Fake News, Telugu
 

కేరళ తీరంలో NCB అధికారులు స్వాధీనం చేసుకున్న 2,500 కిలోల డ్రగ్స్ సరఫరాలో కేరళ ప్రభుత్వ హస్తముందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

కేరళ తీరంలో రూ. 25 వేల కోట్లు విలువైన మాదకద్రవ్యాలు (డ్రగ్స్) పట్టుబడిన నేపథ్యంలో, కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం చాటున పెద్ద ఎత్తున చట్టవిరుద్దమైన కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. కేరళ మరియు ఇతర బీజేపీ యేతర రాష్ట్రాలలో ఇటువంటి చట్టవిరుద్ద పనులు యథేచ్ఛగా నిర్వహించేందుకే ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు ఉచిత పథకాలను ఎర చూపిస్తున్నాయంటూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేరళ తీరంలో పట్టుబడిన రూ. 25 వేల కోట్లు విలువైన మాదకద్రవ్యాల సరఫరాలో కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం హస్తం ఉంది.

ఫాక్ట్ (నిజం): నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు భారత నౌకాదళం సహాయంతో 13 మే 2023 నాడు కేరళ తీరంలో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఒక భారీ నౌకను అదుపులోకి తీసుకొని 2,500 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌లో తయారుచేసిన ఈ మాదకద్రవ్యాలను ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నుండి ఒక భారీ నౌక ద్వారా రవాణ చేసినట్టు NCB అధికారులు మీడియాకి తెలిపారు. 2022 ఫిబ్రవరి నెలలో కూడా ‘ఆపరేషన్ సముద్రగుప్తా’లో భాగంగా NCB అధికారులు, బలూచిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి నౌకల ద్వారా సరఫరా చేయాలనుకున్న 750 కిలోల డ్రగ్స్‌ను గుజరాత్ తీరంలో పట్టుకున్నారు. కేరళ తీరంలో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్‌ రవాణాలో లేదా పంపిణీలో కేరళ ప్రభుత్వ హస్తం ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కి పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే,  ఆపరేషన్ సముద్రగుప్తా’లో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు భారత నౌకాదళం సహాయంతో 13 మే 2023 నాడు కేరళ తీరంలో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఒక భారీ నౌకను అదుపులోకి తీసుకొని 2,500 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ నౌకలో పట్టుబడిన 2.5 టన్నుల మేథంఫేటమీన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 25 వేల కోట్ల వరకు ఉండవచ్చని ఎన్‌సిబి అధికారులు మీడియాకి తెలిపారు.

పాకిస్థాన్ దేశంలో తయారుచేసిన ఈ మాదకద్రవ్యాలను ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నుండి ఒక భారీ నౌక ద్వారా రవాణ చేసినట్టు NCB డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ మీడియాతో  తెలిపారు. ఇరాన్ పోర్ట్ నుండి అరేబియా సముద్రం మీదుగా డ్రగ్స్ కన్‌సై‌న్‌మెంట్ తీసుకొని బయలుదేరిన ఈ మదర్ షిప్, దారి పొడవునా కొన్ని ప్రదేశాలలో ఆపి ఉంచితే, వివిధ దేశాల నుండి చిన్న పడవలు వచ్చి సరుకు పట్టుకొని వెళ్ళి పోతాయని సంజయ్ కుమార్ తెలిపారు. శ్రీలంక, మాల్దీవులు మరియు భారత దేశంలో డ్రగ్స్ పంపిణీ చేయడమే ఉద్దేశంగా ఈ మదర్ షిప్ డ్రగ్స్ కన్‌సై‌న్‌మెంట్ రవాణా చేసిందని, ఈ రైడ్‌లో భాగంగా ఒక పాకిస్థాన్ జాతీయుడిని అరెస్ట్ కూడా చేసినట్టు సంజయ్ కుమార్ సింగ్ మీడియాకి తెలిపారు.

కేరళ తీరంలో ఎన్‌సిబి అధికారులకు చిక్కిన 2.5 టన్నుల డ్రగ్స్ కన్‌సై‌న్‌మెంట్, పాకిస్థాన్ దేశం బలూచిస్తాన్ ప్రావిన్సులో నివాసముండే హాజీ సలీం అనే మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కింగ్‌పింగ్‌కు చెందినదని  పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

అయితే, 2022 ఫిబ్రవరి నెలలో కూడా ‘ఆపరేషన్ సముద్రగుప్తా’లో భాగంగా NCB అధికారులు, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి నౌక ద్వారా సరఫరా చేస్తున్న 750 కేజీల డ్రగ్స్‌ను గుజరాత్ తీరంలో పట్టుకున్నట్టు తెలిసింది. ‘ఆపరేషన్ సముద్రగుప్తా’లో భాగంగా ఇప్పటివరకు 4000 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేసినట్టు ఎన్‌సిబి అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ సరఫరా లేదా రవాణా కేరళలో అంతర్గతంగా చోటుచేసుకోలేదు. ఈ డ్రగ్స్ సరఫరా లేదా రవాణాలో కేరళ ప్రభుత్వ హస్తం ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

చివరగా, కేరళ తీరంలో NCB అధికారులు స్వాధీనం చేసుకున్న 2,500 కిలోల మాదకద్రవ్యాల సరఫరా లేదా రవాణలో కేరళ ప్రభుత్వ హస్తం ఉందని నిర్ధారించేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. 

Share.

About Author

Comments are closed.

scroll