Fake News, Telugu
 

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల అనంతరం సన్ టీవీ షేర్లు భారీగా పడిపోయాయన్న వార్తలో నిజం లేదు

0

ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన నేపథ్యంలో  ఆయనపై సోషల్ మీడియాలో పోస్టులో షేర్ అవుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యల ఫలితంగా అతని కుటుంబానికి చెందిన సన్ టీవీ నెట్వర్క్ షేర్లు ఒక్కరోజే 11% పడిపోయాయి అంటూ పలు పోస్టులో సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల ఫలితంగా అతని కుటుంబానికి చెందిన సన్ టీవీ నెట్వర్క్ షేర్లు ఒక్కరోజే 11% పడిపోయాయి.

ఫాక్ట్(నిజం):  సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల అనంతరం సన్ టీవీ షేర్ల ధరలో భారీగా మార్పులేమీ లేవు. ఆ రోజు తర్వాత నుండి  బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ & నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సన్ టీవీ షేర్ల విలువలో స్వల్ప (1-2%) మార్పులే కనిపిస్తున్నాయి. ఐతే సెప్టెంబర్ 4న సుమారు పదకొండు రూపాయలు తగ్గిన షేర్ విలువను, 11% తగ్గినట్టు తప్పుగా అర్ధం చేసుకొని ఉండొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతని వ్యాఖ్యల ఫలితంగా అతని కుటుంబానికి చెందిన సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ షేర్లు ఒక్కరోజే (04 సెప్టెంబర్) 11% పడిపోయాయి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవుతున్నాయి.

తమ వాదనకు మద్దతుగా ఆ రోజు సన్ టీవీ నెట్వర్క్ షేర్లకు సంబంధించిన గ్రాఫ్ షేర్ చేసారు. ఐతే ఆ గ్రాఫ్‌ను పరిశీలిస్తే ఆ టైంకు సన్ టీవీ షేర్ రూ. 10.75 తగ్గింది, అంటే 1.73% తగ్గింది. ఐతే తగ్గిన పదకొండు రూపాయల షేర్ విలువను 11% తగ్గినట్టు తప్పుగా అర్ధం చేసుకొని ఉండవచ్చు.

కాగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్‌లో సన్ టీవీ షేర్ల గమనాన్ని పరిశీలిస్తే కూడా 4వ తారీఖున గాని లేదా గత వారం రోజులుగా గాని 11% తగ్గలేదు.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కూడా సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ షేర్ల విలువ పోస్టు వాదిస్తున్నంతగా పతనం కాలేదు. పైగా స్టాలిన్ వ్యాఖ్యల చేసిన తరవాత నుండి ఆ కంపెనీ షేర్ల విలువలో స్వల్ప(1-2%) మార్పులే కనిపిస్తున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యల అనంతరం సన్ టీవీ షేర్లు తగ్గినట్టు ఎటువంటి కథనాలు కూడా లేవు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులో చెప్తున్న విషయం కల్పితమని స్పష్టమవుతుంది.

చివరగా, సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల అనంతరం సన్ టీవీ షేర్లు భారీగా పడిపోయాయన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll