చైనాలో వరదలు భీభత్సం సృష్టిస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. చైనా ప్రపంచం మీదకి కరోనా వైరుస్‌ని వదులుతే, ప్రకృతి 1000 సంవత్సరాలకు ఒక్క సారి వచ్చే వరదలని చైనా మీదకు వదిలిందని ఈ పోస్టులో తెలిపారు. చైనా దేశంలో ఇటీవల వచ్చిన వరదలు అక్కడ భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: చైనా దేశంలో వరదలు భీభత్సం సృష్టిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 2011లో జపాన్ దేశంలో విరుచుకుపడిన సునామీ దృశ్యాలని చూపిస్తుంది. 2011లో జపాన్ దేశంలో తీవ్ర భూకంపంతో ఎగసిపడ్డ సునామీలో విమానాలు, వాహనాలు కొట్టుకుపుతున్న దృశ్యాలివి. ఈ వీడియోని నార్త్ జపాన్‌లోని సెండై విమానాశ్రయం సమీపంలో తీసారు. ఈ వీడియో చైనాకి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘The Wall Street Journal’ న్యూస్ సంస్థ 29 ఏప్రిల్ 2011 నాడు తమ వెబ్సైటులో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2011లో జపాన్ దేశంలో విరుచుకుపడిన సునామీకి సంబంధించిన దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. నార్త్ జపాన్ ప్రాంతంలోని సెండై విమానాశ్రయం సమీపంలో విమానాలు సునామీలో కొట్టుకుపోతున్న దృశ్యాలని ఈ వెబ్సైటులో తెలిపారు.
పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే దృశ్యాలు కలిగిన ఫోటోలని ‘The Atlantic’ న్యూస్ సంస్థ 08 మే 2011 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేసింది. ఈ దృశ్యాలు 2011 జపాన్ సునామీకి సంబంధించినవని ఈ ఆర్టికల్ లో తెలిపారు.
2011 మార్చ్ నెలలో జపాన్ దేశంలో చోటుచేసుకున్న తీవ్ర భూకంపం వలన జపాన్ తూర్పు తీర ప్రాంతంలోని హున్షు దీవిపై భారీ సునామీ ఎగసిపడుతూ విధ్వంసం సృష్టించింది. విమానాలు, పడవలు మరియు వాహనాలు ఈ సునామీలో కొట్టుకుపోతున్న వీడియోలని పలు న్యూస్ సంస్థలు పబ్లిష్ చేసాయి. దశాబ్దం కిందట చోటుచేసుకున్న ఈ సునామీకి సంబంధించి ‘BBC’ న్యూస్ సంస్థ 11 మార్చ్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో చైనా వరదలకు సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, 2011 జపాన్ సునామీకి సంబంధించిన వీడియోని చైనా వరదల దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.