Fake News, Telugu
 

ఈ కథ సమ్మక్క-సారలమ్మ అసలైన చరిత్ర అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు

0

మేడారం చరిత్రలో సమ్మక్క-సారలమ్మలు పోరాటం చేసింది మాలిక్ కాఫుర్ పై అని, కాకతీయులపై కాదని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. సమ్మక్క-సారలమ్మల చరిత్రను వక్రీకరిస్తున్నారని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సమ్మక్క-సారలమ్మల అసలైన చరిత్ర.

ఫాక్ట్: గిరిజనులపై కాకతీయ రాజులు విధించిన పన్నులను సమ్మక్క-సారలమ్మలు వ్యతిరేకించి కాకతీయుల సైన్యంపై పోరాటం చేసారు. మాలిక్ కాఫుర్ కాకతియులపై సుమారు 1309లో దండయాత్రకు వచ్చినప్పటికీ సమ్మక్క-సారలమ్మలపై యుద్ధం చేసినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

ఇటీవల మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక వెబ్సైటును ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. అయితే, ఆ వెబ్సైటులో ఎక్కడా కూడా సమ్మక్క-సారలమ్మలు పోరాటం చేసింది మాలిక్ కాఫుర్ పై అని లేదు. కాకతీయులపై పోరాటంలో సమ్మక్క కుమారుడు జంపన్న మరణించటంతో అక్కడున్న వాగుకు ‘జంపన్న వాగు’ అని పేరు పెట్టారని తెలిపారు.

మేడారం జాతర లేదా సమ్మక్క-సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లాకి చెందిన మేడారం గ్రామంలో జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణ రాష్ట్రంలో జరిగే చాలా ముఖ్యమైన పండగ. అందుకే, తెలంగాణ టూరిజం వెబ్సైటులో కూడా మేడారం జాతర గురించి వివరించారు. అయితే ఈ వెబ్సైటులో కూడా సమ్మక్క-సారలమ్మలు పోరాటం చేసింది మాలిక్ కాఫుర్ పై అని లేదు. గిరిజనులపై కాకతీయ రాజులు విధించిన పన్నులను సమ్మక్క-సారలమ్మలు వ్యతిరేకించి, పోరాటంలో మరణించారని తెలిపారు.

ఇటీవల, భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మేడారం జాతర కొరకు 2.26 కోట్ల రూపాయలు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మేడారం జాతరకు సంబంధించి విడుదల చేసిన ఏ ఆర్టికల్‌లో కూడా సమ్మక్క-సారలమ్మలు పోరాటం చేసింది మాలిక్ కాఫుర్ పై అని లేదు. ఒక ఆర్టికల్‌లో, సమ్మక్క-సారలమ్మలు పోరాటం చేసింది కాకతీయుల సైన్యంపై అని తెలిపారు.

2016లో, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారి మేడారం జాతర జరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతరకు సంబంధించి పూర్తి వివరాల కొరకు ఒక పుస్తకం విడుదల చేసింది. సమ్మక్క-సారలమ్మల జాతర చరిత్ర గురించి అందులో వివరించారు, అయితే, కాకతీయుల సైన్యంపై పోరాడారని అందులో స్పష్టంగా ఉంది.

మాలిక్ కాఫుర్ కాకతీయులపై సుమారు 1309లో దండయాత్రకు వచ్చినప్పటికీ సమ్మక్క-సారలమ్మలపై యుద్ధం చేసినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు.

చివరగా, ఈ కథ సమ్మక్క-సారలమ్మల అసలైన చరిత్ర అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll