Fake News, Telugu
 

మహారాణా ప్రతాప్ యుద్ధ సమయంలో 200 కిలోల బరువున్న ఆయుధాలు, కవచం ధరించి వెళ్ళేవారని తెలుపుతున్న ఈ పోస్ట్ ఫేక్

0

మహారాణా ప్రతాప్ 7 అడుగుల 4 అంగుళాల పొడువైన యోధుడని, యుద్ధానికి వెళితే 200 కిలోల బరువున్న యుద్ద సామాగ్రిని తనతో పాటు మోసుకెళ్ళేవారని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. యుద్ద సమయంలో తనతో పాటు 80 కిలోల ఈటె, 72 కిలోల కవచం, 5 కిలోల బరువు కలిగిన బూట్లను మరియు 25 కిలోల బరువు కలిగిన రెండు కత్తులను తనతో పాటు తీసుకెళ్ళేవారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: మహారాణా ప్రతాప్ 7 అడుగుల 4 అంగుళాల పొడువు ఉండేవారు. మహారాణా ప్రతాప్ యుద్ధానికి వెళితే 200 కిలోల బరువున్న యుద్ద సామాగ్రిని తనతో పాటు మోసుకెళ్ళేవారు.

ఫాక్ట్ (నిజం): మహారాణా ప్రతాప్ యుద్ధ సమయంలో ఉపయోగించిన ఆయుధాలు మరియు కవచం యొక్క మొత్తం బరువు 34.618 కిలోలు ఉంటుందని ఉదయపూర్‌లోని సిటీ మ్యూజియం యాజమాన్యం స్పష్టం చేసింది. మహారాణా ప్రతాప్ సుమారు 5 అడుగుల 8 అంగుళాల నుండి 5 అడుగుల 10 అంగుళాల పొడవు ఉంటారని మ్యూజియం యాజమాన్యం తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఉదయపూర్‌లోని సిటీ మ్యూజియంలో పొందుపరిచిన మహారాణా ప్రతాప్ ఆయుధాలు మరియు కవచానికి సంబంధించి ‘ఉదయ్‌పుర్ బీట్స్’ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఉదయపూర్‌ సిటీ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టిన మహారాణా ప్రతాప్ యుద్ధ సామగ్రి పక్కనే అమర్చిన ఒక బోర్డుపై మహారాణా ప్రతాప్ ఉపయోగించిన ఆయుధాలు మరియు కవచం సుమారుగా 35 కిలోలు బరువు కలిగి ఉంటాయని స్పష్టంగా తెలిపారు. ‘ఉదయ్‌పుర్ బీట్స్’ వారు పబ్లిష్ చేసిన వీడియోలో కూడా ఉదయపూర్‌ సిటీ మ్యూజియంలోని పెట్టిన ఈ బోర్డుని మనం చూడవచ్చు.

అంతేకాదు, మహారాణా ప్రతాప్ ఉపయోగించిన ఆయుధాలు మరియు కవచం యొక్క మొత్తం బరువు 34.618 కిలోలు ఉంటుందని ఉదయపూర్‌ సిటీ మ్యూజియం వారు ఒక ఫేస్‌బుక్ పోస్ట్ కామెంట్లో స్పష్టంగా పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో మహారాణా ప్రతాప్‌కు సంబంధించి వైరల్ అవుతున్న ఈ వార్తాలకు సంబంధించి ఉదయపూర్‌ మ్యూజియం అధికారి ‘Lallantop’ మీడియా సంస్థకు స్పష్టతనిచ్చారు. ఉదయపూర్‌ మ్యూజియం అధికారి భూపేంద్ర సింగ్ ‘Lallantop’తో మాట్లాడుతూ, “మహారాణా ప్రతాప్ సుమారు 5 అడుగుల 7 అంగుళాలు ఉంటారు. మహారాణా ప్రతాప్ ఉపయోగించిన ఈటె, కవచం, కత్తులు సోషల్ మీడియాలో తెలుపుతున్నంత బరువు ఉండవు. మేము ఈ మ్యూజియంను 2003లో స్థాపించాము. మహారాణా ప్రతాప్‌కు సంబంధించిన వస్తువులన్నీటిని తూకం వేసిన తరువాతే వాటిని  మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టాము. మహారాణా ప్రతాప్‌కు సంబంధించిన ఈ వస్తువుల బరువు 35 కిలోలు ఉంటాయని ఒక బోర్డుపై రాసి వీక్షకుల ప్రదర్శన కోసం కూడా పెట్టాము. మహారాణా ప్రతాప్‌ ఎత్తు, బరువు మరియు అతని ఆయుధాల బరువుకు సంబంధించి సోషల్ మీడియాలో గత కొన్నేళ్ళుగా తప్పుడు వార్తలు షేర్ చేస్తున్నారు”, అని తెలిపారు. మహారాణా ప్రతాప్ సుమారు 5 అడుగుల 8 అంగుళాల నుండి 5 అడుగుల 10 అంగుళాల పొడవు భూపేంద్ర సింగ్ ‘Vishwas News’ సంస్థకు తెలిపారు.

చివరగా, మహారాణా ప్రతాప్ 7 అడుగుల 4 అంగుళాల పొడవుంటారని, యుద్ధ సమయంలో 200 కిలోలు బరువున్న ఆయుధాలు మరియు కవచం ధరించి వెళ్ళేవారని తెలుపుతున్న ఈ పోస్ట్ ఫేక్.

అప్డేట్ (12 May 2023):
FACTLY రాసిన ఈమెయిల్ కి ఉదయపూర్‌ మ్యూజియం అధికారి భూపేంద్ర సింగ్ బదులిస్తూ, “మహారాణా ప్రతాప్ 5 అడుగుల 10 అంగుళాల కన్నా ఎక్కువ పొడవు ఉండరు, మరియు తను ఉపయోగించిన ఆయుధాలు మరియు కవచం యొక్క మొత్తం బరువు గరిష్టంగా 35 కిలోలు ఉంటుంది”, అని తెలిపారు.

Share.

About Author

Comments are closed.

scroll