Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఫోటోలో తన కుటుంబ సభ్యులను దూరం నుండి చూస్తున్న వ్యక్తీ ఇండోనేషియా డాక్టర్ హైడియో అలీ కాదు

0

ఫేస్బుక్ లో కొన్ని ఫోటోలతో ఒక పోస్టు ని పెట్టి, అందులోని ఒక ఫోటోలో ఉన్నది కొరోనా వైరస్ ఉన్నట్లుగా తేలిన ఇండోనేషియాకు చెందిన డాక్టర్ హైడియో అలీ అని, ఇకపై బ్రతక లేనని భావించిన అతను, తన ఇంటికి వెళ్లి గేటు వెలుపలే నిలబడి, తన పిల్లలను మరియు గర్భిణీ అయిన తన భార్యను చివరిసారిగా చూసాడని, ఆ చిత్రాన్ని అతని భార్య తీసిందని చెప్తున్నారు. పోస్టులో ఆ ఫోటో గురించి చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తన పిల్లలను మరియు గర్భిణీ భార్యను చివరిసారిగా చూస్తున్న ఇండోనేషియా డాక్టర్ హైడియో అలీ ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటో లో ఉన్నది ఇండోనేషియా డాక్టర్ హైడియో అలీ కాదు. అందులో ఉన్నది మలేషియా కి చెందిన ఒక డాక్టర్. ఆ ఫోటో ని మలేషియా కి చెందిన ఒక వ్యక్తి ఫేస్బుక్ లో పోస్టు చేసి, అందులోని డాక్టర్ తన బంధువు అని, దేశం లో COVID-19 తీవ్రంగా వ్యాప్తి చెందుతుండడం తో ఆయన కుటుంబాన్ని వదిలేసి నిరంతరంగా పని చేస్తున్నాడనీ, దాంతో తీరిక లేకపోవడంతో అతను తన పిల్లలను మరియు భార్యని దూరం నుండి చూసి వెళ్లాల్సి వస్తోందని, ఫోటో అందుకు సంబంధించినదని తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫోటో ని క్రాప్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఒక ఆన్ లైన్ వెబ్సైటు యొక్క కథనం లభించింది. దాని ద్వారా, ‘Ahmad Effendy Zailanudin’ అనే మలేషియా దేశపు వ్యక్తి ఆ ఫోటోని ఫేస్బుక్ లో పోస్టు చేసినట్లుగా తెలిసింది. అతని టైంలైన్ లో చూసినప్పుడు, ఆ పోస్టు లభించింది. 21 మర్చి న పెట్టిన ఆ పోస్టు లో అతను, ఫోటోలో ఉన్నది తన బంధువు అని, ఆయన ఒక డాక్టర్ అని, దేశం (మలేషియా) లో COVID-19 తీవ్రంగా వ్యాప్తి చెందుతుండడం తో ఆయన కుటుంబాన్ని వదిలేసి నిరంతరంగా పని చేస్తున్నాడని, తీరిక లేక అతను తన పిల్లలను మరియు భార్య ని దూరం నుండి చూసి వెళ్లాల్సి వస్తోందని తెలిపాడు. అంతేకాదు, ఆ పోస్టు లో జైలనుదిన్ తన ఫేస్బుక్ మిత్రులను ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ఇంట్లోనే సురక్షితంగా ఉండవలసిందిగా కోరాడు.  

పోస్టులోని ఫోటో వైరల్ అవ్వడంతో జైలనుదిన్ ఫేస్బుక్ లో 26 మర్చి రోజు మరొక పోస్టు పెట్టి, తాను ఇంతకుముందు పెట్టిన ఫోటో తప్పుడు ఆరోపణతో చలామణీ అవ్తున్నట్లుగా తెలిపాడు. అంతేకాదు, ఒక ఇండియన్ జర్నలిస్ట్ ఫోటో గురించి అడిగినప్పుడు, అందులో ఉన్నది తన బంధువని, డాక్టర్ హైడియో కాదని తెలిపినట్లుగా మెసెంజర్ స్క్రీన్ షాట్లను చూడవచ్చు.

ఇండోనేషియా కి చెందిన ఒక ఫాక్ట్ చెక్ సంస్థ కుడా ఫోటోలో ఉన్నది డాక్టర్ హైడియో అలీ కాదని, అందులోని వ్యక్తి మలేషియా కి చెందిన ఒక డాక్టర్ అని రాసినట్లుగా ఇక్కడ చూడవచ్చు.

పోస్టులోని మరొక ఫోటోలో ఉన్న వ్యక్తి ఇండోనేషియా కి చెందిన డాక్టర్ హైడియో అలీ. అతను ఇటివల కొరోనావైరస్ సోకి చనిపోయినట్లుగా స్థానిక వార్తా సంస్థ ప్రచురించిన కథనం ద్వారా తెలుసుకోవచ్చు.

చివరగా, ఫోటోలో తన కుటుంబ సభ్యులను దూరం నుండి చూస్తున్న వ్యక్తీ ఇండోనేషియా డాక్టర్ హైడియో అలీ కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll