Fake News, Telugu
 

హిందూ అమ్మాయితో కలిసి ప్రయాణిస్తున్న ముస్లిం వ్యక్తిని రైలులో నుండి దింపేసి పోలీసులకు అప్పగించిన ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణం లేదు

0

ఉత్తరప్రదేశ్‌లో అప్పటికే ఒక కొడుకు ఉన్న 30 ఏళ్ల ముస్లిం వివాహితుడు, హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి ఆజ్మీర్ దర్గాకు తీసుకువెళ్లి అక్కడ బురఖా నిఖా చేసుకునే ప్రయత్నంలో ఉండగా బజరంగ్ దళ్ కార్యకర్తలు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించి, హిందూ అమ్మాయిని రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారంటూ అని చెప్తూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ఒక జంటని ట్రైన్ నుండి దింపేసి రైల్వే పోలీసులకు అప్పగిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఈ కథనం ద్వారా వైరల్ పోస్టులో చెప్తున్న విషయానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం వివాహితుడు, హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి ఆజ్మీర్ తీసుకెల్తుండగా, బజరంగ్ దళ్ కార్యకర్తలు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వైరల్ వీడియోలో చూపిస్తున్నట్టు బజరంగ్ దళ్ కార్యకర్తలు ఒక ముస్లిం వ్యక్తిని లవ్ జిహాద్ ఆరోపణలతో రైలులో నుండి దించేసి పోలీసులకు అప్పజెప్పిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైన్‌లో జరిగింది. ఐతే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఆ ఇద్దరు వ్యక్తులు ఇండోర్‌కు చెందిన వారు. రెండు కుటుంబాలు మధ్య స్నేహం ఉంది. పైగా ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణమేది లేదు. అమ్మాయి తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసుల వద్ద దృవీకరించారు. పైగా వారిద్దరిని మా అనుమతితోనే కలిసి ప్రయాణిస్తున్నారని అమ్మాయి తల్లి పేర్కొంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో షేర్ చేసిన వైరల్ వీడియోలో చెప్తున్న ఘటన జరిగింది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైన్‌లో, ఉత్తరప్రదేశ్‌లో కాదు. ఇండోర్‌కు చెందిన ఒక ముస్లిం అబ్బాయి మరియు హిందూ అమ్మాయి కలిసి ఆజ్మీర్‌కు వెళ్ళే రైలులో ప్రయాణిస్తుండగా, వారిని బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉజ్జైన్‌ రైల్వే స్టేషన్‌లో దింపేసి, ఆ ముస్లిం వ్యక్తిని లవ్ జిహాద్ నేరానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ రైల్వే పోలీసులకు అప్పగించారు.

ఐతే ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథనాల ప్రకారం, పోలీసుల విచారణలో ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణమేది లేదని, వారిద్దరూ కేవలం కలిసి ప్రయాణిస్తున్నారని తేలింది. అలాగే వీరిద్దరూ ఇండోర్‌కు చెందిన వారని, రెండు కుటుంబాలు మధ్య స్నేహం ఉందని తేలింది. వారిద్దరికీ చాలా రోజుల నుండి పరిచయం ఉన్నట్టుగా తేలింది. GRP సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నివేదిత గుప్తా మాట్లాడుతూ ఇదే విషయం స్పష్టం చేసింది. పైగా వారిద్దరు తమ అనుమతితోనే కలిసి ప్రయాణిస్తున్నారని అమ్మాయి తల్లి పేర్కొంది. పైగా ఈ ఘటనకు సంబంధించి ఎవరిపైనా కేసు నమోదు కాలేదని పోలీసులు స్పష్టం చేసారు.

ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మరొక వార్తా కథనం కూడా పైన తెలిపిన వివరణనే పునరుద్ఘాటిస్తుంది. పలు హిందీ లోకల్ న్యూస్ రిపోర్టులు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తున్నాయి, వీటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి ఆధారంగా పోస్టులో ఆరోపిస్తున్నట్టు ఈ ఘటనలో లవ్ జీహాద్ కోణమేది లేదన్న విషయం స్పష్టమవుతుంది.

చివరగా, హిందూ అమ్మాయితో కలిసి ప్రయాణిస్తున్న ముస్లిం వ్యక్తిని రైలులో నుండి దింపేసి పోలీసులకు అప్పగించిన ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణమేది లేదు.

Share.

About Author

Comments are closed.

scroll