Fake News, Telugu
 

భారత్, ఇండియా మధ్య తేడాను వివరిస్తూ 1999లో లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసినవి కావు

0

రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ భారత్, ఇండియా మధ్య తేడాను వివరిస్తూ చేసిన పాత వ్యాఖ్యలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్ వేప పూల్లతో పళ్లు తోముకుంటుండగా, “ఢిల్లీలో మీకు వేపపుల్లలు దొరుకుతాయా?” అని రిపోర్టర్ ప్రశ్న అడిగితే, “ఢిల్లీ అనేది ఇండియా కిందకి వస్తుంది. అక్కడ ఇలాంటివి దొరకవు. నేను ఉండేది భారత్‌లో. ఇక్కడ దొరుకుతుంది”, అని లాలూ సమాధానం ఇచ్చిన దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేసారంటూ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఇండియా పేరును భారత్‌కు మార్చనున్నారనే అంశంపై దేశంలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో భారత్, ఇండియా మధ్య తేడాను వివరిస్తూ RJD నాయకుడు లాలూ ప్రసాద్ చేసిన పాత వ్యాఖ్యలు.  

ఫాక్ట్ (నిజం): 1999 లోక్‌సభ ఎన్నికలకు ముందు NDTV వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాలూ ప్రసాద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1999 లోక్‌సభ ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని RJD పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కలిసి పోటీచేసింది. ఈ ఇంటర్వ్యూ పూర్తి వీడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ సోనియా గాంధీకి మద్దతు పలుకుతూ, బీజేపీని 1999 లోక్‌సభ ఎన్నికలలో ఓడించడమే తన లక్ష్యమని పలు సార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూ జరిగిన సమయంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం వెతికితే, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోని NDTV వార్తా సంస్థ 2014 జనవరి నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 1999లో లాలూ ప్రసాద్ యాదవ్‌ NDTV వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో అని NDTV వార్తా సంస్థ వివరణలో తెలిపింది.

1999 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ చేస్తున్న ప్రచార కార్యక్రమాల గురించి, అతని ఇల్లు, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని ఈ ఇంటర్వ్యూలో చూపించారు. ఈ ఇంటర్వ్యూలో వేపపుల్లలోని విశిష్ట లక్షణాలను వివరిస్తూ, తాను రోజు వేపపుల్లలతోనే పళ్లు తోముకుంటానని లాలూ యాదవ్ తెలిపారు. వేపపుల్లలకు సంబంధించి భారత్, ఇండియా మధ్య తేడాను వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను దృష్టిలో ఉంచుకొని లాలూ ప్రసాద్ యాదవ్ చేయలేదు. ఈ ఇంటర్వ్యూ పూర్తి వీడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ సోనియా గాంధీకి మద్దతు పలుకుతూ, బీజేపీని 1999 లోక్‌సభ ఎన్నికలలో ఓడించడమే తన లక్ష్యమని పలు సార్లు వ్యాఖ్యలు చేశారు.

19 మార్చి 1998 నుండి 29 ఏప్రిల్ 1999 వరకు, ఆ తరువాత 03 అక్టోబర్ 1999 నుండి 10 మే 2004 వరకు దేశంలో అటల్ బిహారీ వాజ్‌పయ్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 1999లో ఈ ఇంటర్వ్యూ జరిగిన సమయంలో కాంగ్రెస్ దేశంలో అధికారంలో లేదు. 1999 లోక్‌సభ ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని RJD పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కలిసి పోటీచేసింది. 1999 లోక్‌సభ ఎన్నికలలో బీహార్‌లోని 54 ఎంపీ స్థానాల కోసం పోటీ చేస్తే, కాంగ్రెస్-RJD కూటమి కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచిందని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

చివరిగా, భారత్, ఇండియా మధ్య తేడాను వివరిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసినవి కావు.  

Share.

About Author

Comments are closed.

scroll