల్‌పై భజరంగ్ దళ్ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడ్డారని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని పూజ యాదవ్‌ మాకు స్పష్టం చేశారు.

చివరగా, అయోధ్యలో సరయూ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గాయాలతో కనిపించిన మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై లైంగిక దాడి జరగలేదు.

Share.

About Author

Comments are closed.

scroll