Fake News, Telugu
 

ఇండోనేషియాలో 50 వేల మంది ముస్లింలు ఇస్లాం వదులుకొని హిందూ మతాన్ని స్వీకరించారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

ఇండోనేషియాలో 50 వేల మంది ముస్లింలు ఇస్లాం వదులుకొని హిందూ మతాన్ని స్వీకరించారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. ఇండోనేషియా మాజీ అధ్యక్షుడి కూతురు ఇస్లాం వదిలి 30 వేల మంది ముస్లింలతో సహా సనాతన ధర్మాన్ని స్వీకరించారని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇండోనేషియాలో 50 వేల మంది ముస్లింలు ఇస్లాంని వదులుకొని హిందూ మతంలోకి మారారు.

ఫాక్ట్ (నిజం): ఇండోనేషియా దేశంలో ఇటీవల అంత పెద్ద సాముహిక మత మార్పిడి జరిగినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్నో కూతురు సుక్మావతి సుకర్నోపుత్రి ఇటీవల ఇస్లాంని వదులుకొని హిందూ మతంలోకి చేరిన మాట వాస్తవం. కాని, ఆమెతో సహా 30 వేల మంది  ఇండోనేషియా ముస్లింలు హిందూత్వంలోకి మారలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఇండోనేషియా దేశంలో ఇటీవల అంత పెద్ద సాముహిక మత మార్పిడి జరిగినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది. ఇండోనేషియా మొట్టమొదటి అధ్యక్షుడు, ఇండోనేషియా స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన సుకర్నో కూతురు సుక్మావతి సుకర్నోపుత్రి ఇస్లాంని వదులుకొని హిందూ మతంలోకి మారినట్టు తెలిసింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

69 సంవత్సరాల వయసులో సుక్మావతి సుకర్నోపుత్రి, 26 అక్టోబర్ 2021 నాడు ‘సుధీ వదాని’ అనే హిందూ ఆచారాలు నిర్వహించి హిందూమతాన్ని స్వికరించినట్టు తెలిసింది. సుక్మావతి హిందూ మతాన్ని స్వికరించడంలో ఆమె అమ్మమ్మ ముఖ్య పాత్ర పోషించినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. కాని, సుక్మావతిని ఆదర్శంగా తీసుకొని 30 వేల మంది ఆమె మద్దతుదారులు (ఇండోనేషియా ముస్లింలు) హిందూ మతంలోకి మారినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు.

30 వేల మంది ఆమె ఇండోనేషియా ముస్లింలు హిందూత్వంలోకి చేరినట్టుగా షేర్ చేస్తున్న ఈ క్లెయింకు సంబంధించి ‘The Quint’ ఫాక్ట్-చెకింగ్ సంస్థ, ‘Tempo’ అనే ఇండోనేషియా ఫాక్ట్-చెకింగ్ సంస్థని సంప్రదించింది. ‘Tempo’ సంస్థ ఈ క్లెయింకు సంబంధించి ‘The Quint’ వారికి స్పష్టతనిస్తూ, “మాజీ అధ్యక్షుడు సుకర్నో కూతురు సుక్మావతి ఇండోనేసియాకు రాణి కాదు. హిందూ మతంలోకి చేరాలన్నది ఆమె వ్యక్తిగత నిర్ణయం. సుక్మావతి తనతో సహా 30 వేల మంది ముస్లింలను హిందూ మతంలోకి మార్చలేదు”, అని తెలిపారు.

చివరిగా, ఇండోనేషియాలో 50 వేల మంది ముస్లింలు ఇస్లాం వదులుకొని హిందూ మతాన్ని స్వీకరించినట్టుగా షేర్ చేస్తున్న సమాచారం తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll