Fake News, Telugu
 

పెట్రోల్ పై గత ప్రభుత్వాలు చేసిన అప్పులకి సంబంధించి ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం చెల్లించింది రూ. 73,696 కోట్లు మాత్రమే, 2.5 లక్షల కోట్లు కాదు

0

గత ప్రభుత్వాలు పెట్రోల్ కి సంబంధించి ఇతర దేశాల నుండి తెచ్చిన రూ. 2.5 లక్షల కోట్ల అప్పుని మరియు ఈ అప్పుల పై సంవత్సరానికి రూ. 25,000 కోట్ల వడ్డీని నరేంద్ర మోదీ తిర్చినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గత ప్రభుత్వాలు పెట్రోల్ కి సంబంధించి ఇతర దేశాల నుండి తెచ్చిన రూ. 2.5 లక్షల కోట్ల అప్పుని మరియు ఈ అప్పుల పై సంవత్సరానికి రూ. 25,000 కోట్ల వడ్డీని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీర్చింది.

ఫాక్ట్ (నిజం): 2014లో మోదీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చేసరికి పెట్రోల్ పై చెల్లించాల్సిన ఆయిల్ బాండ్స్ బాకీ కేవలం రూ. 1,34,423 కోట్లు మాత్రమే. ఇవి కూడా ఆయిల్ బాండ్స్ రూపంలో ఉండడంతో ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు, కేవలం బాండ్ మెచ్యూర్ అయినప్పుడు కడితే సరిపోతుంది. ఇప్పటివరకి మెచ్యూర్ అయిన బాండ్స్ కి చెల్లించింది రూ. 3500 కోట్లు, ఈ బాండ్స్ కి వడ్డీ కింద సుమారు రూ. 70,196 కోట్ల రూపాయలు చెల్లించారు. మొత్తం కలుపుకొని 2014 నుండి 2021 వరకు రూ. 73,696 కోట్ల చెల్లించింది, అనగా మోదీ ప్రభుత్వం ఈ ఏడు సంవత్సరాలలో  సగటున సంవత్సరానికి రూ. 10,528 కోట్ల చెల్లించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

క్లెయిమ్ 1: గత ప్రభుత్వాలు పెట్రోల్ కోసం ఇతర దేశాల నుండి రూ. 2.5 లక్షల కోట్ల అప్పు చేసాయి, ఈ అప్పుని మోదీ ప్రభుత్వం తీర్చింది

మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ కోసం ఇతర దేశాల (పెట్రోల్ అమ్మే దేశాల) వద్ద అప్పులు చేయలేదు. ఇలా ఇతర దేశాల దగ్గర అప్పులు చేసాయని చెప్పడానికి ఎటువంటి అధికారిక సమాచారం గాని లేక వార్తా కథనాలు గాని లేవు. ఒకవేళ ప్రభుత్వాలు ఇలా అప్పులు చేసుంటే ఈ అప్పులకి సంబంధించి లెక్కలు మొత్తం బడ్జెట్ లో చూపించాల్సి ఉంటుంది, ఐతే కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోని బడ్జెట్ డాకుమెంట్స్ లో ఇలా పెట్రోల్ అమ్మే దేశాల వద్ద అప్పు తెచ్చినట్టు లేదా ఆ దేశాలకు పెట్రోల్ కి సంబంధించిన వడ్డీ కడుతునట్టు ఎటువంటి పద్దు లేదు. దీన్నిబట్టి కూడా గత ప్రభుత్వాలు పెట్రోల్ కోసం ఇతర దేశాల దగ్గర అప్పు చేయలేదని స్పష్టమవుతుంది.

ఐతే గత ప్రభుత్వాల సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరినప్పుడు వాటి ప్రభావం దేశంలోని పెట్రోల్ మరియు డీజిల్ వినియోగదారులపై పడకుండా నియంత్రించే నేపథ్యంలో ప్రభుత్వాలు సబ్సిడీలు అందించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు ఈ పెరిగినదానికి అనుగుణంగా దేశంలో పెట్రోల్ రేట్లు పెంచకుండా ఆ భారాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే (OMC) భరించేవి. ఐతే ఇలా తక్కువ ధరకి అమ్మడం వల్ల ఈ కంపెనీలకు కలిగే నష్టాన్ని అండర్ రికవరీస్ అంటారు, ఈ అండర్ రికవరీస్ ని ప్రభుత్వం, అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను అన్ని కలిసి భరించాయి.

గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం బడ్జెట్ లో కొంత డబ్బు కేటాయించడం ద్వారా  ఈ కంపెనీలకు కలిగిన నష్టాలను పూరించింది. వీటికి సంబంధించిన వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే కొన్ని సందర్భాల్లో ఈ కంపెనీలకు నగదు చెల్లించకుండా ఒక నిర్దిష్ట వడ్డీ రేట్ మరియు మెచ్యూరిటీ పీరియడ్ కలిగిన ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసాయి. ఐతే ఈ ఆయిల్ బాండ్స్ ని గత UPA ప్రభుత్వం, అంతకు ముందు ఉన్న వాజపేయి నాయకత్వంలోని NDA ప్రభుత్వం కూడా జారీ చేసాయి. ఈ బాండ్స్ లలో కూడా కొంత వరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. ఇలా ఆయిల్ కంపెనీలకు అండర్ రికవరీస్ రూపంలో మరియు మెచ్యూర్ అయిన ఆయిల్ బాండ్లకు చెల్లించింది పోగా 2014లో మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చేసరికి పెట్రోల్ పై చెల్లించాల్సిన ఆయిల్ బాండ్స్ బాకీ కేవలం రూ. 1,34,423 కోట్లు మాత్రమే. ఐతే ఇవి కూడా ఆయిల్ బాండ్స్ రూపంలో ఉండడంతో ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు, కేవలం బాండ్ మెచ్యూర్ అయినప్పుడు కడితే సరిపోతుంది. కాకపోతే ఈ బాండ్లకు సంబంధించి ప్రతీ సంవత్సరం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ఐతే మొదటిసారి మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఇప్పటివరకు కేవలం రెండు బాండ్లు మాత్రమే మెచ్యూర్ అయ్యాయి. 2015లో రూ. 1750 కోట్ల విలువ గల రెండు బాండ్లు మెచ్యూర్ అవ్వడంతో మోదీ ప్రభుత్వం ఈ బాండ్లకు సంబంధించి మొత్తం రూ. 3500 కోట్లు చెల్లించింది.  అంటే చెల్లించాల్సిన అసలు రూ. 1,34,423 కోట్లలో మోదీ ప్రభుత్వం ఇప్పటివరకి కేవలం రూ. 3500 కోట్లు చెల్లించింది.

ఆయిల్ బాండ్స్, అండర్ రికవరీస్ మొదలైన అంశాలకు సంబంధించి కూలంకషంగా వివరిస్తూ FACTLY ఇంతకు ముందు రాసిన కథనాలు ఇక్కడ, మరియు ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్ 2: పెట్రోల్ పై గత ప్రభుత్వాలు చేసిన అప్పుకి మోదీ ప్రతీ సంవత్సరం రూ. 25,000 కోట్లు చేల్లిస్తున్నాడు:

2014 నుండి 2021 వరకు మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లలోని సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం ఆయిల్ బాండ్స్ పై వడ్డీ రూపంలో సుమారు రూ. 70,196 కోట్ల రూపాయలు చెల్లించింది. అనగా మోదీ ప్రభుత్వం ఈ ఏడు సంవత్సరాల నుండి  సగటున సంవత్సరానికి సుమారు రూ. 10,000 కోట్ల చెల్లించింది. పోస్టులో చెప్తున్నట్టు రూ. 25,000 కోట్లు కాదు.

క్లుప్తంగా చెప్పాలంటే పెట్రోల్ పై గత ప్రభుత్వాల చేసిన అప్పులకు సంబంధించి  మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు మెచ్యూర్ అయిన ఆయిల్ బాండ్స్ రూపంలో రూ. 3500 కోట్లు చెల్లించగా, వడ్డీ రూ. 70,196 కోట్ల  చెల్లించింది. మొత్తం కలుపుకొని 2014 నుండి 2021 వరకు రూ. 73,696 కోట్ల చెల్లించింది, అనగా మోదీ ప్రభుత్వం ఈ ఏడు సంవత్సరాలలో  సగటున సంవత్సరానికి రూ. 10,528 కోట్ల చెల్లించింది. పోస్టులో చెప్తున్నట్టు మోదీ పెట్రోల్ పై రూ. 2.5 లక్షల కోట్ల అప్పును తీర్చిందనడంలో నిజం లేదు. పైగా గత ప్రభుత్వ కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో బారెల్ ముడి చమురు ధర చాలా తక్కువగా ఉంది.

చివరగా, పెట్రోల్ పై గత ప్రభుత్వాలు చేసిన అప్పులకి సంబంధించి ఇప్పటి వరకు మోదీ చెల్లించింది రూ. 73,696 కోట్లు మాత్రమే, 2.5 లక్షల కోట్లు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll