Fake News, Telugu
 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఆయిల్ బాండ్స్ బకాయిలు బీజేపీ ప్రభుత్వం ఇంకా తీర్చలేదు

0

కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో పెట్రోల్ మరియు డీజిల్ కోసం లక్షల కోట్లు అప్పులు చేస్తే బీజేపీ ప్రభుత్వం వాటిని తీర్చిందని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో పెట్రోల్ మరియు డీజిల్ కోసం లక్షల కోట్లు అప్పులు చేస్తే బీజేపీ ప్రభుత్వం వాటిని తీర్చింది.

ఫాక్ట్ (నిజం): ఆయిల్ బాండ్స్ పై గత UPA, NDA ప్రభుత్వాలతో పాటు ఇప్పటి మోదీ నేతృత్వం లోని NDA ప్రభుత్వం కూడా వడ్డీ చేల్లిస్తూ వస్తున్నప్పటికి, మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకి  మెచ్యూర్ అయిన ఆయిల్ బాండ్స్ కి చెల్లించింది కేవలం రూ. 3500 కోట్లు మాత్రమే. ఆయిల్ బాండ్స్ కోసం చేసిన చాలా వరకు మార్కెట్ అప్పు ఇంకా ప్రభుత్వం తీర్చలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పెట్రోల్ మరియు డీజిల్ కొనుగోలు కోసం గత ప్రభుత్వాలు విదేశాల దగ్గరి నుండి గాని లేక వరల్డ్ బ్యాంకు, IMF వంటి అంతర్జాతీయ సంస్థల నుండి గాని అప్పు తీసుకున్నట్టు మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఐతే ఇంతకు ముందు పాలించిన UPA మరియు NDA ప్రభుత్వాల సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరినప్పుడు వాటి ప్రభావం దేశంలోని పెట్రోల్ మరియు డీజిల్ వినియోగదారుడిపై పడకుండా నియంత్రించే నేపథ్యంలో ప్రభుత్వాలు సబ్సిడీలు అందించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు ఈ పెరిగిన మొత్తాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) వినియోగదారుడికి బదలాయించకుండా ఉండేందుకు ఈ కంపెనీలు భరించాల్సిన నష్టానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నిర్ణిత వడ్డీ రేట్ చొప్పున 10 నుండి 20 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ గల ఆయిల్ బాండ్స్ రూపంలో చెల్లించాయి. 2008లో UPA ప్రభుత్వం ఆయిల్ బాండ్స్ కి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు. 2002-03 బడ్జెట్ స్పీచ్ లో అప్పటి NDA ప్రభుత్వం ఆయిల్ బాండ్స్ చేయదలచుకుందని చెప్పిన విషయం ఇక్కడ చూడొచ్చు. ఐతే 2010లో ఇలా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను నియంత్రించే పద్దతిని ఆపేసి, పెట్రోల్ ధరలు మార్కెట్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారే పద్దతిని తీసుకొచ్చారు.

2014-15 బడ్జెట్ లెక్కల ప్రకారం 2013-14 చివరికల్లా ఆయిల్ బాండ్స్ రూపంలో చెల్లించాల్సిన మొత్తం విలువ రూ. 1,34,423 కోట్లుగా ఉందని తెలిసింది. ఐతే ఈ బాండ్స్ వేరువేరు మెచ్యూరిటీ పీరియడ్ కలిగి ఉన్నాయి. అంటే మొదటి సారి మోదీ ప్రధానమంత్రి అయ్యే సమయానికి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.1,34,423 కోట్లు. ఇందులో రూ. 3500 కోట్ల విలువగల రెండు బాండ్స్ 2015లో మెచ్యూర్ కానుండడంతో అప్పటి బీజేపీ ప్రభుత్వం వాటిని చెల్లించింది.  

కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశ పెట్టిన 2021-22  బడ్జెట్ ప్రకారం 2020-21 చివరికల్లా ఆయిల్ బాండ్స్ రూపంలో చెల్లించాల్సిన మొత్తం విలువ రూ.1,30,923 కోట్లుగా ఉండడంతో బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకి చెల్లించింది కేవలం రూ. 3500 కోట్లేనని స్పష్టమవుతుంది.  ఐతే 2021లో రూ. 10,000 కోట్ల విలువగల రెండు బాండ్స్ మెచ్యూర్ అవుతుండడం గమనించాల్సిన విషయం. 2021 లో చెల్లించే 10 వేల కోట్ల తరువాత కూడా ఇంకా లక్ష ఇరవై వేల కోట్ల కంటే ఎక్కువ ఆయిల్ బాండ్స్ అప్పు ప్రభుత్వం ఇంకా బాకీ ఉంటుంది.

ఐతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి జారీచేసిన బాండ్స్ కి ప్రతీ సంవత్సరం వడ్డీ చెల్లిస్తూ వస్తున్నారు, 2009-14 కాలంలో UPA ప్రభుత్వం పెట్రోల్ ధరల సబ్సిడీ కింద ఇంతకూ ముందు జారీ చేసిన బాండ్లపై వడ్డీ కింద మొత్తం, రూ.53,136 కోట్లు చెల్లించింది. 2014-19 కాలంలో NDA ప్రభుత్వం వడ్డీ రూపంలో మొత్తం రూ.50,216 కోట్లు చెల్లించింది. 2020-21 బడ్జెట్ లెక్కల ప్రకారం 2019-20 సంవత్సరానికి సంబంధించి సవరించిన బడ్జెట్ అంచనాలలో ఆ సంవత్సరం ఆయిల్ బాండ్స్ కి సంబంధించి చెల్లించిన వడ్డీ మొత్తం రూ. 9,989.96 కోట్లు కాగా, 2020-21లో కూడా ఇదే మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్ అంచనా వేసింది. ఆయిల్ బాండ్స్ పై గత UPA & NDA ప్రభుత్వాలతో పాటు ఇప్పటి మోదీ నేతృత్వం లోని NDA ప్రభుత్వం వడ్డీ చేల్లిస్తూ వస్తున్నప్పటికి, ఇప్పటివరకైతే మోదీ ప్రభుత్వం మెచ్యూర్ అయిన ఆయిల్ బాండ్స్ కి చెల్లించింది కేవలం రూ. 3500 కోట్లు మాత్రమే. ఇంకా లక్ష కోట్లకి పైగా బాండ్స్ అప్పు ప్రభుత్వం కట్టాల్సి ఉంది.

చివరగా, 2014 నుండి మోదీ ప్రభుత్వం ఆయిల్ బాండ్స్ కి చెల్లించింది కేవలం రూ. 3500 కోట్లు మాత్రమే. ఇంకా లక్ష కోట్లకి పైగా బాండ్స్ అప్పు ప్రభుత్వం కట్టాల్సి ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll