Fake News, Telugu
 

కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఈ వీడియోలో ప్రజలు ధ్వంసం చేస్తున్నది రిజర్వ్‌ EVMలు, పోలింగ్‌కు ఉపయోగించినవి కావు

0

కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుండగా EVMలను తరలిస్తున్న బీజేపీ నేతలను పట్టుకొని చితకబాది, EVMలను ధ్వంసం చేసిన స్థానికులు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుండగా EVMలను తరలిస్తున్న బీజేపీ నేతలను స్థానికులు పట్టుకొని చితకబాది, EVMలను ధ్వంసం చేసిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ ఘటన ఇటీవల కర్ణాటక ఎన్నికల సమయంలో విజయపుర జిల్లాలోని మసాబినల్ అనే గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు ఎన్నికలకు సంబంధించి రిజర్వు EVMలను వాహనాలలో తరలిస్తుండగా, గ్రామస్తులు వారిని అడ్డుకొని EVMలను మరియు VVPATలను ధ్వంసం చేసారు. EVMలను టాంపరింగ్ చేస్తున్నారని వార్తలు రావడంతో ప్రజలు ఇలా చేసారని పోలీసులు తెలిపినట్టు ఈ కథనంలో రిపోర్ట్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 10న సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రాధమిక లెక్కల ప్రకారం 72.67% పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల EVMల ధ్వంసం, హింసాత్మక ఘటనలు రిపోర్ట్ అయ్యాయి.

ఐతే వైరల్ వీడియోకు సంబంధించి క్లెయిమ్ చేస్తున్నట్టు ఆ EVMలను బీజేపీ నేతల తరలించడం లేదు. పైగా ఆ EVMలను ఎన్నికలకు ఉపయోగించలేదు, అవి రిజర్వ్ చేసిన EVMలు.

ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఈ వీడియోను ఇటీవల రిపోర్ట్ చేసిన కొన్ని వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం EVMలను ధ్వంసం చేసిన ఈ ఘటన ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయపుర జిల్లాలోని మసాబినల్ అనే గ్రామంలో చోటు చేసుకుంది.

అధికారులు ఎన్నికలకు సంబంధించి రిజర్వు EVMలను వాహనాలలో తరలిస్తుండగా గ్రామస్తులు వారిని అడ్డుకొని EVMలను మరియు VVPATలను ధ్వంసం చేసారు. EVMలను టాంపరింగ్ చేస్తున్నారని వార్తలు రావడంతో ప్రజలు ఇలా చేసారని పోలీసులు తెలిపినట్టు ఈ కథనంలో రిపోర్ట్ చేసింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి 23 మంది ని అదుపులోకి తీసుకున్నట్టు కూడా రిపోర్ట్ చేసింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం జరిగిన ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో కూడా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందించింది. బసవన బాగేవాడి నియోజకవర్గంలోని స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి మసాబినాల్‌ వరకు రిజర్వ్‌ EVMలు, VVPATలను తీసుకెళ్తున్న సమయంలో దాడి చేసి వీటిని ధ్వంసం చేసినట్టు పేర్కొంది.

ఐతే ఎన్నికల సంఘం ప్రెస్ నోట్‌లో EVMలు పోలింగ్‌కు ఉపయోగించినవని గానీ, అలాగే దీంతో బీజేపీ నేతలకు సంబంధం ఉన్నట్టు గానీ పేర్కొనలేదు. దీన్నిబట్టి పోస్టులో చేస్తున్న వాదన తప్పని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఈ వీడియోలో ప్రజలు ధ్వంసం చేస్తున్నది రిజర్వ్‌ చేసిన EVMలు, పోలింగ్‌కు ఉపయోగించినవి కావు.

Share.

About Author

Comments are closed.

scroll