Fake News, Telugu
 

పెట్రోల్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సుమారు 8 లక్షల కోట్ల అప్పు మోదీ ప్రభుత్వం తీర్చిందనడంలో నిజం లేదు

0

కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ అమ్మే దేశాల వద్ద చేసిన అప్పు, ఆయిల్ బాండ్స్ రూపంలో చేసిన అప్పు మరియు ఆయిల్ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలు మొత్తం చెల్లించింది మోదీ ప్రభుత్వమే అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ పై చేసిన వివిధ అప్పులు మరియు చెల్లించాల్సిన బాకీలు మొత్తం చెల్లించింది మోదీ ప్రభుత్వమే.

ఫాక్ట్ (నిజం): కాంగ్రెస్ హాయంలో ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన సబ్సిడీల్లో ఎక్కువ శాతం 2014 కంటే ముందే చెల్లించేసింది. ఐతే కట్టాల్సిన మిగిలింది ఆయిల్ బాండ్స్ రూపంలో ఉండడంతో అవి మెచ్యూర్ అయ్యే సమయానికి కట్టాల్సి ఉంటుంది. ఐతే మొదటి సారి మోదీ ప్రధానమంత్రి అయ్యే సమయానికి  కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీల సబ్సిడీలకు ఆయిల్ బాండ్ల రూపంలో చెల్లించాల్సిన మొత్తం విలువ రూ. 1,34,423 కోట్లు మాత్రమే. పైగా 2014 నుండి 2020 మధ్య మోదీ ప్రభుత్వం కాలంలో మెచ్యూర్ అయిన ఆయిల్ బాండ్స్ కి చెల్లించింది రూ. 3500 కోట్లు. దీనికి అదనంగా ఆయిల్ బాండ్స్ వడ్డీకి సంబంధించి మోదీ ప్రభుత్వం చెల్లించింది రూ. 70,196 కోట్లు. అంటే గత ప్రభుత్వాలు ఇష్యూ చేసిన ఆయిల్ బాండ్స్ కి మోదీ ప్రభుత్వం మొత్తం కలిపి చెల్లించింది రూ. 73,696 కోట్లు మాత్రమే, పోస్టులో చెప్తున్నట్టు 8 లక్షల కోట్లు కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

క్లెయిమ్ 1 : కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోలు అమ్మే దేశాలకు పెట్టిన చమురు అప్పు 1,30,000 కోట్లు + వడ్డీ 40,000 కోట్లు = మొత్తం 1,70,000 కోట్ల రూపాయలు తీర్చినది మోదీ ప్రభుత్వమే!

పెట్రోల్ అమ్మే దేశాల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసాయని చెప్పడానికి మాకు ఎటువంటి అధికారిక సమాచారం గాని లేక వార్తా కథనాలు గాని లభించలేదు. ఒక ప్రభుత్వాలు ఇలా అప్పులు చేసుంటే ఈ అప్పులకి సంబంధించి లెక్కలు మొత్తం బడ్జెట్ లో చూపించాల్సి ఉంటుంది, ఐతే కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోని బడ్జెట్ డాకుమెంట్స్ లో ఇలా పెట్రోల్ అమ్మే దేశాల వద్ద అప్పు తెచ్చినట్టు లేక ఆ దేశాలకు పెట్రోల్ కి సంబంధించి వడ్డీ కడుతునట్టు ఎటువంటి పద్దు లేదు. కావున పోస్టులో చెప్తున్న అంకెలు నిజం కాదని చెప్పొచ్చు.

క్లెయిమ్ 2 & 3 :  కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ బాండ్స్ పేరుతో చేసిన అప్పు 2 లక్షల14 వేల కోట్ల రూపాయలు తీర్చినది మోదీ ప్రభుత్వమే! & ఆయిల్ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలసిన సబ్సిడీలు 4,34,000 కోట్ల రూపాయలను ఇచ్చినది మోదీ ప్రభుత్వమే!

సాధారణంగా అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ (ONGC & OIL) తాము ముడి చమురు ఉత్పత్తి చేయడంతో పాటు విదేశాలనుండి దిగుమతి చేసుకొంటాయి. ఇలా దిగుమతి చేసుకొన్న ముడి చమురుని ఈ అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు IOCL, HPCL & BPCL వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి చెందిన రిఫైనరీ విభాగాలకు అమ్ముతాయి, ఈ రిఫైనరీ విభాగాలు ముడి చమురుని రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్,కిరోసిన్, LPG వంటి ఉత్పత్తులను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల యొక్క మార్కెటింగ్ విభాగాలకు అమ్ముతాయి, ఇలా కొన్న పెట్రోల్ మరియు డీజిల్ ని తమ సంస్థ రిటైల్ ఔట్లెట్ (పెట్రోల్ పంప్స్, etc) ద్వారా వినియోగదారులకి కస్టమర్లకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అందిస్తాయి.

 ఐతే చాలా వరకు అప్ స్ట్రీమ్ కంపెనీలు ముడి చమురు దిగుమతి చేసుకుంటాయి కాబట్టి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు వాటి ప్రభావం కస్టమర్స్ పై పడకుండా ఈ అప్ స్ట్రీమ్ కంపెనీలు రిఫైనరీలకి ముడి చమురు డిస్కౌంట్ రేట్స్ కి అమ్మేలా, అలాగే కస్టమర్స్ కి తక్కువ ధరకి అమ్మేలా  ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను నియంత్రిస్తాయి. ఐతే ఇలా తక్కువ ధరకి అమ్మడం వల్ల ఈ కంపెనీలకు కలిగే నష్టాన్ని అండర్ రికవరీస్ అంటారు. ఈ అండర్ రికవరీస్ ని ప్రభుత్వం, అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను అన్ని కలిసి భరిస్తాయి.

అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలకు మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు బడ్జెట్ లో కొంత నగదు కేటాయించడం, ఒక్కోసారి పెద్ద మొత్తంలో నగదు చెల్లించలేక ఈ సబ్సిడీలకు బదులు ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నిర్ణిత వడ్డీ రేట్ చొప్పున 10 నుండి 20 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ గల ఆయిల్ బాండ్స్ రూపంలో చెల్లించడం, ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేయడం వంటి మార్గాల ద్వారా ఈ  అండర్ రికవరీస్ ని ప్రభుత్వం చెల్లిస్తుంది. గత UPA మరియు వాజపేయి హయాంలోని NDA కూడా ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసాయి.

పెట్రోలియం మంత్రిత్వ శాఖలో 2015-16వ సంవత్సరానికి సంబంధించిన వార్షిక రిపోర్ట్ ప్రకారం 2004-05 నుండి 2014-15 మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ మరియు LPG తక్కువ ధరలకు వినియోగదారుడి అందించడం వల్ల అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సుమారు రూ. 8,53,628 కోట్లు నష్ట (అండర్ రికవరీస్) పోయాయి. ఇందులో కేవలం పెట్రోల్ మరియు డీజిల్ వల్ల కలిగిన  అండర్ రికవరీస్ విలువ రూ. 4,36,830  కోట్లు. పోస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు ఇవ్వాల్సిన సబ్సిడీలంటూ ప్రస్తావించింది వీటి గురించే.

ఐతే 2004-14 మధ్య కాలంలో ఆయా సమయాల్లో ఉన్న పెట్రోలియం మంత్రులు లోక్ సభలో జవాబుల రూపంలో అందించిన సమాచారం(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెబ్సైటులో ఉన్న వార్షిక రిపోర్ట్స్ (ఇక్కడ, ఇక్కడ) లోని  సమాచారం మేరకు 2007-14 మధ్య కాలంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అండర్ రికవరీస్ కి బడ్జెట్ లో నగదు కేటాయించడం మరియు ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేయడం లాంటి వాటితో అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు  రూ.4,27,854 కోట్లు చెల్లించాయి. ఇదే సమయానికి వాటికీ కలిగిన నష్టాలకు అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు రూ. 2,84,456 కోట్లు భరించగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ. 31,785 కోట్లు భరించాయి.

2004-07 మధ్య కాలంలో ఆయిల్ కంపెనీలకు చెల్లించిన సబ్సిడీలకు సంబంధించి సమగ్ర సమాచారం మాకు లభించలేదు. కాకపోతే 2004-07 కాలంలోని లోక్ సభ సమాధానాలు (ఇక్కడ, ఇక్కడ), మంత్రిత్వ శాఖ వెబ్సైటులో ఉన్న వార్షిక రిపోర్ట్స్ (ఇక్కడ)  ద్వారా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన సబ్సిడీల్లో 2005-06లో రూ. 11500 కోట్లు, 2006-07లో రూ. 24121 కోట్లు విలువగల ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేయగా మిగలినవి ఆయిల్ కంపెనీలు తమ వాటా కింద చెల్లించాయి.  వీటన్నిటి ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన రూ. 8,53,628 కోట్లు సబ్సిడీల్లో ఎక్కువ శాతం చెల్లించిందని, మిగిలిన కొంత ఆయిల్ బాండ్స్ రూపంలో ఉండటంతో అవి మెచ్యూర్ అయ్యే సమయానికి కట్టాల్సి ఉంటుంది.

2014-15 బడ్జెట్ సమాచారం ద్వారా కూడా మనకు ఇదే స్పష్టమవుతుంది. ఎందుకంటే 2014-15 బడ్జెట్ లెక్కల ప్రకారం 2013-14 చివరికల్లా ఆయిల్ బాండ్స్ రూపంలో చెల్లించాల్సిన మొత్తం విలువ రూ. 1,34,423 కోట్లు. అంటే మొదటి సారి మోదీ ప్రధానమంత్రి అయ్యే సమయానికి  కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీల సబ్సిడీలకు బాండ్ల రూపంలో చెల్లించాల్సిన మొత్తం విలువ రూ.1,34,423 కోట్లు అన్న మాట. ఐతే ఈ బాండ్స్ 2015లో రెండు , 2021 లో రెండు, 2023 లో రెండు, ఇలా వేరువేరు మెచ్యూరిటీ పీరియడ్ కలిగి ఉన్నాయి. ఇందులో రూ. 3500 కోట్ల విలువగల రెండు బాండ్స్ 2015లో మెచ్యూర్ అవ్వడంతో అప్పటి బీజేపీ ప్రభుత్వం వాటిని చెల్లించింది.

కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశ పెట్టిన 2021-22  బడ్జెట్ ప్రకారం 2020-21 చివరికల్లా ఆయిల్ బాండ్స్ రూపంలో చెల్లించాల్సిన మొత్తం విలువ రూ.1,30,923 కోట్లుగా ఉండడం బట్టి 2015లో మెచ్యూర్ అయిన రూ. 3500 కోట్ల విలువగల రెండు బాండ్స్ ని మోదీ ప్రభుత్వం చెల్లించిందన్న విషయం మళ్ళీ స్పష్టమవుతుంది. దీన్నిబట్టి గత ప్రభుత్వాలు ఇష్యూ చేసిన ఆయిల్ బాండ్లలో మోదీ మొదటి సారి మోదీ ప్రధానమంత్రి అయ్యే సమయానికి చెల్లించాల్సింది  రూ. 1,34,423 కోట్లు మాత్రమే, పోస్టులో చెప్తునట్టు 2 లక్షల 14 వేల కోట్లు కాదు.  ఐతే, 2021లో రూ. 10,000 కోట్ల విలువగల రెండు బాండ్స్ మెచ్యూర్ అవుతుండడం గమనించాల్సిన విషయం. 2021 లో చెల్లించే 10 వేల కోట్ల తరువాత కూడా ఇంకా లక్ష ఇరవై వేల కోట్ల కంటే ఎక్కువ ఆయిల్ బాండ్స్ అప్పు ప్రభుత్వం ఇంకా బాకీ ఉంటుంది.

ఐతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి జారీచేసిన బాండ్స్ కి ప్రతీ సంవత్సరం ప్రభుత్వాలు వడ్డీ చెల్లిస్తూ వస్తున్నాయి. 2009-14 కాలంలో UPA ప్రభుత్వం పెట్రోల్ ధరల సబ్సిడీ కింద అంతకు ముందు జారీ చేసిన బాండ్లపై వడ్డీ రూపంలో రూ. 53,136 కోట్లు చెల్లించింది. 2014-19 కాలంలో NDA ప్రభుత్వం వడ్డీ రూపంలో మొత్తం రూ. 50,216 కోట్లు చెల్లించింది. 2020-21 బడ్జెట్ లెక్కలు చెప్తున్న దాని ప్రకారం 2019-20 సంవత్సరానికి సంబంధించి సవరించిన బడ్జెట్ అంచనాలలో ఆ సంవత్సరం ఆయిల్ బాండ్స్ కి సంబంధించి చెల్లించిన వడ్డీ మొత్తం రూ. 9,989.96 కోట్లు కాగా, 2020-21లో కూడా ఇదే మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్ అంచనా వేసింది. వీటన్నిటి ఆదారంగా లెక్కేస్తే 2014 నుండి 2020 మధ్య కాలంలో ఆయిల్ బాండ్స్ వడ్డీకి సంబంధించి మోదీ ప్రభుత్వం చెల్లించింది రూ. 70,196 కోట్లు. దీనికి అదనంగా మోదీ ప్రభుత్వం మెచ్యూర్ అయిన ఆయిల్ బాండ్స్ కి చెల్లించింది రూ. 3500 కోట్లు. అంటే గత ప్రభుత్వాలు ఇష్యూ చేసిన ఆయిల్ బాండ్స్ కి మోదీ ప్రభుత్వం మొత్తం కలిపి చెల్లించింది రూ. 73,696 కోట్లు మాత్రమే.

పైన వివరించిన దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ బాండ్స్ రూపంలో చేసిన 2 లక్షల14 వేల కోట్ల రూపాయల అప్పు మరియు సబ్సిడీల రూపంలో ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన రూ. 4,34,000 కోట్లు మోదీ ప్రభుత్వం తీర్చిందనడం పూర్తిగా అవాస్తవం.

చివరగా, పెట్రోల్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సుమారు 8 లక్షల కోట్ల అప్పు మోదీ ప్రభుత్వం తీర్చిందనడంలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll