Fake News, Telugu
 

క్రీ.శ. 651 నుండి పర్షియాను ఇస్లామిక్ రాజ్యాలే పాలించడం వల్ల క్రమంగా పర్షియా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది

0

పర్షియా అనే దేశంలో 4000 మంది ముస్లింలకి ఉండడానికి అనుమతి ఇస్తే, 100 సంవత్సరాల తరువాత ఆ దేశాన్ని ఇరాన్ అనే ఇస్లామిక్ రాష్ట్రంగా ప్రకటించారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ముస్లింలకు ఉండడానికి చోటు ఇస్తే వారు దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చేశారనే ఉద్దేశంలో ఈ పోస్టు షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పర్షియాలో 4000 మంది ముస్లింలకి ఉండడానికి అనుమతిస్తే 100 సంవత్సరాల తరువాత ఆ దేశాన్ని  ఇరాన్ అనే ఇస్లామిక్ రాష్ట్రంగా ప్రకటించారు.

ఫాక్ట్(నిజం): క్రీ.శ. 651లో మొదటిసారి అరబ్ రాజ్యం పర్షియాపై దండయాత్ర చేసి ఆక్రమించుకున్నప్పటి నుండి పర్షియాను వివిధ ఇస్లామిక్ రాజ్యాలే పాలిస్తూ వచ్చాయి. అలా పర్షియాలో అంతకు ముందు ఉన్న జొరాస్ట్రియనిజం మొదలైన మతాలు క్రమంగా కనుమరుగైపోయి ఇస్లాం రాజ్యంగా మారిపోయింది. ఐతే అప్పట్లో ఉన్న సామ్రాజ్యవాద విధానం వల్ల పర్షియా ఇస్లామిక్ రాజ్యంగా మారిందే తప్ప వేరే కారణం చేత కాదు. అప్పటి సామ్రాజ్య విధానాన్ని ప్రస్తుతం మన దేశంలో అమలులో ఉన్న ప్రజాస్వామ్యంతో పోల్చలేం. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముస్లింలకు దేశంలో ఉండానికి చోటిస్తే త్వరలో భారత్‌ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోతుందని చెప్పే క్రమంలో  పర్షియా యొక్క ఇస్లామీకరణను ఈ పోస్టులో ఉదాహరణగా ఉపయోగించారు. ఐతే పోస్టులో చెప్తున్నట్టు కేవలం కొంత మంది ముస్లింలకు చోటిస్తే వారు పర్షియాను ఇస్లామిక్ రాష్ట్రమైన ఇరాన్‌గా మార్చరన్న వాదన కరెక్ట్ కాదు.

అప్పట్లలో సామ్రాజ్యవాద వ్యవస్థ ఉండేది, రాజులు ఇతర రాజ్యాలపై దాడి చేసి వాటిని తమ ఆదీనంలోకి తీసుకునేవారు. అలా తమ సామ్రాజ్యాన్ని విస్తరించే వారు. పర్షియా కూడా ఇలానే క్రీ.శ.650 దశకంలో అరబ్ దండయాత్రకు గురైంది. అలా పర్షియాలోకి ఇస్లాం మతం ప్రవేశించింది.

పర్షియా చరిత్ర:

అంతకుముందు క్రీ.పూ. 550-330 మధ్య కాలంలో అచెమెనిడ్ (Achaemenid) రాజవంశం మొదటి పెర్షియన్ సామ్రాజ్యాన్ని పాలించింది. అప్పట్లో ఈ సామ్రాజ్యం ఈజిప్ట్ నుండి భారత్ (ఇండస్ వ్యాలీ) వరకు విస్తరించి ఉండేది. ఆ సమయంలో పెర్షియాలో జొరాస్ట్రియనిజం (మతం) ఆచరణలో ఉండేది.

అచెమెనిడ్ రాజ్యంపై మొదటిసారి అలెగ్జాండర్ దండయాత్ర చేసి అచెమెనిడ్ సామ్రాజ్యాన్ని జయించాడు. ఆ తరవాత పార్థియన్, సస్సానియన్ సామ్రాజ్యాలు క్రీ.పూ.247 నుండి క్రీ.శ. 651 వరకు పాలించారు. ఆ కాలంలో పర్షియాలో జుడాయిజం, క్రైస్తవం మొదలైన మతాలు ఆచరణలో ఉండేవి. కాకపోతే ఇవి ఎక్కవ కాలం నిలవలేదు. అరబుల దండయాత్ర తరవాత ఇస్లాం ఎక్కువ వ్యాప్తి చెందింది.

మొదటిసారిగా పర్షియాన్ సామ్రాజ్యంలోకి క్రీ.శ. 651లో ఖలీఫ్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ నేతృత్వంలోని అరబ్ సైన్యాలు సస్సానియన్ సామ్రాజ్యంపై దండయాత్ర చేయడం ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంది. ఇలా పర్షియాలో ఇస్లాం ప్రవేశించింది. ఆ తరవాత క్రమంగా ఇస్లాం పర్షియా అంతటా వ్యాప్తి చెందింది. జొరాస్ట్రియనిజంతో పాటు ఇతర మతాలు మెల్లగా కనుమరుగైపోయాయి.

ఆ తరవాత కూడా పర్షియాను ఇస్లామిక్ రాజ్యాలే పాలించడం వల్ల పర్షియా ఇస్లామిక్ రాజ్యంగా మారింది. 1907లో మొదటిసారిగా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి, 1935లో ఇరాన్ అనే పేరును అధికారికంగా స్వీకరించారు. దశాబ్దాలుగా పర్షియాను ఎవరు పాలించారో, పర్షియాలో మతాలు ఎలా కనుమరుగై ఇస్లాం వ్యాప్తి చెందిందో ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే అప్పట్లో ఉన్న సామ్రాజ్యవాద విధానం వల్ల కొన్ని వేల సంవత్సరాలు ఇస్లామిక్ రాజ్యాల దండయాత్రలు, ఇస్లామిక్ రాజ్యల పాలన వల్ల క్రమంగా పర్షియా ఇస్లామిక్ రాజ్యంగా మారిందే తప్ప వైరల్ పోస్టులో చెప్తునట్టు కేవలం కొంతమంది ముస్లింలకు ఉండడానికి అవకాశం ఇవ్వడం వల్ల కాదు. అప్పటి సామ్రాజ్య విధానాన్ని ప్రస్తుతం మన దేశంలో అమలులో ఉన్న ప్రజాస్వామ్యంతో పోల్చలేం.

చివరగా, క్రీ.శ. 651 నుండి పర్షియాను ఇస్లామిక్ రాజ్యాలే పాలించాయి. కాబట్టి కొంతమంది ముస్లింలకు ఉండడానికి అవకాశం ఇచ్చినందుకు పర్షియా ఇస్లామిక్ దేశంగా మారిందన్న వాదన కరెక్ట్ కాదు.

Share.

About Author

Comments are closed.