Fake News, Telugu
 

2013లో ప్రచురించిన ఈ వార్తా కథనం కరోనా వైరస్ రకాలలో ఒకటైన MERS-CoV వ్యాప్తి గురించి, కోవిడ్-19 గురుంచి కాదు

0

కరోనా వైరస్ వ్యాప్తి గురించి తెలుపుతూ 2013లో ఈనాడు వార్తా పత్రికలో ప్రచురించిన కథనం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. “సార్స్ తరహా లక్షణాలతో వేధిస్తున్న కొత్త రకం వైరస్. నోవెల్ కరోనా వైరస్ (ఎన్‌సివోవి)కు తాజాగా బ్రిటన్ దేశంలో ఒకరు బలయ్యారు. గతేడాది మధ్య తూర్పు ప్రాంతంలో బయటపడిన ఈ కొత్త రకం వైరస్ బారినపడిన పన్నెండు మందిలో మరణించిన వారి సంఖ్య అరుకు చేరింది. ఈ వైరస్‌తో  ఇప్పటికైతే సాధారణ ప్రజానికానికి, మనుషల నుంచి మనుషులకి సోకే ముప్పు తక్కువగానే ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తుందనేది శాస్త్రవేత్తలు నిక్కచ్చిగా తేల్చలేక పోతున్నారు”, అని ఈ వార్తా కథనంలో రిపోర్ట్ చేసారు. 2013లోనే ఉన్న కరోనా హఠాత్తుగా ఇంత విజృంభించటానికి కారణం ఏమై ఉండవచ్చని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఈ పోస్టుని షేర్ చేసారు. ఆ పోస్టులో తెలుపుతున్న సమాచారంలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కరోనా వైరస్ వ్యాప్తిని వివరిస్తూ 2013లో ఈనాడు వార్తా సంస్థ ప్రచురించిన కథనం యొక్క ఫోటో.

ఫాక్ట్ (నిజం): కరోనా వైరస్ అనేది సాధారణ జలుబు నుండి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) వ్యాధులకు కారణమయ్యే వైరసుల యొక్క పెద్ద కుటుంబం. 2019లో చైనాలో  వెలుగులోకి వచ్చిన SAR-CoV-2 వైరస్ దశాబ్దాల క్రితమే గుర్తించిన నోవెల్ కరోనా వైరస్ కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన ఒక కొత్త రకమైన వైరస్ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2020 ఫిబ్రవరి నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త రకం వైరస్‌కు అధికారికంగా కోవిడ్-19 అనే పేరు పెట్టింది. 2013లో ఈనాడు వార్తా పత్రికలో ప్రచురించిన కథనం, 2012లో మధ్య తూర్పు దేశాలలో గుర్తించిన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ (MERS-CoV) వ్యాప్తి గురించి రిపోర్ట్ చేసింది. MERS కూడా కరోనా వైరస్ కుటుంబానికి చెందిన మరొక రకమైన వైరస్. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వార్త కథనం కేవలం కరోనా వైరస్ గురించి ప్రస్తావించింది. ఈ కథనంలోని ఒక వాక్యంలో, “ప్రస్తుతం కలవరానికి గురి చేస్తున్న నోవెల్ కరోనా వైరస్ (ఎన్‌సివోవి) సాధారణంగా జలుబు, సార్స్, తీవ్ర స్థాయి శ్వాసకోశ రుగ్మతులకు కారణమయ్యే వైరస్ కుటుంబానికి చెందినదే”, అని తెలిపారు. కరోనా వైరస్ అనేది దశాబ్దాల క్రితం గుర్తించబడిన ఒక వైరస్ కుటుంబం. సహజ జలుబు నుండి తీవ్ర ఉపిరిత్తిత్తుల సమస్యలు, సార్స్ వ్యాధులకు కారణమయ్యే  వైరసుని కరోనావైరస్‌గా నిర్ధారిస్తారు. 2019లో చైనాలో వెలుగులోకి వచ్చిన SAR-CoV-2 వైరస్ కూడా నోవెల్ కరోనా వైరస్ కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన మరొక రకమైన వైరస్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారు తమ వెబ్సైటులో స్పష్టంగా తెలిపారు. 2020 ఫిబ్రవరి నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త రకం వైరస్‌కు అధికారికంగా కోవిడ్-19 అనే పేరు పెట్టింది.

ఈ వార్తా కథనంలో తెలిపిన సమాచారం కోసం గుగూల్‌లో కీ పదాలు ఉపయోగించి వెతికితే, ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘బీబీసీ’ 2013 ఫిబ్రవరి నెలలో పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. సార్స్ వంటి కొత్త రకమైన ఉపిరిత్తిత్తుల జబ్బుతో యూకే దేశంలో ఒక వ్యక్తి చనిపోయినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ఈ వైరస్ సోకిన 12 మందిలో ఆరుగురు చనిపోయిన్నట్టు బీబీసీ ఆర్టికల్‌లో కూడా తెలిపారు. అయితే, ఈనాడు వార్తా కథనం మరియు ఈ ‘బీబీసీ’ ఆర్టికల్‌ రిపోర్ట్ చేస్తున్నది 2012లో మధ్య తూర్పు దేశాలలో గుర్తించిన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్(MERS-CoV) గురించని తెలిసింది.

మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ (MERS-CoV) గురించి స్పష్టమైన సమాచారాన్ని WHO సంస్థ తమ వెబ్సైటులో తెలిపింది. MERS-CoV అనేది నోవెల్ కరోనా వైరస్ కుటుంబానికి చెందిన ఒక రకమైన వైరస్ అని, ఈ కొత్త కరోనా వైరస్ రకాన్ని మొట్టమొదట 2012లో సౌదీఅరేబియా దేశంలో గుర్తించినట్టు తెలిపారు. కరోనా వైరస్ అనేది సాధారణ జలుబు నుండి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) వ్యాధులకు కారణమయ్యే వైరస్ల యొక్క పెద్ద కుటుంబమని WHO స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వార్తా కథనం, 2012లో మధ్య తూర్పు దేశాలలో వ్యాప్తి చెందిన MERS-Cov వైరస్ గురించి రిపోర్ట్ చేస్తుందని, 2019లో వెలుగులోకి వచ్చిన కోవిడ్-19 వైరస్ గురించి తెలపట్లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, 2020కు ముందు కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తూ పబ్లిష్ చేసిన పుస్తకాలు, వీడియో క్లిప్పులని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫ్యాక్ట్‌లీ దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2013లో ప్రచురించిన ఈ వార్తా కథనం కరోనా వైరస్ రకాలలో ఒకటైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS-CoV) వ్యాప్తి గురించి, కోవిడ్-19 వైరస్ గురంచి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll