Fake News, Telugu
 

ఈ వీడియోలో తెలిపిన ‘మేక్ మై ట్రిప్’ 3X టికెట్ రిఫండ్ ఆఫర్ సమాచారం తప్పుదోవ పట్టించే విధంగా ఉంది

0

మేక్ మై ట్రిప్ (MMT) వెబ్సైట్ లేదా ఆప్ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకుంటే కొన్ని రైళ్ళకు ‘ట్రిప్ గ్యారంటీ’ అని ఆప్షన్ వస్తుంది అని, అలా బుక్ చేసుకున్న టికెట్ RAC లేదా వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే కచ్చితంగా కంఫర్మ్ అవుతుంది అని, ఒకవేళ కంఫర్మ్ అవ్వకపోతే మనం టికెట్ కోసం చెల్లించిన డబ్బుకు మూడింతలు ఎక్కువ డబ్బు (3X) తిరిగి వస్తుంది అంటూ ఒక పోస్ట్ సోషల్ మోడియాలో షేర్ చెయ్యబడుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మేక్ మై ట్రిప్ ద్వారా ‘ట్రిప్ గ్యారంటీ’ అన్న ఆప్షన్ ఉన్న రైలు బుక్ చేసుకొని అది కంఫర్మ్ అవనప్పుడు, చెల్లించిన దానికంటే మూడింతలు ఎక్కువ డబ్బు తిరిగి వస్తుంది.

ఫాక్ట్: మేక్ మై ట్రిప్ 3X టికెట్ రిఫండ్ ఆఫర్ వెయిట్ లిస్టెడ్ టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది మరియు దీనిని పొందాలంటే ‘ట్రిప్ గ్యారంటీ ప్రీమియం’ పేరుతో కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 3X రీఫండ్ డబ్బులో ఒక వంతు ఒరిజినల్ పేమెంట్ మోడ్ ద్వారా తిరిగి చెల్లించగా, మిగితా రెండు వంతులు (2X) ‘ట్రావెల్ వౌచెర్’ పేరుతో రీఫండ్ చెయ్యబడుతుంది. ఈ 2X అమౌంట్, ట్రావెల్ వౌచర్లకు సంబంధించి పలు నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. కావున, ఈ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

మొదట, ఈ పోస్ట్ కింద ఉన్న కామెంట్స్ చూడగా,  ఈ ఆఫర్ కు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి అని అర్థమయింది.

దాని గురించి తెలుసుకునేందుకు, మేక్ మై ట్రిప్ వెబ్సైటులో వెతకగా, ఈ ఆఫర్ కొన్ని రైళ్లకే వర్తిస్తుంది అని, దాని కోసం ‘ట్రిప్ గ్యారంటీ ప్రీమియం’ పేరుతో కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అని తెలిసింది.

తరువాత, MMT వెబ్సైట్/ఆప్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ ఆఫర్ వర్తించాలి అంటే కొన్ని నిబంధలను వర్తిస్తాయి అని వెబ్సైటులో పేర్కొన్నారు. అంతే కాదు, ఈ ఆఫర్ కేవలం వెయిట్ లిస్ట్ చేసిన కేటగిరీలో ఉన్న టిక్కెట్లకి మాత్రమే వర్తిస్తుంది. చార్ట్ తయారుచేసే సమయానికి వెయిట్ లిస్టులో ఉన్న టికెట్ కంఫర్మ్ కానప్పుడు టికెట్ ఫెయిర్ కంటే మూడు రెట్లు ఎక్కువ డబ్బు చెల్లించబడుతుంది అని వెబ్సైట్ లో తెలిపారు.

రిఫండ్ డబ్బు చెల్లించే విధానం గురించి వివరాలు వెతకగా, టికెట్ ఫెయిర్ మాత్రమే ఒరిజినల్ పేమెంట్ మోడ్ లో చెల్లించబడుతుంది అని తెలిసింది. మిగితా రెండింతల డబ్బుని ట్రావెల్ వౌచెర్ రూపంలో, MMT ప్లాట్ ఫామ్ లో లభించే ఏ రవాణా విధానంలో అయినా వాడుకునేలా చెల్లిస్తారు. పైగా ఈ రీఫండ్  IRCTC కన్వీనియన్స్ ఫీజు, MMT సర్వీస్ ఫీజు, పేమెంట్ గేట్వే ఛార్జీలు మరియు ట్రిప్ గ్యారంటీ ప్రీమియంలను మినహాయించి ఇవ్వబడుతుంది.

ఈ ఆఫర్ గురించి ప్రస్తావించిన నిబంధనలలో ముఖ్యంగా తెలుసుకోవలసినవి:

  • IRCTC ద్వారా చార్ట్ ప్రిపేర్ అయ్యే సమయానికి టికెట్ కంఫర్మ్ అవకపోతే మాత్రమే 3X రిఫండ్ అమౌంట్ వస్తుంది
  • చార్ట్ తయారయ్యే సమయానికి RACని పొందినా ఈ ఆఫర్ వర్తించదు
  • ఒకేసారి 6000 రూపాయిలకు మించి రీఫండ్ పొందరాదు
  • ట్రిప్ గ్యారంటీ ప్రీమియం, బుక్ చేసిన అన్ని టిక్కెట్లకు కట్టి, వాటిలో కొన్ని టిక్కెట్లు కంఫర్మ్ చెయ్యబడినా (RACని పొందినా కూడా) 3X రిఫండ్ వర్తించదు.
  • వచ్చిన ట్రావెల్ వౌచర్, దాన్ని జారీ చేసిన 7 రోజుల్లోగా వాడుకోవలసి ఉంటుంది.
  • ట్రావెల్ వౌచెర్ ఇతర రవాణా విధానం కొరకు ఒకే సారి మరియు కేవలం వన్ వే ట్రిప్ బుకింగ్స్ కొరకు వాడవచ్చు.
  • బుక్ చేసుకున్న రవాణా విధానం కాకుండా ఇతర రవాణా సదుపాయాలకు ఈ వౌచెర్ వాడితే, ఆ రవాణా విధానాన్ని బట్టి 65-200 kms లోపు ఉన్న స్టేషన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

చివరగా, పోస్టులో షేర్ చేసిన వీడియోలో తెలిపిన మేక్ మై ట్రిప్ 3X టికెట్ రిఫండ్ ఆఫర్ సమాచారం తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll